మహదేవునికి సముద్రుని జలాభిషేకం
తీర్థయాత్రలో భాగంగా ఈ వారం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ ఆలయ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని ఒక సముద్రతీర గ్రామంలో కొలువైవున్న మహాశివునికి స్వయంగా సముద్రుడే అభిషేకం చేయడం విశేషం. సముద్రుని రూపంలో ప్రకృతి పూజలు చేయడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? ఇది జగత్ మహత్మ్యం. ఆ మహత్మ్యాన్ని తెలుసుకుందాం రండి. గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ జిల్లాలోని కవి అనే గ్రామంలో స్తంభేశ్వర మహదేవ ఆలయం నిర్మితమై ఉంది. ఈ ఆలయం సముద్రతీరానికి సమీపంలో వుంది. అమవాస్య, పౌర్ణమి రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు సంభవించే ఆటుపోట్ల కారణంగా భారీ అలలు ధాటికి సముద్రపు నీరు ఒడ్డుకు రావడం మనం చూస్తుంటాం. సముద్రతీరం అంచునే స్తంభేశ్వర ఆలయం ఉంటడం వల్ల ఆటుపోట్లకు వచ్చే సముద్రపు నీటితో ఆలయంలోని శివలింగం పూర్తిగా మునిగిపోతుంది. ఈ అపురూప సంఘటనను ప్రకృతి అభిషేకంగా పిలుస్తారు. సముద్రుడే స్వయంగా మహాశివునికి జలాభిషేకం ప్రతి రోజు చేస్తున్నట్టుగా ఇక్కడకు వచ్చే భక్తులు
భావిస్తుంటారు. ప్రతి రోజు రెండు సార్లు ఈ అపురూప దృశ్యం ఇక్కడ చూడొచ్చు. ప్రకృతి సహజసిద్ధంగా ఈ అభిషేకం జరగటం వల్ల ఈ ఆలయంలోని శివలింగానికి ప్రకృతే పూజలు చేస్తుందన్న నమ్మకం భక్తులో నెలకొంది.
ఈ ప్రకృతి మహత్మ్యాన్ని కనులారా వీక్షించాలని భావించే వారు.. సంపూర్ణ భక్తిభావంతో అలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ సాక్షాత్ త్రినేత్రుడే నివశించినట్టు ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతి జలాభిషేక పూజా సమయానికి ఆలయం భక్తులతో నిండిపోతుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు రెండు నేత్రాలు సరిపోవని పలువురు భక్తులు అంటుంటారు.
పురాణ గాధ... శివుని కుమారుడైన కార్తికేయన్.. దేవతా సైన్యానికి దళపతిగా ఆరు రోజుల పాటు నియమితులవుతాడు. ఆ సమయంలో రాక్షసుడైన తారకాసురుడు దేవతులను, భిక్షవులను చిత్ర హింసలకు గురి చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయన్ తారకాసురుడుని హతమార్చి దేవతలతో పాటు.. ఇతరులను రక్షిస్తాడు. అయితే.. ఈ తారకాసురుడు శివుని పరమ భక్తుడు. ఇది తెలుసుకున్న కార్తికేయన్ ఎంతో చింతిస్తాడు. పాప విముక్తి కోసం విష్ణు దేవుని కార్తికేయన్ ప్రార్థిస్తాడు. అపుడు కార్తికేయన్‌కు విష్ణువు ఒక సలహా ఇస్తాడు. అదేమిటంటే.. తారకాసురుని హతమార్చిన ప్రాంతంలో మహాశివునికి ఒక ఆలయం నిర్మించాలని చెపుతాడు. అది కాలక్రమేణా స్తంభేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందినట్టు పురణాలు పేర్కొంటున్నాయి.
ఈ ఆలయంలో ప్రతినెలా అమవాస్య రోజున ప్రత్యేక పూజలు సాగుతుంటాయి. అలాగే శివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అమవాస్య తర్వాత 11వ రోజున భక్తులు ఒక సంపూర్ణ రాత్రి పూజలు చేస్తూ భక్తిలో లీనమవుతారు. దేశంలోని నలు దిక్కుల ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడకు వచ్చి, తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ముక్తి పొందుతుంటారు. ముఖ్యంగా ప్రకృతే మహాశివునికి అభిషేకం చేసే అపురూప దృశ్యాన్ని తమ కనులారా వీక్షించి తరిస్తారు. ఈ ప్రాంతానికి దేశంలోని నలుదిక్కుల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.