పూజలందుకునే దాదా ధునివాలె దాదాజీ
దాదా దునివాలెజీ పేరు చెబితే షిర్డీ సాయిబాబా వంటి ఆధ్యాత్మిక గురువులు గుర్తుకువస్తారు. దాదాజీగా పిలువబడే స్వామీ కేశవానందజీ ఓ అద్భుత ఋషి. ఆయన నిత్యం మండుతున్న అగ్ని (ధుని) ముందు కూర్చునే ఉండేవారు. అందువల్లనే ఆయనకు దాదా దునివాలె అనే పేరు వచ్చింది. హిందీలో దాదా అంటే తాతయ్య అని అర్థం. శివుని అవతారంగా ఆయనకు పూజలు అందుకునేవారు. అయితే ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు లేవు, కానీ ఆయనపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. దాదా దర్బార్ ( దాదాజీ నివాసం) ఆయన సమాధి ప్రాంతంలోనే కొలువై ఉన్నది. గురుపూర్ణిమ పుణ్యదినాన ఇక్కడ జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు వేలమంది భక్తులు దేశం నలుమూలలనుంచే
కాక విదేశాలనుంచి సైతం తరలివస్తారు.
దాదాజీ పేరన దేశంలోని వివిధ ప్రాంతాలలో 27 ధామ్‌లు ( దాదాజీని ప్రార్థించే పుణ్యస్థలాలు) పూజలందుకుంటున్నాయి. ఆయన జీవించి ఉన్న కాలంలో ధుని అని పిలువబడే అగ్ని నిత్యం వెలుగుతూ ఉండేది. 1930లో ఆయన సమాధిలోకి వెళ్లారు. ఆయన సమాధి ఖాండ్వా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
చోటే దాదాజీ ( స్వామి హరిహరనాథ్‌జీ )
రాజస్థాన్‌లోని దిద్వానా గ్రామానికి చెందిన భన్వర్‌లాల్ ఓసారి దాదాజీని దర్శించుకునేందుకు వెళ్లారు. దాదాజీని చూసినంతనే ఆయనకు దాసుడై ఆయన పాదాల చెంతనే కాలం గడపటం మొదలుపెట్టాడు. ఎంతో ఉదారస్వభావి అయిన స్వామి హరినాథ్ విష్ణుమూర్తి అవతారంగా భక్తులు కొలిచేవారు.
ఆయనను చోటే దాదాజీగా పిలువబడ్డారు. దాదా దునివాలే సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన మార్గంలోనే నడిచినవారు చోటే దాదాజీ. భక్తులు చేత పూజలందుకున్న చోటే దాదాజీ అనారోగ్య కారణంగా 1942లో సమాధిలోకి వెళ్లారు.
ఎలా వెళ్లాలి
ఖాండ్వా పట్టణానికి రోడ్డు మరియు రైలు సౌకర్యం ఉన్నది. ఇండోర్ (140 కిమీ) సమీప ఎయిర్‌పోర్టు.