కోర్కెలు తీర్చే పవిత్రమూర్తి సింగాజీ
, ఆదివారం, 18 మే 2008 (19:23 IST)
తీర్థయాత్రలో భాగంగా ఈసారి సింగాజీ మహరాజ్ దేవాలయాన్ని సందర్శిద్దాం. ఈ దేవాలయం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్లియా గ్రామంలో కొలువై ఉన్నది. గవాలి సమాజంలో జన్మించిన సింగాజీ ఓ సామాన్యమైన వ్యక్తిత్వం కలవాడు. అయితే మన్రంగ్ స్వామివారి బోధనలతో అతని మనస్సు ఆధ్యాత్మిక చింతనవైపు పయనించింది. నిర్గుణ మార్గంలో పయనించిన సింగాజీ మాల్వా- నిమాద్ ప్రాంతంలో ప్రసిద్ధికెక్కాడు. తీర్థయాత్రలు, ఉపవాసాలపై ఆయనకు నమ్మకం లేదు. భగవంతుడు మన హృదయంలోపలే ఉంటాడని విశ్వసించాడు. ఎవరైనా తమ ఆత్మను పూర్తిగా అవలోకనం చేసుకున్నట్లయితే తీర్థయాత్రలు, ఉపవాసాల జోలికి వెళ్లరంటారు. తన కాలంలో ఆయన ఎన్నో సాంఘక సేవా కార్యక్రమాలు చేశారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించాల్సిందిగా సింగాజీకి ఒకనాడు అభ్యర్థన వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే... ఎక్కడైతే జలము మరియు ఓ రాయి ఉంటుందో అది ఓ పుణ్యక్షేత్రమేననీ, అక్కడ చిన్నకాలువలో పుణ్యస్నానం చేయటం గంగానదిలో చేసినదానితో సమానమని చెప్పారు. అంతేకాదు, ఆయన తన కాలంలో ఎటువంటి ఆలయాన్ని, ఆధ్యాత్మికతను తెలియజేసేటటువంటి ఎటువంటి కట్టడాన్ని నిర్మించలేదు. సింగాజీ తన గురువు సూచన మేరకు శ్రావణ శుక్ల తొమ్మిదో రోజున తన శరీరాన్ని వీడారు. అయితే ఆయన ఆఖరి కోరిక సంపూర్ణంకాలేదంటారు. ఆయన తనువు చాలించిన ఆరు నెలల తర్వాత తన శిష్యుల కలలోకి వచ్చి తనను కూర్చున్న భంగిమలోనే సమాధి చేయాల్సిందిగా కోరాడట. ఆయన కోరిక మేరకు ఆయన అనుసర గణం సింగాజీని కూర్చున్న భంగిమలోనే సమాధి చేశారట.
ఈ ఆలయం కొలువై ఉన్న పట్టణాన్ని నర్మద ప్రాజెక్టు ఆక్రమిస్తోంది. ఈ చారిత్రాత్మక మందిరాన్ని రక్షించేందుకుగాను 60 అడుగుల ఎత్తులో సిమెంటు కాంక్రీట్ గోడను చుట్టూ నిర్మించారు. పురాతన మందిరంపై కొత్తగా మరో దేవాలయాన్ని నిర్మించారు. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా సింగాజీ పాదముద్రలను భక్తులు సందర్శించేందుకు వీలుగా తాత్కాలికంగా మరోచోటకు తరలించారు. ఇక్కడ అద్దంలో స్వస్తిక్ ఆకారాన్ని చేయటం ద్వారా తమ కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. తమ కోర్కెలు నెరవేరిన తర్వాత మరోసారు భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్వస్తిక్ ఆకారాన్ని కుడివైపు చేస్తారు. శరత్ పూర్ణిమ రోజున ఇక్కడ అత్యంత ఘనంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఎలా వెళ్లాలి-
రోడ్డు ద్వారా... ఖాండ్వా నుంచి ప్రతి 30 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది.
రైలు ద్వారా... ఖాండ్వా నుంచి సమీప రైల్వే స్టేషనకు రైలు సౌకర్యం ఉంది.