పురాణాల్లో తెలిపిన 108 శక్తి క్షేత్రాల్లో ఒకటి కరివీర ప్రాంతం. దీనినే వర్తమాన కాలంలో కొల్హాపూర్‌గా పిలుస్తున్నారు. ఇక్కడ వెలసిన అమ్మవారే కొల్హాపూర్ మహాలక్ష్మి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వక్షస్థల వాసిని శ్రీమహాలక్ష్మి.
శ్రీవారు కలియుగంలో అలివేలు మంగతాయారు (పద్మావతి) ను పరిణయమాడారు. పద్మావతిని కళ్యాణమాడిన శ్రీవారిపై భార్గవి నందని అయిన లక్ష్మీ అమ్మవారు అలిగారు. దీనితో అమ్మవారు వైకుంఠవాసుడికి విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్‌లో వెలిశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‍లో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. పంచగంగ నది ఒడ్డున కొల్హాపూర్ నగరం ఉంది. కొల్హాపూర్ దేవాలయాన్ని క్రీస్తు శకం ఏడో దశాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజు కరణ్ దేవ్ కట్టించారు.
ఆ తర్వాత 9వ శతాబ్దంలో యాదవ రాజు వంశానికి చెందిన షిలాహార యాదవుడు మరింత అందంగా దేవాలయాన్ని తీర్చిదిద్దటానికి కృషిచేశాడు. దేవాలయంలో లోపల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం స్వయం వ్యక్తమని ప్రజలు భావిస్తారు.
అమ్మవారికి అర్చకులు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు.
వసతి
కొల్హాపూర్ దేవాలయ సమీపంలో ధర్మశాలలు ఉన్నాయి. వీటితో పాటుగా ఆధునిక వసతులు గల హోటెళ్లు ఉన్నాయి.
ఎలా వెళ్లాలి?
రోడ్డు మార్గం
ముంబాయి-బెంగళూరు జాతీయ రహదారిపై కొల్హాపూర్ ఉంది. ముంబాయి నుంచి 396 కి.మీ., షోలాపూర్ నుంచి 247 కి.మీ., బెంగళూరు నుంచి 602 కి.మీ., పూణె నుంచి 233 కి.మీ.,
రైలు మార్గం
మీరజ్ నుంచి కొల్హాపూర్ వరకూ ప్రత్యేక రైలుమార్గం ఉంది. కొల్హాపూర్ రైల్వే స్టేషన్‌ను ప్రస్తుతం ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మినస్‌గా పిలుస్తున్నారు. సమీపంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ మీరజ్. లోండా-పూణె మార్గంలో మీరజ్ ఉంది. కొల్హాపూర్ నుంచి ప్రతిరోజూ ముంబాయి, నాగపూర్, బెంగళూరు, తిరుపతికి నేరుగా రైలు సౌకర్యం ఉంది.
విమాన మార్గం
ముంబాయి నుంచి కొల్హాపూర్‌కు ప్రతిరోజూ విమాన సేవలను ఎయిర్ డెక్కన్ నడుపుతుంది.