Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బర్హాంపూర్‌లో తిరుగాడుతున్న ముంతాజ్ ఆత్మ

బర్హాంపూర్‌లో తిరుగాడుతున్న ముంతాజ్ ఆత్మ
ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ మొఘల్ రాజు షాజహాన్‌కు, ముంతాజ్ బేగంకు మధ్య ప్రేమగాథకు నిదర్శనం. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే తాజ్‌మహల్‌ నిర్మించడానికి ముందు ముంతాజ్ మృతదేహాన్ని బర్హాంపూర్‌లోని బులారా మహల్‌లో పూడ్చి పెట్టిన విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇప్పటికీ ఈ మందిరంలో ముంతాజ్ ఆత్మ తిరుగాడుతూ ఉంటుందని నానుడి.

దాదాపు 400 ఏళ్ల క్రితం బులారా మహల్‌లో మొఘల్ రాణి ముంతాజ్ బేగం కన్నుమూసినప్పుడు ఆమె జ్ఞాపకార్థం షాజహాన్ ఒక అందమైన స్మారకమందిరాన్ని నిర్మించాలని భావించాడు. తర్వాతే ఆయన మనసులో తాజ్‌మహల్ రూపుదిద్దుకుంది. మొదట్లో ఈ మందిరాన్ని బర్హాంపూర్‌లోనే నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల దాన్ని ఆగ్రాలో నిర్మించారు.

తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే ముంతాజ్ దేహాన్ని అక్కడికి తరలించారు. అయితే ముంతాజ్ మృతదేహాన్ని మాత్రమే అక్కడినుంచి తీసుకుపోయారు తప్ప ఆమె ఆత్మ మాత్రం ఇప్పటికీ బులారా మహల్‌లోనే ఉండిపోయిందని స్థానికులు ఇప్పటికీ భావిస్తున్నారు.

బులారా మహల్ నుంచి ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటాయట. అయితే ముంతాజ్ ఆత్మ ఇంతవరకు ఎవరినీ గాయపర్చలేదని స్థానికులు చెబుతుంటారు. చారిత్రక వాస్తవాలను బట్టి చూస్తే 1631లో ముంతాజ్ ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత మరణించింది. బిడ్డ పుట్టాక మరణించింది కాబట్టే ఈ మందిరంలో ఇప్పటికీ ముంతాజ్ ఆత్మ బిడ్డకోసం తపిస్తూ తిరుగాడుతూ ఉందని స్థానికులు చెబుతుంటారు.
WD


మరి బర్హాంపూర్‌ మందిరంలో తిరుగాడుతున్న ఆత్మ గురించిన వార్తలు నిజమా లేక ఈ ప్రాంతానికి చెందిన అసాంఘిక శక్తులు ఇక్కడ తమ అక్రమ కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగించేందుకు గాను ఇలా ఆత్మ గురించిన ప్రచారాలు చేస్తున్నాయా..? దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి..? ఇటువంటి సంఘటనలు మీ దృష్టిలోకి వస్తే దయచేసి మాకు తెలుపండి.

Share this Story:

Follow Webdunia telugu