Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోరిన కోర్కెలు తీర్చే పాముల జంట

కోరిన కోర్కెలు తీర్చే పాముల జంట
WD
నమ్మకం, విశ్వాసాల గురించి ఏదినిజం శీర్షికలో మనం మాట్లాడుకుంటూనే వున్నాం. ఈ విశ్వాసాల పరంపరలో ఈసారి మీ ముందు మరో విషయాన్ని వుంచబోతున్నాం. నాగదేవత, నాగరాజుల మధ్య వున్నటువంటి ప్రేమానుబంధాలు గురించిన కథలు ఎప్పటినుంచో ప్రచారంలో వున్నాయి. వాటికున్న అతీత శక్తులను సైతం ఆవిష్కరిస్తూ ఎన్నో సినిమాలు వెండితెరకెక్కాయి. అయితే ప్రస్తుత సమాజంలోనూ ఈ విశ్వాసాలు కొన్నిచోట్ల ఇలానే కొనసాగుతున్నాయి. అదే విషయాన్ని ఈసారి ఏదినిజంలో మీ ముందు వుంచబోతున్నాం.

ఈక్రమంలో మిమ్మల్ని గుజరాత్ బరోడా పట్టణంలోని మంజల్‌పూర్‌కు తీసుకెళుతున్నాం. ఇక్కడే ఆ మందిరం వున్నది. దానికి అచ్చెరువు గొలిపే అతీత శక్తులున్నాయి. మనం మామూలుగా చూసే నాగరాజు, నాగదేవత ఆలయాలకంటే ఇది భిన్నంగా కనబడుతుంది. అందుకే భక్తులు ఈ మందిరాన్ని ప్రేమ మరియు ఆధ్యాత్మికతలను తెలిపే పవిత్ర చిహ్నంగా భావిస్తారు.

ఈ ఆలయ చరిత్ర గురించి అడిగినపుడు దేవాలయ మేనేజర్ శ్రీ హరాన్భాయ్ సోలంకి ఓ భయంకర కథను చెప్పుకొచ్చాడు. అది 2002లో జరిగిన ఓ సంఘటన. ఆ ఏడాది శ్రావణ మాసంలో ఓ కుటుంబం ఓ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుని అటువైపుగా కారులో వెళుతోంది. అదే సమయంలో ఓ పాముల జంట రోడ్డును దాటే ప్రయత్నం చేశాయి. అయితే అనుకోకుండా వేగంగా వస్తున్న కారు చక్రాల కిందపడి పాముల జంటలోని ఆడపాము మరణించింది. అంతే... ఆ పరిణామాన్ని చూసిన మగపాము ఆ నిజాన్ని జీర్ణించుకోలేక తన తలను రోడ్డుకేసి కొట్టుకుని ప్రాణం విడిచింది.
webdunia
WD


ఆ దృశ్యాన్ని చూసిన అక్కడి ప్రజలు మ్రాన్పడిపోయారు. నాడు ప్రత్యక్షంగా ఆ సంఘటనను చూసిన ప్రజలు వాటి పవిత్ర ప్రేమకు చిహ్నంగా ఓ మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. అనుకున్నట్లే మందిరాన్ని నిర్మించారు. అయితే ఆ మందిరం నిర్మించిన మరుసటి రోజే అక్కడ భారీ విస్పోటనం సంభవించింది. ఫలితంగా మందిరం రెండు నుంచి మూడు అడుగుల లోతునకు దిగబడిపోయింది. ఇప్పటికీ దీనిని ఓ అద్భుతంగా చెబుతుంటారు.

webdunia
WD
ఇప్పటికీ అక్కడ ఇటువంటి చిత్ర విచిత్రాలను జరుగుతూనే వున్నాయని ఆలయ పూజారి మాతో చెప్పాడు. దీనికి ఉదాహరణగా ఏడేళ్ల క్రితం జరిగిన ఓ సంఘనను అతను ఉటంకించాడు. ఈ ఆలయంలో ఓ భక్తుడు ఓ చిన్న కొబ్బరికాయను పగులగొడితే... పగిలిన తర్వాత రెండు చిప్పల సైజు వాటి సైజును మించి రెండు పెద్ద కొబ్బరి చిప్పలుగా మారాయి.

ఇటువంటి మహత్యాలు జరుగుతున్నాయని తెలుసుకున్న ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించటం మొదలుపెట్టారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని నాగరాజు, నాగదేవతలను వేడుకుంటున్నారు. కేవలం కుటుంబ సుఖసంతోషాలనే కాక తమ వ్యాపారం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ వ్యాపారవేత్తలు, సంతానలేమితే బాధపడుతున్న జంటలు తమకు సంతానభాగ్యాన్ని ప్రసాదించమని వేడుకునే భక్తులతో ఈ మందిరం రద్దీగా వుంటుంది.

మన దేశంలో ఇటువంటి నమ్మకాలు, విశ్వాసాలకు కొదవేలేదు. అయితే ఈ నమ్మకాలన్నీ ఏదోరకంగా భగవంతునితో అనుసంధానమై వున్నాయి. అయితే ఇటువంటి గాథలు వెనుక వున్న అసలు నిజం ఏమిటీ... అంటే చెప్పటం కష్టమే మరి.
webdunia
WD


ఇందులో నిజమెంత... అని ఆధ్యాత్మిక భావాలను కలిగిన వ్యక్తులను ప్రశ్నించటం, వారి నమ్మకాలనుంచి వెలుపలకి తీసుకురావడం కష్టసాధ్యమే. ఇటువంటి నమ్మకాలలో పూర్తిగా కూరుకుపోయిన ప్రజలను కొందరు విశ్వాసాలను అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. చాలా సందర్భాల్లో చాలా సాధారణమైన సంఘటనలకు అత్యద్భుత ఆధ్యాత్మికతను రంగరించి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇటువంటి వాటిపై మీరేమనుకుంటున్నారో మాకు రాయండి.

Share this Story:

Follow Webdunia telugu