తిరుమలలో స్త్రీలు పువ్వులు ఎందుకు ధరించరో తెలుసా?
తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణం ఆవరణలో పడిపోటునకు ఆనుకొని తూర్పు దిక్కున ఉన్న అర(గది)ను పూల అర అని పుష్పమండపం అంటారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణం ఆవరణలో పడిపోటునకు ఆనుకొని తూర్పు దిక్కున ఉన్న అర(గది)ను పూల అర అని పుష్పమండపం అంటారు. ఈ పుష్పమండపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి మూలమూర్తికి ఉత్సవ మూర్తులకు, ఆలయంలోని ఇతర మూర్తులకు సరిపడునట్లుగా అలంకరించేందుకుగాను ప్రతినిత్యం సుగంధ, పరిమళాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో మనోజ్ఞంగా వివిధ కొలతలతో పూలమాలలు కూర్చబడుతూ ఉంటాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 3.30 గంటలకు, సాయంత్రం 7 గంటలకు జరిగే శ్రీ స్వామివారి తోమాలసేవకు గాను ఈ అరలో పుష్పమాలికలు సిద్ధం చేయబడతాయి. అంతేకాదు. నిత్యమూ జరిగే శ్రీ స్వామివారి నిత్యకళ్యాణోత్సవాలకు, ఊరేగింపులకు, ఉత్సవాలకు కూడా ఈ పూల అరలోనే పూలదండలు సమకూర్చబడతాయి. ఇలా తిరుమల శ్రీనివాసునికి, ఇంకా వివిధ మూర్తులకు నిత్యమూ అవసరమయ్యే పూలమాలల్ని సమకూర్చే ఈ పూల అరను యమునోత్తర లేదా యామునోత్తరై అని కూడా అంటారు.
యమునోత్తర అనగా యమునాతీరం. శ్రీ స్వామి పుష్కరిణే యమునా నది. ఆ తీరంలో వెలసి ఉన్న శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాత్ ద్వాపరయుగం నాటి శ్రీక్రిష్ణుడు. కాబట్టే ఈ యమునోత్తరలో శంఖచక్రధారియై, వేణుగానలోలుడైన శ్రీకృష్ణుని శిలా విగ్రహం రుక్మిణీ సత్యభామా సమేతంగా దక్షిణాభిముఖంగా ప్రతిష్టింపబడింది. సుమారు ఒక అడుగు ఎత్తు ఉన్న ఈ విగ్రహ సౌందర్యాన్ని తనివితీరా భక్తులు చూసి తరిస్తుంటారు.
శ్రీకృష్ణుణ్ణే ఇప్పటి శ్రీనివాసుడు అన్నట్లుగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్ల పండుగనాడు శ్రీ వేంకటేశ్వరుడు ఈ అరలోనికి వేంచేసి పూవు నివేదనలందుకొంటున్నాడు. శ్రీస్వామివారి వెంట మరొక పల్లకీపై శ్రీకృష్ణుడు కూడా ఈ యమునోత్తర మండపానికి వేంచేసి పూజలందుకుంటాడు. ఇంతమాత్రమే కాక ఈ పూల అరకు మరో ప్రత్యేకత కూడా ఉంది. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో శ్రీ రంగక్షేత్రంలో భగవద్రామానుజుల వారు (క్రీ.శ.1017-1137) తమ శిష్యులకు తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ వేంకటాచలంలలో వెలసి ఉన్న శ్రీనివాస ప్రభువు పుష్పాలంకార ప్రియుడనీ, అందువల్లే ఆ పర్వత శ్రేణులన్నీ అనాదిగా పుష్ప వనాలతో వెలుగొందుతున్నాయనీ కాబట్టే తిరుమల క్షేత్రం పుష్పమండపం అని ప్రసిద్థి పొందిందని వివరించారు.
అంతేకాకుండా పన్నిద్ధరాళ్వారులలో సుప్రసిద్ధులై పరాంకుశ దివ్యసూరులని పేరుపొందిన నమ్మాళ్వారులవారు కూడా తిరుమల శ్రీనివాస ప్రభువు పుష్పాలంకార ప్రియుడని, అందువల్ల ఆ స్వామివారికి పుష్ప కైంకర్యం చెయ్యడం అత్యంత ప్రియమైన, పవిత్రమైన కార్యం అని తిరువాయ్ మొళి అనే తమ గ్రంథంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా శ్రీరామానుజాచార్యులు వివరిస్తూ, తిరుమల క్షేత్రంలో అప్పటికీ సరిగా జరగని లేదా ఆగిపోయిన పుష్ప కైంకర్య సేవను పునరుద్ధరించడానికిగాను శిష్యులను ప్రేరేపించారు.
రామానుజుల ఆనతి మేరకు వారి శిష్యులైన అనంతాళ్వారు తిరుమలకు వచ్చి, నిత్యమూ శ్రీ వేంకటేశ్వరస్వామికి పుష్ప కైంకర్యం చేస్తూ ఉండేవారు. అయితే అంతకుముందే చాలాకాలం కిందట రామానుజుల వారి పరమగురువు అయిన యమునాచార్యుల వారు కూడా కొంతకాలం తిరుమల క్షేత్రంలో ఉంటూ శ్రీ స్వామివారికి పుష్ప సమర్పణను చేశారని పెద్దల వలన విని, అనంతాళ్వవారులు, ప్రస్తుతం చేస్తున్న పుష్ప కైంకర్యాన్ని కూడా యమునాత్తురై అని వారి పేరు మీదగానే ఏర్పాటు చేసి కొనసాగించినట్లుగా శ్రీవేంకటాచల ఇతిహాసమాల అనే గ్రంథంలో అనంతాళ్వారులే స్పష్టం చేసి ఉన్నారు. నేటికీ శ్రీనివాసునికి యమునాత్తురై పేరిటనే తిరుమలలో పుష్ప కైంకర్యం కొనసాగుతోంది.
శ్రీవేంకటేశ్వరస్వామి పుష్పాలంకార ప్రియుడు, తిరుమల క్షేత్రం పుష్పమండపం అన్న ప్రశక్తిని ఈ పూల అర ప్రధాన తార్కాణంగా మనకు దర్శనమిస్తూ ఉంది. పుష్పమండపం అని పేరొందిన తిరుమల క్షేత్రంలో భక్తులు ఎవరూ పూలు ధరించరాదు. ధరించకూడదు కూడా. ఇక్కడ ఇతరులు, పూలు ధరించడం నిషేధం. కుసుమాలన్నీ కొండలరాయని పూజ కొరకే. అది క్షేత్ర సంప్రదాయం కూడా. అందుకే శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్యమూ జరిగే పుష్ప కైంకర్యంలో ప్రాచీన కాలం నుంచే పెరిందేవితోట, అనంతాళ్వారుతోట, తాళ్ళపాకంవారితోట, తరిగొండ వెంగమాంబతోట, సురపురం తోట, రాంబగీచ అనేకమైన పుష్పవనాలు తిరుమల పర్వత శ్రేణులలో నెలకొని పాలుపంచుకున్నాయి. అందుకే శ్రీనివాసుని పరమభక్తురాలైన తరిగొండ వెంగమాంబ పుష్పజాతుల విష్ణు పూజింపగల కొండ అని తిరుమల కొండ ప్రశక్తిని పేర్కొంది. తోటల స్థలాలన్నీ నేడు నామమాత్రములై మిగిలి ఉన్నాయి.
అయినా ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వరుని పుష్ప కైంకర్యాన్ని మయునాత్తురై పేరిటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి పుష్పోద్యాన వనశాఖ నిర్వహిస్తోంది. ప్రస్తుతం పూల అర ఇటీవలి కాలంలో లడ్డు, వడ వగైరా ప్రసాదాలను నిల్వ ఉంచే గదిగా ఉపయోగింపబడుతూ ఉంది. ప్రస్తుతం విమాన ప్రదక్షిణంలో శ్రీ యోగనరింహస్వామి ఆలయ ప్రదక్షిణం మార్గంలో ఉత్తరం దిక్కున ఉన్న భాగాన్ని పుష్ప అరగా ఉపయోగించడం జరుగుతోంది.
ఈ పుష్ప అర నుండి ఒక నిర్ణీత పద్ధతి ప్రకారం పూలమాలలు కూర్చబడి శ్రీ స్వామివారి అలంకరణకు పంపబడతాయి. శ్రీ స్వామివారికి నిత్యమూ జరిగే పుష్పాలంకరణలో ఎట్టి మార్పులు చేర్పులు ఉండవు. కాకపోతే బుతువులననుసరించి వచ్చే పూలు మారవచ్చు తప్ప అలంకరణలో ఏ మార్పులు ఉండవు.. జరగవు. శ్రీస్వామివారికి ఉదయం, సాయంత్రం ఇలా రెండుమార్లు జరిగే తోమాలసేవలో పుష్పాలంకరణ జరుగుతుంది.