Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి భక్తుల వెంటే వేంకటేశుని సుదర్శన చక్రం... ఎందుకు...?!

తిరుమల శ్రీవారి ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ సుదర్శన భగవానుడు పంచలోహ విగ్రహమూర్తిగా చక్రాకార రూపంలో వేంచేసి దర్శనిమస్తూ ఉన్నాడు. సుమారు 6 అంగుళాల ఎత్తు కలిగిన చతురస్ర పీఠంపై

శ్రీవారి భక్తుల వెంటే వేంకటేశుని సుదర్శన చక్రం... ఎందుకు...?!
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (15:31 IST)
తిరుమల శ్రీవారి ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ సుదర్శన భగవానుడు పంచలోహ విగ్రహమూర్తిగా చక్రాకార రూపంలో వేంచేసి దర్శనిమస్తూ ఉన్నాడు. సుమారు 6 అంగుళాల ఎత్తు కలిగిన చతురస్ర పీఠంపై సుమారు రెండు అడుగుల ఎత్తు కలిగిన గుండ్రని చక్రాకారంతో విరాజిల్లుతూ ఉన్న శ్రీ సుదర్శన భగవానునికి సంవత్సరంలో నాలుగుమార్లు శ్రీ స్వామిపుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. ప్రతి బ్రహ్మోత్సవంలోను రథసప్తమి పండుగనాడు, అనంత పద్మనాభ చతుర్థశి రోజున వైకుంఠ ద్వాదశినాడు ఇలా నాలుగుమార్లు జరుగుతున్న శ్రీ సుదర్శన చక్రస్నానాన్ని గురించి తెలుసుకుందాం..
 
తిరుమలలో శ్రీ సుదర్శన భగవానులు శ్రీ స్వామివారి కుడిచేతిలోను, జ్యోతిస్ప్వరూపంగాను, ఉత్సవమూర్తిగాను దర్శనమిస్తూ భక్తుల చేత ఎలా సేవింపబడుతున్నాడో భక్తులను రక్షిస్తూ ఉంటాడు. ఆనంద నిలయంలో స్వామివారి కుడిచేతిలో చక్రాయుధంగా సుదర్శనుడు వేంచేసి ఉన్నాడు. మరి శ్రీవారు ధరించిన ఈ చక్రం ఎలాంటిది... దాని స్వరూపం ఏమిటి..? కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించే జ్యోతిశ్చక్రమట. ఇదే భావంతో తాళ్లపాక అన్నమాచార్యులు కూడా శ్రీనివాసుని చేత సుదర్శన చక్రాన్ని వర్ణించాడట. తన ఈ దివ్యచక్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తన అంతరంగిక భక్తుడైన తొండమాను చక్రవర్తికి ఇచ్చి ఆదుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
భక్త రక్షణ కోసం శ్రీ వేంకటేశుడు శంఖచక్రాలను ధరించి సిద్ధమై సర్వసన్నద్థమై ఉంటాడు. సర్వకాలాల్లో సర్వప్రదేశాల్లో సర్వావస్థల్లో భక్తులను ఆదుకునే ఆపద్భంధువు ఆనందనిలయుడు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి దుష్టశిక్షణ, భక్త రక్షణ కార్యక్రమంలో సుదర్శన భగవానుడు నిత్యమూ అప్రమత్తంగా పాల్గొంటూ సేవ చేస్తున్నాడు. అలాంటి సమయాల్లో శ్రీ స్వామివారు తన చక్రాన్ని ప్రయోగించడట. కేవలం మనసులో సంకల్పిస్తాడట. అలా శ్రీనివాసుడు భక్తులను రక్షించ వలసిందని సుదర్శనుణ్ణి సంకల్పించిన వెంటనే తిరుమలకు వచ్చే యాత్రికులు, ఇంటి వద్ద యాత్రికుల సంకల్పం చేసుకున్న క్షణం నుంచి, యాత్రలో బస్సుల్లో, రైళ్ళలో తిరుమలలో కళ్యాణకట్టలో స్వామి పుష్కరిణిలో, వైకుంఠ క్యూల్లో, దర్శనవేళల్లో ఇలా సర్వే సర్వత్రా మళ్ళీ ఆ భక్తులు ఇండ్లకు చేరేంత వరకు అప్రమత్తంగా అత్యంత జాగారుడైనా భక్త రక్షణ చేస్తుంటాడు సుదర్శన భగవానుడు.
 
ఏ భక్తునికైనా, ఎక్కడైనా ఏదైనా ఆపద కలిగినా వెంటనే ఆ భక్తుడు గోవిందా.. ఏడుకొండలవాడా.. గోవిందా.. వెంకటరమణా..ఆపద మ్రొక్కులవాడా..గోవిందా..ఈ ఆపద పోగొట్టుస్వామి..అని ఆపద మ్రొక్కులతో ప్రార్థించిన వెంటనే ఏడుకొండల మీద బంగారు మేడలో కొలువై ఉన్న బ్రహ్మాండ నాయకుడు భక్తరక్షణకై సుదర్శన భగవానుని ఆదేశిస్తాడట. 
 
అంతే ఆ భక్తుడు ఎన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే సుదర్శనుడు అక్కడ ఆ భక్తునికి కలిగిన ఆపదని తొలగిస్తాడు. అందువల్లే శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆపద మ్రొక్కులవాడని పేరు కలిగింది. అలా వేడుకొన్న వారిని రక్షించడమే వేంకటేశ్వరుని కర్తవ్యమట. మనకు స్థూలంగా శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ సుదర్శనుడు వేర్వేరుగా గోచరిస్తూ ఉన్నా వీరిద్దరూ అభిన్నులే. ఒక్కరే కూడా. శ్రీ వేంకటేశ్వరుని మనస్సులో ఏముందో లక్ష్మీదేవికి కూడా తెలియదట. కానీ సుదర్శనునికి తెలుస్తుందట. దీనివల్ల వీరిద్దరూ ఒక్కరే అని స్పష్టమవుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు ఉదయం పూట తులసీ దళాలతో సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఒకే పీఠం మీద తన సరసనే సుదర్శనుని ఆశీనులనుగా చేసి అభిషేకం చేయిస్తాడు. ఇలా తిరుమల క్షేత్రంలో సుదర్శన భగవానునికి జరిగే ఉత్సవాలను చక్రస్నానం అంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కష్టాలను గట్టెక్కించే అనంత పద్మనాభ వ్రతం... నేడే ఆచరిస్తే....