తిరుమలలో స్వామివారి ఏకాంత సేవ అంటే ఏమిటి...?!
తిరుమల శ్రీవారికి ప్రతిరోజు రాత్రి ఆనందనిలయంలో ఏకాంత సేవ అనబడే పవ్వళింపు సేవ జరుపబడుతుంది. ఆ సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలమూర్తుల పాదాల చెంత ఆనుకొని ఉన్న భోగశ్రీనివాసమూర్తిని కులశేఖరపడి ఇవతల ఉన్న శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు న
తిరుమల శ్రీవారికి ప్రతిరోజు రాత్రి ఆనందనిలయంలో ఏకాంత సేవ అనబడే పవ్వళింపు సేవ జరుపబడుతుంది. ఆ సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలమూర్తుల పాదాల చెంత ఆనుకొని ఉన్న భోగశ్రీనివాసమూర్తిని కులశేఖరపడి ఇవతల ఉన్న శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు నవారు పట్టెమంచంపై పవ్వళింపజేస్తారు.
ఈ శయన మండంపంలోని తూగుటుయ్యాలలోని మెత్తని పట్టుపరుపుపై భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసే సమయంలో సన్నిధి గొల్ల తన చేతిలోని పొంజు అనబడే దివిటీతో శ్రీవారు పవ్వళించే మంచానికి ముందు భాగంలో ఇరువైపులా రెండు దీపపు సమ్మెలను వెలిగించి బయటికి వస్తాడు. ఇలా ప్రతిరోజు రాత్రి ఏకాంతసేవ సమయంలో శయనమండపంలోని మంచానికి ముందు రెండు దీపపు సమ్మెల్ని నిత్యమూ వెలిగిస్తూ ఉన్న ఈ సన్నిధి గొల్ల ఎంతటి ధన్యుడో.. తిరుమల గోవిందునికి సన్నిధి గొల్లనిపై ఎంతటి పక్షపాతమో.. ఇంతటి సేవా భాగ్యాన్ని పొందిన ఈ గొల్ల వేంకటాద్రి గోవిందునికి ఎంతటి ప్రియుడో.. ఈ తిరుమల గోవిందునికి సన్నిధి గొల్లకు ఉన్న అనుబంధం ద్వాపర యుగం నాటి వ్రేపల్లె సంబంధమేమో..
అసలు ఆ స్వామివారు తాను ద్వాపర యుగం నాటి గోవిందుణ్ణి తానేనంటూ ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచిన వెంటనే పాలూ, వెన్నా జుర్రుకోవడమే గాక ప్రతి గురువారం నాడు జరిగే నేత్రదర్శనోత్సవంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతితో పైపల్లెవాటుతో మెడలో రెండు కంటెలతో నొసటన సన్నని నామంతో, బుగ్గన పచ్చ కప్పురపు దిష్టి చుక్కతో తలకు చుట్టూ సొగసుగా చుట్టబడిన వస్త్రముతో నిగనిగలాడుతూ ఉన్న నల్లనైన మేనితో చిరునవ్వులు చిందిస్తూ సాక్షాత్తు నల్లకన్నయ్యే ఈ వేంకటాద్రి గోవిందుడేమోననే ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఒక తన్మయత్వాన్నీ ఒక మైమరపు కలిగిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు స్వామి. అందుకనే కొందరు భక్తులు ప్రతి గురువారం నాటి శ్రీవారి నేత్ర దర్శనోత్సవాన్ని గొల్లని వేషం అని, గోపాలుని వేషం అని అంటారు.
ఇంతమాత్రమే కాదు. ప్రతిరోజు ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవరులకు జరిగే సహస్రనామార్చనలనూ, మధ్యాహ్నం, సాయంత్రం జరిగే అష్టోత్తర శతనామార్చనలోను, ఆ తిరుమలేశుడు ఆ ఆనంద నిలయుడు సాక్షాత్తుగా ద్వాపరయుగం నాటి శ్రీ క్రిష్ణభగవానుణ్ణి తానేనంటూ అర్చించబడుతూ ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ సమయంలో తాను వసుదేవుని పుత్రుడనీ, తన అన్న బలరాముడనీ, తన పేరు క్రిష్ణుడనీ, సంకల్పం చెప్పినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం స్పష్టంగా తెలుపుతూ ఉన్నది.
అందువల్లే ఆనాటి ద్వాపర యుగం నాటి గత స్మృతులు మరువలేక, మరిచిపోలేక, మరిచిపోవడానికి సాధ్యం కాక ఈ తిరుమల గోవిందుడు ప్రతి సంవత్సరం గోకులాష్టమి నాటి ఉట్ల పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రతి సంవత్సరం జరిగే పార్వేటి ఉత్సవంలో ప్రత్యేకంగా సన్నిధి గొల్లను సంభావిస్తూ ఉన్నాడట శ్రీనివాసుడు.