వాల్మీకి మహర్షి రామాయణం రాయడానికి ధ్యానం చేసి కూర్చోగానే బ్రహ్మ ఇచ్చిన వరం మేరకు రామాయణంలోని పాత్రలు, మాట్లాడుకునే విషయాలతో సహా కళ్ళకు కట్టినట్లుగా కనిపించేది. ఆ విధంగా వాల్మీకి రామాయణాన్ని రచించడం ప్రారంభించి మొత్తం 24 వేల శ్లోకాలతో 6 కాండలు, ఉత్తరకాండతో సహా రామాయణ మహాకావ్యాన్ని రచించి లోకానికి అందించాడు.
రామాయణం అదికావ్యంగా పూజ్యనీయమైంది. ఇంతటి గొప్ప కావ్యాన్ని మానవాళికి అందించి చిరస్మరణీయుడైన వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకోవడం ద్వారా శ్రీరాముని అనుగ్రహం పొందవచ్చు. అక్టోబర్ 7వ తేదీ వాల్మీకి జయంతి.
పూర్వాశ్రమంలో రత్నాకరుడనే బోయవాడు. ఇతను అరణ్యాల్లో దారికాచి బాటసారులను దోచుకుంటూ తన భార్యాబిడ్డలను పోషించుకుంటుండేవాడు. నారద మహర్షితో తారక మంత్రోపదేశం పొందిన బోయవాడు ఆనాటి నుంచి రామ తారక మంత్రాన్ని అకుంఠిత దీక్షతో జపం చేయసాగాడు. అలా ఎన్నో ఏళ్ళు గడిచాయి.
కొన్నేళ్లుగా అతను అలాగే తపస్సు చేస్తూ ఉన్నందున ఆ బోయవానిపై వల్మీకములు అంటే పుట్టలు ఏర్పడ్డాయి. నారదుడు అతన్ని పైకి లేపి అభినందించాడు. అలా వాల్మీకం నుంచి బయట పడ్డాడు కాబట్టి నారదుడు ఆ బోయవానికి వాల్మీకి అని నామకరణం చేసి రామాయణ మహాకావ్యం రచించే పనిని అప్పజెప్పాడు.