Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకుంఠ ఏకాదశి: తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు.. మూస్తారు?

వైకుంఠ ఏకాదశి: తిరుమల ఆలయ వైకుంఠ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారు.. మూస్తారు?
, బుధవారం, 12 జనవరి 2022 (11:39 IST)
ఆనంద నిలయంలో కొలువైయున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడుని ఏ పేరుతో పిలిచినా పలికే దైవం.. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వివిధ పేర్లతో భక్తులు కొలుస్తుంటారు. కోర్కెలు తీర్చే కోనేటిరాయుడి దర్శనార్ధం నిత్యం లక్షల సంఖ్యలో‌ భక్తులు తిరుమలకు‌ వస్తుంటారు.

 
క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం భక్తులు పరితపించి పోతారు. అయితే ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల సంఖ్య భారీ పెరుగుతుంది. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో అయితే భక్తుల తాకిడితో తిరుమలగిరులు కిటకిట లాడుతుంది. రోజుకి లక్ష మందికి మాత్రమే స్వామి వారి దర్శనభాగ్యం కల్పించే సౌకర్యం ఉంది.

 
అయితే కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధన మేరకు పరిమిత సంఖ్యలోనే స్వామి వారి దర్శనానికి టిటిడి అనుమతిస్తూ వస్తుంది. వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనుంది టిటిడి. ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా రోజుకు 20 వేల మంది భక్తులకు, ఆఫ్ లైన్ ద్వారా పది రోజుల పాటు రోజుకి 50 వేల టికెట్లను టిటిడి విడుదల చేసింది.

 
ఇక శ్రీవాణి ఇతర దర్శనాలు, టిటిడి ఉద్యోగులు, వివిఐపిలు రోజుకు ఐదు వేల మంది భక్తులకు దర్శనం కల్పించే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే పది రోజుల పాటు ఎటువంటి‌ సిఫార్సులు స్వామి వారి దర్శనం కల్పించేది లేదని టిటిడి‌ తేల్చి చెప్పేసింది. సామాన్య‌ భక్తులకు పెద్దపీట వేస్తూ పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టిటిడి.

 
ఈ క్రమంలోనే తిరుమలలో నేటి నుండి ఈ నెల 22 వ తేదీ వరకూ వసతి గదుల కేటాయింపును తాత్కాలికంగా నిలిపి వేసింది. అంతేకాకుండా ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయిస్తామని, భక్తులు దీనిని గమనించి తిరుపతిలోనే బస చేయాలని కోరింది. ఈ పది రోజుల్లో కేవలం భక్తులకు స్వామి వారి దర్శనం మాత్రమే కల్పిస్తామని టిటిడి చెప్పేసింది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో రోడ్డు కృంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను పూర్తి చేసిన ఇంజనీరింగ్ విభాగం నేటి నుంచి తిరుమల రెండవ ఘాట్ రోడ్డు భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
 
 
దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలను మరింత కఠినం చేసింది టిటిడి. జనవరి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి, 14 ద్వాదశితో పాటుగా మిగిలిన ఎనిమిది రోజులు భక్తులు, ఉద్యోగులు, ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది.

 
తిరుమలలో ఎక్కువగా జనసమూహం ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, లడ్డూ వితరణ కేంద్రం, అన్నదాన సత్రం, వసతి గృహాలను ఎప్పటికప్పుడు టిటిడి ఆరోగ్య విభాగం శానిటైజ్ చేస్తోంది. తిరుమలలో ప్రతి ఒక భక్తుడు మాస్కు ధరించే విధంగా చర్యలు చేపడుతోంది. ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటించేలా టిటిడి చర్యలు తీసుకోనుంది.

 
ఎక్కడ కూడా భక్తుల మధ్య తోపులాట లేకుండా టీటీడీ అధికారుల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇక అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ గాని, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గాని ఉంటేనే తిరుమలకు భక్తులను అనుమతిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టిటిడి కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-01-2022 బుధవారం దినఫలాలు - గణపతిని పూజించినా మీకు శుభం,