Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు.. సామాన్యులకు భక్తులకు పెద్ద పీట... సాధ్యమా!

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని జనవరి 8, 9 తేదీలలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకుని తితిదే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు

వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు.. సామాన్యులకు భక్తులకు పెద్ద పీట... సాధ్యమా!
, శుక్రవారం, 23 డిశెంబరు 2016 (13:06 IST)
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని జనవరి 8, 9 తేదీలలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకుని తితిదే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వీఐపీలను కట్టడి చేసేందుకు గతయేడాది అనుసరించిన విధానాన్నే అమలు చేయనున్నారు.
 
వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించాలని భావిస్తున్నారు. అంతలోనే విఐపి దర్శనాలు పూర్తి చేయనున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ విఐపిలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. దాతలు, వృద్దులు వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. కాలినడకన వచ్చే భక్తులకు నారాయణగిరి ఉద్యానవనంలో 12 షెడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు.
 
అక్కడే భజనలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. 
 
శ్రీవారి దర్శనం, గదులు, లడ్డూలు, లగేజీ కౌంటర్లు తదితర వివరాలను రేడియో, బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగం ద్వారా నిరంతరాయంగా భక్తులకు అందజేయాలని ఈఓ, జెఈఓ ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలకంరణలు, పుష్పాలంకరణలు చేయనున్నారు. భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ముఖ్య కూడళ్ళలో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
 
విఐపి పాసులు పెంచాలని బోర్డు సభ్యులు చేసిన విజ్ఞప్తులను అధికారులు తోసిపుచ్చారు. పాలకమండలి సభ్యులు తనతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులను తీసుకురావచ్చు. అంతేకాకుండా ఒక్కొక్కరికి 20 పాసులు ఇస్తారు. గత యేడాది ఈ పద్దతి పాటించారు. ఈ సారి కూడా అదే పద్దతి అమలు చేస్తామని ఈఓ చెప్పారు. ఈ నెల 20న జరిగిన పాలకమండలి సమావేశంలో పాస్‌లు పెంచాలని సభ్యులు డిమాండ్‌ చేసినా ఈఓ ససేమిరా అన్నట్లు సమాచారం. 
 
గతంలో ప్రతి యేటా వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాట జరిగేది. గేట్లు విరిచేయడం వంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునేవి. గడిచిన రెండేళ్లలో ఇవేవీ లేవు. అయితే విఐపిలను పక్కనబెట్టి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తారా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకరంగా మారింది. ప్రతి యేటా ఇదే మాట చెప్పే తితిదే ఈసారి ఏవిధంగా ప్రవర్తిస్తుందో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి ముందే తొమ్మిది మంది దారుణ హత్య... హత్య చేసింది ఎవరు!