తిరుమల వెంకన్నకు బంగారు వెండి కానుకలే.. కానుకలు..!
శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, ముంబైలో భక్తుల సౌకర్యార్థం ఈ డాలర్లను తితిదే అందుబాటులో ఉంచింది. భక్తులు తమ పుట్టినరోజు, పెళ్ల
శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, ముంబైలో భక్తుల సౌకర్యార్థం ఈ డాలర్లను తితిదే అందుబాటులో ఉంచింది. భక్తులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, పర్వదినాలు తదితర శుభసందర్భాల్లో అపురూపుమైన శ్రీవారి డాలర్లను కొనుగోలుచేస్తున్నారు. ఒకవైపు శ్రీవేంకటేశ్వరస్వామి, మరోవైపు శ్రీపద్మావతి అమ్మవారి ప్రతిమలతో ఉన్న ఈ డాలర్లను భక్తులు ఎంతో భక్తిభావంతో ధరిస్తున్నారు. దీనివల్ల స్వామి, అమ్మవార్లు నిత్యం తమకుతోడుగా నీడగా ఉంటారన్నది భక్తుల విశ్వాసం.
బంగారు డాలర్లు 10 గ్రాములు, 5 గ్రాములు, 2 గ్రాముల బరువుతోను, వెండి, రాగి డాలర్లు 10 గ్రాములు, 5 గ్రాముల బరువుతోను భక్తులకు అందుబాటులో ఉన్నాయి. బంగారు, వెండి డాలర్ల ధరను వారానికి ఒకసారి మార్కెట్ ధరకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ప్రతి బుధవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకువారం రోజుల పాటు ఒకే ధర ఉంటుంది. రాగి డాలర్ల ధరలో ఎలాంటి మార్పు ఉండదు.
శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, ముంబైలో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా గల తితిదే పుస్తక విక్రయశాల పక్కన ఉన్న స్టాల్, లడ్డూ కౌంటర్ల వద్దగల ఒకటో కౌంటర్‌లో డాలర్లు లభిస్తాయి. ఈ రెండు కౌంటర్లు ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న డాలర్ల విక్రయ కేంద్రం 24 గంటలు పని చేస్తుంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం స్వైపింగ్ యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మార్చి 6వ తేదీనాటికి తిరుమలలోని కౌంటర్లలో 10 గ్రాముల బంగారు డాలర్లు 469, 5 గ్రాముల బంగారు డాలర్లు 1296, 2 గ్రాముల బంగారు డాలర్లు 46 ఉన్నాయి. అదేవిధంగా 10 గ్రాముల వెండి డాలర్లు 3,244, 5 గ్రాముల వెండి డాలర్లు 1,301 ఉన్నాయి. రాగి డాలర్ల నిల్వలేదు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం లోపలగల డాలర్ల విక్రయ కేంద్రం సిండికేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తోంది. చెన్నై, ముంబై నగరాల్లో గల తితిదే సమాచార కేంద్రాల్లో డాలర్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది.