సర్ ఛార్జీలతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న తితిదే... భక్తి పేరుతో దగా
పెద్ద నోట్ల రద్దు ప్రభావం తిరుమల శ్రీవారి భక్తులకు మోయలేని భారంగా మారింది. రూ.500, రూ.వెయ్యి నోట్లను అన్ని దేవాలయాల సంస్థలు అంగీకరించాలని డిసెంబర్ 31వ తేదీ వరకు వీటిని స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం,
పెద్ద నోట్ల రద్దు ప్రభావం తిరుమల శ్రీవారి భక్తులకు మోయలేని భారంగా మారింది. రూ.500, రూ.వెయ్యి నోట్లను అన్ని దేవాలయాల సంస్థలు అంగీకరించాలని డిసెంబర్ 31వ తేదీ వరకు వీటిని స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం, భారత రిజర్వు బ్యాంకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని పాటించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఉల్లంఘిస్తోంది. దీని ప్రభావం తిరుమల శ్రీవారి భక్తులపై తీవ్రంగా పడుతోంది. ప్రతినిత్యం దాదాపు 45 లక్షలకుపైగా భక్తుల నుంచి తితిదే సర్ ఛార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తోంది. దీనిపై భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నా సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు.
తిరుమల కొండపై శ్రీవారి దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయాలన్నా, లడ్డూ ప్రసాదాలు తీసుకోవాలన్నా, వసతి గదులు పొందాలన్నా భక్తులకు వేలాది రూపాయల ఖర్చు తప్పనిసరిగా అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఆన్‌లైన్ విధానాన్ని పెంచడం స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడంతో ఆన్‌లైన్ విధానాన్ని పెంచడం స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడంపై శ్రద్ధ చూపాలని ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టంగా తెలియజేసింది. అలాగే ప్రముఖ ఆలయాలు, దేవస్థానాలు అన్నీ భక్తులు ఇబ్బందులు లేకుండా డిసెంబర్ 31వ తేదీ వరకు పెద్ద నోట్లను అంగీకరించాలని సూచించింది.
దీంతో పాటు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేవించింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయాల కంటే ఒకడుగు ముందుకేసి సౌకర్యాల కల్పనలో అన్ని ప్రదేశాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఆంధ్రాభ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్‌ల ఆధ్వర్యంలో స్వైపింగ్ మిషన్లను తిరుమల కొండపై ఉచితంగా పంపిణీ చేశారు.
వీటిని తితిదే విచారణ కేంద్రాలు, టిక్కెట్లు కొనుగోలు కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, రిసెప్షన్ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వం సూచించిన విధంగా పెద్ద నోట్లను డిసెంబర్ 31వతేదీ వరకు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఈనెల నవంబర్ 24వ తేదీనే పెద్ద నోట్లను తీసుకునేది లేదంటూ తితిదే బోర్డులు పెట్టేసింది. దీంతో భక్తులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
తితిదేకి పెద్ద నోట్ల తాకిడి అధికంగానే ఉంటుంది. వీటిని రిజర్వ్ బ్యాంక్ వద్ద మార్చుకునే సౌకర్యం ఉంది. అయినా ఏ కారణం చేతనో పెద్దనోట్లను తితిదే తీసుకోవడం మానేసింది. పైగా స్వైపింగ్ మిషన్లు ద్వారా డెబిట్ కార్డులు ఉపయోగించే వారి వద్ద నుంచి ఎటువంటి సర్ ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అందుకు విరుద్ధంగా భక్తుల నుంచి రోజుకు లక్షల్లో సర్ ఛార్జీలను వసూలు చేస్తోంది. కొండపై హోటళ్ళ దగ్గర నుంచి తితిదే కౌంటర్లు అన్నింటిలో భక్తులకు సర్‌ఛార్జీల మోత భయపెడుతోంది. ఇంత బహిరంగ దోపిడీ తామెన్నడూ చూడలేదని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలోని రిసెప్షన్ కౌంటర్‌లో సన్నిధానం అతిథి గృహంలో ఒక గదిని 6 వేల రూపాలయకు పొందిన భక్తుడు దానిపై 140 సర్జార్జీని చెల్లించాడు. ఎంబిసి కౌంటర్‌లో విఐపి బ్రేక్ దర్శనాల 500 టిక్కెట్‌పై 2.73 శాతం అధికంగా చెల్లించి భక్తులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. పద్మావతి అతిథి గృహంలో గదుల కోసం వీటికి 1.73 శాతం అధికంగా సర్ ఛార్జీని చెల్లించాల్సి వస్తోంది. ఇలా ప్రతి దానికి తితిదే సర్ ఛార్జీలు, సర్వీస్ ట్యాక్స్ పేరుతో భక్తుల నెత్తిన భారం మోపుతూ రోజుకు లక్షలాది రూపాయలను అక్రమంగా వసూలు చేయడం విమర్శలకు దారితీస్తోంది.
డెబిట్ కార్డులపై ఎలాంటి సర్‌ఛార్జీలు ఉండవని కేంద్రప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటున్నా తితిదే అధికారులు మాత్రం అందుకు విరరుద్ధంగా బాష్యం చెబుతున్నారు. సర్ ఛార్జీలు చెల్లించక తప్పదంటూ తితిదే ఉన్నతాధికారి ఒకరు క్యూలైన్లలో ఉన్న భక్తులకు చెప్పడంతో నివ్వెరపోవడం భక్తుల వంతైంది. చివరికి లడ్డూ ప్రసాదాల కొనుగోలు చేయాలన్నా 25 లడ్డూలపై 2.03 శాతం పన్ను చెల్లంచక భక్తులకు తప్పడం లేదు. ధార్మిక సంస్థ అయిన తితిదే భక్తులను సర్ ఛార్జీల పేరుతో ఇంతగా బహిరంగ దోపిడీ చేయడం తామెన్నడూ చూడలేదని శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రోజుకు సర్ ఛార్జీల పేరుతో భక్తుల నుంచి వస్తున్న అదనపు సొమ్ము మాత్రమే 30 లక్షల రపాయలకుపైగా ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక తితిదే అధికారి వెల్లడించారు. దీనిపై కనీసం ఇప్పటికైనా తితిదే పునరాలోచించుకుని భక్తులకు బారమైన సర్ ఛార్జీల మోత నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. పెద్దనోట్లను అంగీకరించాల్సి ఉంటుంది. దీంతో పాటు తితిదే అధికారులు అంగీకరించినా, అంగీకరించకపోయినా స్వామివారి హుండీలో ప్రతినిత్యం 3 కోట్ల రూపాయల వరకు పడుతున్న కానుకల్లో 45 శాతం 500 రూపాయలు, రూ.వెయ్యి నోట్లే కావడం గమనార్హం. వీటిని ఎటు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్‌లుగా మార్చుకునే తితిదే భక్తుల వద్ద నుంచి పెద్దనోట్లను నేరుగా తీసుకునే విషయంలో మాత్రం ఎందుకింత ఆంక్షలు విధిస్తుందో అర్థం కాని పరిస్థితి.