Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరమాత్మా క్షమించు... తిరుమలలో సినిమా పాటలు... తితిదే బ్రాడ్‌ కాస్టింగ్‌ లీలలు అన్నీఇన్నీకావు...

ఎప్పటికప్పుడు అధునాతనంగా ఉండడం, కొత్తగా కనిపించడం, కొత్తదనం చూపించడం మంచిదే గానీ.. ఆ పేరుతో మూలాలను విస్మరించకూడదు.

Advertiesment
Ttd broadcasting channel
, సోమవారం, 4 జులై 2016 (11:27 IST)
ఎప్పటికప్పుడు అధునాతనంగా ఉండడం, కొత్తగా కనిపించడం, కొత్తదనం చూపించడం మంచిదే గానీ.. ఆ పేరుతో మూలాలను విస్మరించకూడదు. కొసరుతో అసలును మరచిపోకూడదు. అంతా కొత్తగా చేయాలని, సృజనాత్మకంగా ఆలోచించాలనే తపనతో ఒక్కసారి తప్పటడుగులు వేసే ప్రమాదముంది. ఇప్పడు తితిదేలో అదే జరుగుతోంది. తితిదే బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగంలో చోటుచేసుకున్న మార్పులు ఇలాంటి విమర్శలకు చోటిస్తున్నాయి.
 
తిరుమలలో ఎటు వెళ్ళినా స్పీకర్లలో వినిపించే గీతాలు మనసును భక్తిభావంతో నింపేస్తున్నాయి. దశాబ్దాలుగా అవే వింటున్నా ఎప్పుడూ బోరుగా అనిపించవు. సాయంత్రం నాలుగు గంటల కాగానే.. మధుర గాయకుడు ఘంటసాల స్వరంతో వినిపించే భగవద్గీత గాని, రాత్రి 10 గంటల తర్వాత వినిపించే సుందరకాండగానీ, ఉదయాన్నే చెవులను తాకే విష్ణు సహస్ర నామాలుకానీ. దశాబ్దాలుగా వింటున్నా రోజూ వింటున్నా నిత్య నూతనంగానే ఉంటాయి. అలాంటిది కొన్ని రోజులుగా విష్ణు సహస్ర నామాలు, భగవద్గీత, సుందరకాండ వినిపించడం లేదు. దీంతో తిరుమల వాసులకు, ఉద్యోగులకు ఏదో వెలితిగా అనిపిస్తోంది.
 
రోజూ భగవద్గీత ప్రసారం చేయడం ఏమిటి? విష్ణు సహస్ర నామాలు నిత్యం వినిపించాలా? సుందరకాండ ప్రతి రాత్రి వినిపించపోతే ఏమవుతుంది? కొత్తగా ఏదైనా వినిపిస్తే ఎలా ఉంటుంది? ఇలా ఆలోచించారో ఏమో ఆ మూడింటినీ ప్రసారం చేయడం ఆపేశారు. ధర్మ ప్రచార పరిషత్‌లో ఏర్పాటైన కమిటీ తిరుమలలో చేయాల్సిన ప్రసారాలపై కొన్ని నిర్ణయాలు చేసింది. అందులో భాగంగా సహస్రనామాలు, భగవద్గీత, సుందరాకాండను తొలగించారు. ఆ స్థానంలో ఏఓ ప్రైవేట్ ఆల్బమ్‌ల నుంచి సేకరించిన గీతాలు వినిపిస్తున్నారు. షెడ్యూల్‌ నిర్ణయించి, రోజుకో ఆల్బమ్‌లోని పాటలు ప్రసారం చేస్తున్నారు. 
 
విషాదమేమిటంటే ఈ షెడ్యూల్‌‌లో ఎక్కడా భగవద్గీత, సహస్రనామాలు, సుందరకాండ లేవు. వారంతో ఒక్కరోజయినా వాటిని వినిపించాలన్న ఆలోచన అధికారులకు కలుగలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న గీతాలు ఈ సినిమా పాటల ఛాయలతో ఉంటున్నాయని, ఇవి అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయని తిరుమల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు భగవద్గీతను మించిన గీతాలు ఏమున్నాయన్నది భక్తుల ప్రశ్న. కొత్తదనం పేరుతో దశాబ్దాల సంప్రదాయాన్ని మార్చుతారా అని ఆవేదనతో నిలదీస్తున్నారు. గాత్రంపరంగానూ భగవద్గీతకు మించిన శ్రావ్యమైన గానం ఏముంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎందుకు తొలగించారన్నది అర్థం కాని విషయం. 
 
ప్రసారాలలో మరో కీలక మార్పు కూడా చేశారు. ఇప్పటిదాకా తిరుమలలో ప్రసారం ఏదైనా ఇటు అలిపిరి, అటు శ్రీవారి మెట్టు దాకా వినిపించేది. తాజా ఆదేశాల ప్రకారం భక్తులు తప్పిపోవడానికి సంబంధించిన ప్రకటనల నడక దారిలో ప్రసారం కావడం లేదు. నడక దారిలో ఎవరైనా తప్పిపోయినట్లు ఫిర్యాదు వస్తేనే.. అక్కడ ప్రసారం చేస్తున్నారు. తప్పిపోయిన సమాచారం కాలినడక పొడవునా వినిపిస్తే నష్టమేమిటో అర్థం కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సీనియర్‌ ఉద్యోగులు, స్థానికులు అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటీవల కాలంలో అలాంటిదేమీ జరగడం లేదు. ఇప్పటికైనా పునరాలోచన చేసి తిరుమలలో భగవద్గీత, విష్ణు సహస్ర నామాలు, సుందరాకాండ ప్రసారం చేయడానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వారం మీకు అనుకూలమా? 4 నుంచి 9 వరకు గ్రహ ఫలితాలు