Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో శ్రీనివాసుని "దర్బార్‌"! ఘంటామండపం అంటే ఏమిటి!

తిరుమల గురించి తెలుసుకోవాలంటే అది సాధ్యం కాని పని కాదేమో. ఎందుకంటే ఎంత తెలుసుకోవాలనుకున్నా ఇంకా వస్తూనే ఉంటుంది. అది తిరుమల చరిత్ర అంటే.

తిరుమలలో శ్రీనివాసుని
, సోమవారం, 1 ఆగస్టు 2016 (11:58 IST)
తిరుమల గురించి తెలుసుకోవాలంటే అది సాధ్యం కాని పని కాదేమో. ఎందుకంటే ఎంత తెలుసుకోవాలనుకున్నా ఇంకా వస్తూనే ఉంటుంది. అది తిరుమల చరిత్ర అంటే. తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఒక జీవితం సరిపోదని పెద్దలు చెబుతుంటారు. అదీ శ్రీవారి లీలలంటే. యేళ్ళ క్రితం రాజులకు మాత్రమే దర్బార్‌లు ఉండేవి. కానీ తిరుమల శ్రీవారికి కూడా దర్బార్‌ ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదూ..అయితే ఇది చదవండి.
 
తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి ముఖమండపంగా ఘంటామండపం ఉంది. మండపంలోకి విమాన ప్రదక్షిణంలోని దక్షిణం వైపున, ఉత్తర దిక్కు ముఖంతో లోకి వెళితే దాని విశిష్టత ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. బ్రహ్మాది సకల దేవతలు సనకసనందనది సమస్త మహర్షులు, శ్రీ స్వామివారి దర్సనానికై వేచి ఉండేదే వాకిళ్ళు. కనకమయ కవాటాలు కూడా ఆలయంలో ఉన్నాయి. బంగారు వాకిలి దాని ఎదురుగా ఇటు ఉన్న గరుడ మందిరం ఈ రెంటినీ అనుసంధిస్తూ నిర్మింపబడిన ఈ మండపాన్ని మహామణి మండపం అని, ముఖమండపం అని అంటారు. 43 40 కొలతలు కలిగిన ఈ మహామణిమండపంలో నాలుగు వరుసరులుగా మొత్తం 16 స్థంభాలు ఉన్నాయి. ఈ స్థంభాలపైన భూ వరాహస్వామి, నృసింహస్వామి మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరస్వామి, వరదరాజస్వామి ఇత్యాది శిల్పాకృతులు చెక్కబడి ఉన్నాయి. ఇటీవల కాలంలో చుట్టూ ఇత్తడి కటాంజనంతో కూడిన వాకిళ్లు ఏర్పాటు చేయబడిన ఈ మండపాన్ని క్రీ.శ.1417లో ఆగష్టు 25వతేదీ నాటికి చంద్రగిరి వాస్తవ్యుడైన అమాత్య మల్లన అనే విజయనగర సామ్రాజ్య మంత్రివర్యుడు నిర్మించి పూర్తి చేశాడు. ఇతనికే మాధవ దాసు అనే నామాంతరం కూడా ఉంది.
 
ఈ మండపంలో బంగారు వాకిలికి ఎదురుగా గరుడాళ్వారు మందిరం ఉంది. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి అభిముఖంగా నమస్కార భంగిమలో నిలుచొని ఉన్న ఆరు అడుగుల గరుత్మంతుని శిలామూర్తి ప్రతిష్టించబడింది. బంగారు వాకిలికి గరుడునికి మధ్య ఉన్న విశాలమైన ఈ  మహామణి మండపంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3గంటల సమయంలో కౌసల్య, సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ శ్రీనివాసునికి మేలు కొలుపు వినిపించే సుమధున సుమనోహర సుప్రభాతపఠనం జరుగుతోంది. నిత్యమూ ప్రశాంతతతో ఆధ్మాత్మికతతో భక్తులను మైమరపించే ఈ ఘంటామండపంలో ప్రతిరోజు తెల్లవారుజామున, బంగారు సింహాసనంలో వేంచేసి ఉన్న శ్రీ వేంకట ప్రభువులకు ఆనాటి తిథి, వార, నక్షత్రాదిగ పంచాగ శ్రవణం, ముందురోజు నాటి ఆదాయ వ్యయాలు, ఇత్యాదిగా బంగారు వాకిలి ముందు విన్పించబడుతుంది.
 
ఇదే శ్రీనివాసుని కొలువు. ఈ కొలువునే శ్రీనివాసుని దర్బార్ కూడా అంటారు. ఈ కొలువులో తిరుమలలో జరిగే నిత్యాన్నదాతల పేర్లు కూడా శ్రీవారికి వినిపించబడతాయి. ఈ మండపంలోనే ప్రతి బుధవారం నాటి ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకు సహస్రకలశాభిషేకం గురువారం నాడు రెండవ గంటా సమయంలో తిరుప్పావడ అనే అన్నకూటోత్సవం తదితర సేవలు జరుపబడుతూ ఉంటాయి.
 
ఇవేకాకుండా ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి, ఇత్యాది పర్వదినాల్లో ఈ మండపంలోనే గరుడాళ్వారుకు ఎదురుగా ఉభయ దేవేరులతో కూడి ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని, విష్వక్సేనులను వేంచేపు చేయించి కొలువు జరుపుతారు. శ్రీరామనవమి పండుగనాడు శ్రీ సీతారామలక్ష్మణ హనుమంతులు, గోకులాష్టమి నాడు శ్రీ రుక్మిణీ, శ్రీ క్రిష్ణులు మండపంలో వేంచేపు చేయబడి కొలువు జరుగుతుంది. ప్రస్తుతం ఇది శ్రీవారి ఆస్థాన మండపంగా ఉపయోగపడుతున్నది. ఈ బంగారు వాకిటి ముంగిట్లో జరిగే శ్రీవారి ఆస్థాన సేవలను కూడా జరుగుతుంటాయి. ఈ మండపంలోనే ఇటువైపు అంటే బంగారు వాకిలికి దక్షిణం వైపున రెండు పెద్ద ఘంటలు చెక్కదూలానికి పెద్ద ఇనుప గొలుసుతో వ్రేలాడ గట్టబడి ఉన్నాయి. ఈ ఘంటలు శ్రీ స్వామివారికి నివేదన జరిగే సమయాల్లో మోగింపబడతాయి. ఈ ఘంటలను మ్రోగించే పరిచారక విపుణ్ణి ఘంటాపాణి అంటారు. ఈ ఘంటల నాదాల తరంగాలు తిరుమల క్షేత్రం అంతటా వ్యాపించి తిరుమల కొండల్లోను కోనల్లోను మంద్ర గంభీరంగా శ్రుతిసుందరంగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈ ఘంటానాదం చెవిని బడ్డ ప్రతి వ్యక్తికి శ్రీ స్వామివారి ఆరగింపు జ్ఞప్తికి వస్తుంది. తిరుమల క్షేత్రంలో ఈ నాటికీ ఈ నాదం ఆగిన తరువాతనే తమ తమ భోజనాలకు ఉపక్రమించే భక్త జనులు ఎందరో ఉన్నారు.
 
విజయనగర చక్రవర్తులు చంద్రగిరిలో విడిది చేసే సమయంలో శ్రీవారి నైవేద్య ఘంటానాదం వినబడేందుకు వీలుగా కొండల్లో ఘంటామండపాన్ని ఆయా చోట్ల ఏర్పాటు చేయించి ఆరా అంచెలంచెలుగా వినిపింపజేయబడిన ఘంటానాదాన్ని విన్న అనంతరమే అనగా శ్రీవారి నైవేధ్యం అయినది తెలియవచ్చిన తరువాత పిమ్మటనే తాము భుజించేవారట.
 
బంగారు వాకిలి ముందున్న మండపంలో ఈ ఘంటలు ఉన్నందు వల్లే దీనికి ఘంటామండపం అని పేరు వచ్చింది. ఈ ఘంటలను తమిళంలో మణి అంటారు. ఈ మండపం తిరుమహామణి మండపం అని కూడా వ్యవహరింపబడుతూ ఉంది. ఇన్ని విధాలుగా పిలువబడుతూ ప్రతినిత్యం శ్రీ స్వామివారికి పూజా విశేషాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన ఈ మండపంలో బంగారు వాకిలికి ఎదురుగా గరుడ మందిరం ఉంది. అంతే కాకుండా ఈ బంగారు వాకిళ్ళకు ఉత్తరం వరకు శ్రీ స్వామివారి హుండీ ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు మాసంలో మీ రాశి ఫలితాలేంటి?... ఖర్చులు అధికం... అన్ని రంగాల వారికి యోగం!