Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల లడ్డూ కౌంటర్ కార్మికుల జీతం రూ. 3,500... వచ్చిన జీతం బస్‌ఛార్జీలకే...

తిరుమలలో తితిదే లడ్డూ కౌంటర్లలో బ్యాంకుల తరపున పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తితిదే ఇస్తున్న డిపాజిట్లను దృష్టిలో ఉంచుకుని పలు బ్యాంకులు లడ్డూల విక్రయం, సేవా టికెట్ల విక్రయం వంటి పనులు ఉచితంగా చేసి పెడుతామని త

తిరుమల లడ్డూ కౌంటర్ కార్మికుల జీతం రూ. 3,500... వచ్చిన జీతం బస్‌ఛార్జీలకే...
, శనివారం, 13 ఆగస్టు 2016 (16:01 IST)
తిరుమలలో తితిదే లడ్డూ కౌంటర్లలో బ్యాంకుల తరపున పనిచేస్తున్న కార్మికులు చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తితిదే ఇస్తున్న డిపాజిట్లను దృష్టిలో ఉంచుకుని పలు బ్యాంకులు లడ్డూల విక్రయం, సేవా టికెట్ల విక్రయం వంటి పనులు ఉచితంగా చేసి పెడుతామని తితిదే నుంచి అనుమతి తీసుకున్నాయి. దేవస్థానం కూడా సంతోషంగా ఆ పనిని బ్యాంకులకు అప్పగించింది. బ్యాంకులకు ఆ బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించింది. ఆ ఏజెన్సీలు కార్మికుల పొట్టగొడుతున్నాయి. నమ్మశక్యం కాకున్నా.. లడ్డూ కాంట్రాక్టర్లలో పనిచేసే కార్మికుల నెల వేతనం 3,500 రూపాయలు మాత్రమే.
 
ఎస్‌బిహెచ్‌, ఎస్‌బిఐ, ఇండియన్‌ బ్యాంకు, కెనరాబ్యంకు, ఐఓబి, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు 45 లడ్డూ కౌంటర్లను నిర్వహిస్తున్నాయి. ఈ కౌంటర్లలో కౌంటర్‌ బాయ్స్, సూపర్‌ వైజర్లు కలిసి 160 మంది దాకా పని చేస్తున్నారు. ఉదయం  నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒక బ్యాచ్‌, సాయంత్రం 4 గంటల నుంచి రెండోరోజు తెల్లవారుజాము వరకు రెండవ బ్యాచ్ పనిచేస్తుంటారు. ఇది ఎంతో నైపుణ్యంతో, జాగ్రత్తగా చేయాల్సిన పని. దాదాపు 25 రకాల లడ్డూ టికెట్లు ఉన్నాయి. 
 
దివ్యదర్శనం, వైకుంఠం ఆన్‌లైన్‌-300, 50 రూపాయలు, ఎల్‌పిటి, సుప్రభాతం, తోమాల, అర్చన, నిజపాద దర్శనం, వసంతోత్సవం, వూంజల్‌ సేవ, సహస్రదీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, అంగప్రదక్షిణ, సీనియర్‌ సిటిజన్‌, సుపథం, శ్రీవారి సేవకులు, స్కౌట్స్, ఎన్‌ఆర్‌ఐ, టూరిజం, డోనర్‌, విఐపి బ్రేక్‌ ఇలా రకరకాల టికెట్లు, టికెట్టు కేటగిరీని బట్టి 1 నుంచి 20లడ్డూల దాకా ఇవ్వాల్సి ఉంటుంది. లడ్డూల స్టాకు దించుకోవడం, టికెట్లను స్కాన్‌ చేసుకోవడం, భద్రపరుచుకోవడం లడ్డూలు లెక్కించి భక్తులకు అందజేయడం, మళ్ళీ అన్ని టికెట్లను కేటగిరీల వారీగా విభజించి లెక్క సరిచూసి అధికారులకు అప్పగించడం ఇంతపని ఉంటుంది. ఇదంతా ఒకరే చేయాలి. డ్యూటీ ఎక్కినప్పటి నుంచి దిగేదాకా పనే.
 
ఎంత పని చేస్తున్నా కనీస ప్రతిఫలం దక్కడం లేదు. కౌంటర్‌ బాయ్‌కి కేవలం 3,500 రూపాయలు, సూపర్‌వైజర్లకు 4,200 మాత్రమే వేతనంగా చెల్లిస్తున్నారు. ఏజెన్సీలు చెల్లిస్తున్న వేతనం బస్‌ ఛార్జీలకు చాలడం లేదని కార్మికులు వాపోతున్నారు. తిరుమలకు రావడానికి 52, తిరిగి వెళ్ళడానికి 52 రూపాయలు బస్‌ఛార్జీ అవుతోంది. అంటే రోజుకు 104రూపాయలు బస్సు ఛార్జీలకే ఖర్చు చేయాలి. నెలలో 20 రోజులకు బస్సు ఛార్జీ 2 వేల రూపాయలు అవుతుంది. ఇక మిగిలేది 1,500 రూపాయలు మాత్రమే. అదీ నెలలో అన్ని రోజులూ డ్యూటీ దొరికితేనే. 
 
అవసరమైన వారి కంటే ఎక్కువమందిని నియమించుకోవడం వల్ల కొందర్ని పనిలేదని ఇంటికి తిరిగి పంపేస్తుంటారు. సగటున ఒక్కో కార్మికునికి 3 వేల నుంచి 3,100 రూపాయలు మాత్రమే వేతనం లభిస్తోంది. ఒక్క హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు మాత్రమే కౌంటర్‌ బాయ్స్ కి 6,200 రూపాయలు, సూపర్‌వైజర్లకు 8 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. మిగతా బ్యాంకులు ఎందుకు తక్కువ చెల్లిస్తున్నాయో అర్థం కావడం లేదు. బ్యాంకులు ఇస్తున్నా ఏజెన్సీలు మింగేస్తున్నాయా? ఏమో బ్యాంకులే చూడాలి. 
 
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కౌంటర్లలో పనిచేస్తున్నవారు ఎవరో ప్రముఖుల సిఫార్సులతో పనిలో చేరిన వారే. చేర్చుకునేటప్పుడు 7 వేల రూపాయలు ఇస్తాం, 9 వేలు ఇస్తాం అని చెప్పి, తీరా 3,500 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. తమను పనిలో చేర్పించిన ప్రముఖులకు చెడ్డపేరు వస్తుందన్న భయం, ఎప్పటికైనా తమ జీవితాల్లో వెలుగు నిండుతుందన్న ఆశతోనే కష్టాలకు ఓర్చి కౌంటర్లలో పనిచేస్తున్నారు. కనీసం తమకు బస్‌పాస్‌ అయినా ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. 
 
వేతనం బస్సు ఛార్జీలకే చాలనపుడు కుటుంబాన్ని ఎలా పోషించాలి? భవిష్యత్తుపై ఆశతోనే చాలామంది ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకొని నెట్టుకొస్తున్నారు. లడ్డూ కౌంటర్ల సిబ్బందితో తమకు సంబంధం లేనట్లు తితిదే వ్యవహరిస్తోంది. ఎవరైనా తప్పు చేసినపుడు ఎత్తిచూపుతున్న వారు తమ కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదని లడ్డూ కేంద్రాల కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమకు కనీస వేతనాలు అందేలా తితిదే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాళహస్తిలో పిఆర్ఓ విభాగం ఏం చేస్తుంది...? శివయ్యకు ఉపయోగపడుతోందా...?