Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారి ఆలయంలో క్షేత్రపాలక శిల... ఎక్కడుంది?

తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంబ మండపం ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్య మూలాన బలిపీఠం లాంటి ఆకారంలోనే సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తుగల శిలాపీఠం ఉంది. దీన్నే క్షేత్రపాలక కల అంటారు. తిరుమల పుణ్యక్షేత్రానికి పరిపాలకుడు రుద్రుడు(శివుడు). క్షేత్ర పాలకుడైన రుద్రు

తిరుమల శ్రీవారి ఆలయంలో క్షేత్రపాలక శిల... ఎక్కడుంది?
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (21:22 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంబ మండపం ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్య మూలాన బలిపీఠం లాంటి ఆకారంలోనే సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తుగల శిలాపీఠం ఉంది. దీన్నే క్షేత్రపాలక కల అంటారు. తిరుమల పుణ్యక్షేత్రానికి పరిపాలకుడు రుద్రుడు(శివుడు). క్షేత్ర పాలకుడైన రుద్రునికి గుర్తుగా అనాదిగా ఈ శిల ఉందని పురాణాలు చెబుతున్నాయి.
 
ఈ శిల పూర్వం రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ, ఈ గుడిచుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేదట. ప్రతిరోజు రాత్రి అర్చకులు ఇంటికి వెళ్లేటప్పుడు గుడి తాళాలను ఈ శిలపై పెట్టి నమస్కరించి వెళ్లేవారట. మళ్ళీ తెల్లారిన తరువాత వచ్చి అర్చకులు ఆ శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకునే వారట. ఒకనాటి రాత్రి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉన్న సమయంలో ఆ శిల కింద పడి ఒక బాలుడు మరణించాడట. మళ్ళీ అలాంటి దుర్ఘటన జరుగకుండా ఆ శిల ఇక్కడి నుండి తిరుమలకు సమీపంలో ఉన్న గోగర్భ తీర్థం వద్దకు తరలింపబడిందని, అందులోని ఒక చిన్న భాగమే ప్రస్తుతం మనం చూస్తున్న క్షేత్రపాలక శిల అని పురాణాలు చెబుతున్నాయి.
 
ప్రస్తుతం ఈ క్షేత్ర పాలకశిల పూర్ణస్వరూపంతో అటు గోగర్భతీర్థం (పాండవతీర్థం) లోను, అంశా స్వరూపంతో ఇక్కడ ఆలయంలోను వెలుగొందుతూ ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం నాడు అర్చకులు, ఆలయ అధికారులు, యాత్రికులు మంగళవాయిద్యాలతో కూడా పాండవ తీర్థానికి వెళ్ళి అక్కడ ఏకాదశ రుద్రంతో క్షేత్రపాలకుడగు రుద్రునకు అభిషేకం చేస్తారు. అనంతరం ఆ గుండుకు వెండి నామాలు కండ్లు అతి కించి పుష్పాలంకరణ కావించి ధూపదీప అర్చన నివేదనాదులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. చివరగా రుద్రునకు ఆరగింపు అయిన వడపప్పు, పండ్లు, పానకం, తాంబూలం స్థాన బహుమానంగా వితరణ అయిన పిమ్మట యాత్రికులకు ప్రసాదం పంచబడుతుంది.  తరువాత అర్చకులు, అధికారులు మంగళ వాద్య సహితంగా ఆలయానికి వస్తారట.
 
గోగర్భానికి వెళ్ళే ఆ క్షేత్ర పాలక గుండును భక్తులందరు దర్శించుకుంటారు. ప్రస్తుతం ప్రతిరోజు తెల్లవారుజామున శ్రీస్వామివారి కైంకర్యానికి వచ్చే అర్చకులు తమ తాళాల గుత్తిని, కుంచెకోలను క్షేత్రపాలక శిలకు తాకించి నమస్కరించి ధ్వజస్థంభానికి ప్రదక్షిణంగగా వెళ్ళి ఆలయప్రవేశం చేస్తారు. అలాగే రాత్రి ఏకాంతసేవానంతరం ఇంటికి వెళుతూ అర్చక స్వాములు తమ బీగాలను కుంచెకోలను ఈ క్షేత్రపాలకశిలకు తాకించి నమస్కరించి తరువాతనే ఇంటికి వెళతారు. ఇది ఈ నాటికీ నిత్యమూ కొనసాగుతూ ఉన్న అమలులో ఉన్న సంప్రదాయం.
 
కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీనివాసుని సన్నిధిలో క్షేత్రపాలకుడుగా శివుడు ఉండటం ఆశ్చర్యంగా తోచినా నిధానంగా ఆలోచిస్తే అటు విష్ణువు, ఇటు శివుడు ఇద్దరు ఒక్కటే తత్వమని ప్రబోధిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మీరు కూడా శ్రీవారి ఆలయంలో ఉన్న రుద్రదేవుణ్ణి పూజించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినాయక పూజలో ఉపయోగించాల్సిన 21 పత్రాలు... ఏంటవి? వాటిలో ఔషధ గుణాలు...