Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో ఆహారం లేకుండా వందల యేళ్లు బతికిన మఠాధిపతి.. ఎవరు?

భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొంది నిరంతరం కొత్త తేజస్సులతో వెలిగిపోతూ ఉన్న దివ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్న స్వామి ఏడుకొండల వెంకన్న. ఈ తిరుమలస్వామి వారు వెలసి ఉన్న ఆనంద ని

Advertiesment
Lord Balaji’s favorite devotee
, మంగళవారం, 20 డిశెంబరు 2016 (13:10 IST)
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొంది నిరంతరం కొత్త తేజస్సులతో వెలిగిపోతూ ఉన్న దివ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్న స్వామి ఏడుకొండల వెంకన్న. ఈ తిరుమలస్వామి వారు వెలసి ఉన్న ఆనంద నిలయానికి సరిగ్గా ఆలయానికి బయట ఆగ్నేయ మూలలో ఎత్తైన గుట్టపై ఒక పెద్ద దివ్యమైనభవనం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ భవనమే మహంతుల మఠం అని పిలువబడుతూ ఉంది. మహంతు అనగా సాధువు, సన్యాసి అని అర్థం. ఈ మఠాన్ని స్థాపించిన మూలపురుషుడు బావాజీ అని హథీరాంజీ బావాజీ అని కూడా గౌరవంగా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో ప్రచారంలో ఉన్న రామానంద సంప్రదాయానికి చెందిన పరమ వైష్ణవ భక్తుడే ఈ హథీరాంజీ. 
 
సుమారు 500 యేళ్ల కిందట 24 మైళ్ళ దూరంలో క్రేడల్‌ క్రేల అనే గ్రామంలో రామానంద మఠం ఉండేది. ఈ మఠానికి అభయనందజీ అనే సాధువు మహంతుగా ఉండేవారు. ఈ మహాపురుషుని శిష్యుడే బావాజీగా వ్యవహరింపబడే హథీరాంజీ గురువు ఆజ్ఞ మేరకు శిష్యుడైన బావాజీ క్షేత్ర సందర్శనలు, తీర్థయాత్రలు చేస్తూ చివరకు వేంకటాచలక్షేత్రం చేరుకున్నారు. తిరుమల క్షేత్రానికి వచ్చిన బావాజీ ఇక్కడ క్షేత్ర సౌందర్యానికి, తపస్సుకు అనువైన వాతావరణానికి ముగ్ధులయ్యారు. అంతమాత్రమే కాదు కలౌ వేంకటనాయక అన్న ప్రసిద్థి పొందిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దయాళుత్వానికి, వరప్రదానికీ, కీర్తి పతాకగా జగజ్జేయమానంగా వినీలాకాశంలో ప్రకాశిస్తూ ఉన్న బ్రహ్మాండనాయకుని బంగారు మేడ కాంతుల చేత ఆకర్షింబడ్డాడు. 
 
శాశ్వతంగా ఇక్కడే నిలిచాడు. కోటి సూర్యప్రకాశంతో వెలుగుతూ నిత్యమూ కొత్త కొత్త కాంతులీనుతున్న ఆనంద నిలయ విమాన బంగారు శిఖరాలు నిరంతరం కనపడేటట్లుగా ఆలయానికి అతి సమీపంలోనే ఎత్తైన ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పరమరామభక్తుడైన ఈ బావాజీ ఆ అయోధ్యరాముడే ఇక్కడ ఈ వేంకటాద్రిపై ఆనంద నిలయరాముడై వెలసినాడని భావించి ఆనందించినాడు. 
 
కేవలం ఆనందనిలయంలో మాత్రమే కాదు, ఆలయం బయట తిరుమల యాత్ర చేసే ప్రతి భక్తునిలోనూ ఆ వేంకటాద్రిపతిని దర్శించి బావాజీ తన్మడుయ్యేవాడు. అందువల్లే తిరుమల యాత్రికులకు, సాధువులకు, సన్యాసులకు, అన్నదానాది కార్యక్రమాలు ఘనంగా వినయంగా భక్తి పూర్వకంగా నిర్వహించి సేవ చేసేవాడు. 
 
ప్రతిరోజు రాత్రి ఏకాంతసేవానంతరం తిరుమల క్షేత్రం అంతటా నిశ్బబ్ద వాతావరణం అలుముకున్న వేళ సాక్షాత్తుగా ఆనంద నిలయం నుంచి శ్రీ వేంకటేశ్వరుడు బయలుదేరి అత్యంత భక్తుడైన బావాజీ విడిదికి వెళ్లేవారని పురాణాలు చెబుతున్నాయి. సరససంభాషణలతో కాలాన్ని వెళ్ళబుచ్చేవాడు. అంతేకాదు ఆ భక్తుడు ఈ భగవంతుడు పణాలు ఒడ్డి, పాచికలాడేవారట. ఆ పాచికలాటలో వాదన ప్రతివాదనలు కూడా జరిగేవట. ఎంత వాదన ప్రతివాదనలు జరిగినా గెలుపు మాత్రం మహంతు బావాజీ వారిదేనట. స్వామివారికి అత్యంత ఇష్టమైన భక్తుడు బావాజీ..
 
శ్రీనివాసునితో కలిసి పాచికలాడుతున్నట్లు బావాజీ గురించి భక్తులకు తెలిసి అందరు బావాజీని పూజించడం మొదలెట్టారు. అంతేకాదు హథీరాంజీ బావాజీ భోజనం కూడా చేయరు. రామపత్రం అనే ప్రత్యేక ఆకును మాత్రం తినేవారట. బావాజీ గురించి తెలుసుకున్న చంద్రగిరి చక్రవర్తి గిరిధరరాయలు ఆయన్ను పరీక్షించాలనుకున్నారు. నువ్వు నిజంగా స్వామితో మాట్లాడుతున్నావు కదూ.. అయితే ఒక ఎడ్లబండి నిండా చెరకును ఉంచుతాను. ఉదయంలోగా మొత్తం తినేయ్యాలంటూ బెదిరించాడట... లేకుంటే తిరుమల నుంచి పంపేస్తానని చెప్పాడట. అంతే చెప్పిన వెంటనే చెరుకుతో పాటు బావాజీని పెట్టి తాళం వేశాడట. ఎప్పటిలాగే స్వామివారు బావాజీకి కనబడి ఆయనతో పాచికలాడిన తర్వాత అతి పెద్ద ఏనుగు రూపం దాల్చి చెరకు మొత్తాన్ని తినేసి వెళ్లిపోయారట.
 
ఉదయాన్నే వచ్చిన గిరధరరాయలు బావాజీకి దణ్ణం పెట్టి ఆయన శిష్యుడుగా మారిపోయారట. మహంతు హథీరాంజీ బావాజీ ఆనాటి నుండే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అధికారికమైన పెత్తనం లేకపోయినా ఆలయ వ్యవహారాల్లో ప్రధానమైన వ్యక్తిగా, మహాభక్తునిగా ప్రముఖ పాత్ర వహించేవాడు. ఆనాటి నుంచే ప్రతిరోజు ఉదయాన్నే మహంతు హథీరాంజీ బావాజీ సుప్రభాత వేళలో నివేదనకు గాను శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అప్పుడే పిండిన ఆవుపాలను, నవనీతాన్ని పంపుతూ పచ్చ కర్పూరం హారతిని సమర్పించేవాడు. ఆనాడు ఆ బావాజీ ఏర్పాటు చేసిన గోక్షీర నివేదన, నవ్యనవ నీత హారతి నిర్విఘ్నంగా మహంతు పేరు మీదనే జరుపబడుతోంది. నేటికీ వీటిని మహంతు మఠం వారే సమర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కాంలో ఈ మఠాధిపతులకు ఉన్న శిష్యుల వల్ల భక్తుల వల్ల స్థిర చరాస్థులు విపరీతంగా పెరిగిపోయాయి. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభానికి ఎదురుగా ఉన్న నడిమి వడికావలి ప్రవేశమార్గంలోనే దక్షిణంవైపు గోడపై బావాజీ వేంకటేశ్వరులు పాచికలాడుతున్న శిల్పం చెక్కబడింది. వీరి పక్కనే నిలబడి పాచికలాటను చూస్తూ ఉన్న చంద్రగిరి రాజైన గిరిధరరాయల శిల్పాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రవేశ ద్వారం, వాకిళ్ళతో పాటు ఈ శిల్పానికి కూడా వెండిరేకు తాపబడింది. ఈ నడిమిపడి కావలి ప్రవేశద్వారం గోపురం క్రీ.శ.1472 - 1482 మధ్య పునరుద్దరింపబడింది. అంతేకాక తిరుమల మహంతు మఠంలో కూడా పాచికలాడిన స్థలంగా ప్రసిద్ధికెక్కిన చోట ఒక గద్దెను ఏర్పాటు చేసి అక్కడా బావాజీ వేంకటేశ్వరులు పాచికలాడుతున్న శిల్పం మలచబడి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి పుష్కరిణిలో అపశృతి.. మహిళ మృతి.. హుండీ ఆదాయం రూ.2.67కోట్లు