Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భవబంధాల మిథ్యయే. అసత్యాలేనా! శ్రీ‌కృష్ణుడు అర్జునికి చెప్పిందిదేనా!

భవబంధాల మిథ్యయే. అసత్యాలేనా! శ్రీ‌కృష్ణుడు అర్జునికి చెప్పిందిదేనా!
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (16:16 IST)
mahabharatam
ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే. యుద్ధ‌రంగ‌లో త‌న‌చుట్టూ బంధువులు, తోబుట్టువులు, స్నేహితులు వుండ‌గా వారిని చంప‌డానికి సంశ‌యిస్తున్న అర్జునిడిని ఉద్దేశించి శ్రీ‌కృష్ణుడు ప‌లు ర‌కాలుగా నైరాశ్యాన్ని పోగొట్టేలా బోధించాడు. అందులో మ‌నిషి బంధాలు ఎలా వుంటాయ‌నేవికూడా వివ‌రించారు. వాటిల్లో ఓ క‌థ‌ను పురాణాల్లో వ్యాస‌క‌ర్త‌లు చొప్పించారు. ఆ క‌థను మ‌రోసారి స్మ‌రించుకుందాం.
 
చిన్న కథ
 
ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు. కానీ ప్రవచనం పూర్తికాకుండానే వెళ్లి పోతుండేవాడు. ఒక నాడు ఆ సాధువు "నాయనా..!ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు.. "స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెదకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది. సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు. కాని ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చేడు.
 
"అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావ్..!" అన్నాడు సాధువు. " అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది." అన్నాడా యువకుడు." నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు. నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్చేడు సాధువు."ఎలా స్వామీ..?" అడిగేడు ఆ యువకుడు."ఇదిగో..! ఈ మూలిక తిను. నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పేడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయేడు.
 
అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించేరు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చేడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి.. "ఎవరో మాయను ప్రయోగించేరు. నేను దాన్ని ఉపసంహరించగలను." అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసేను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.
 
మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు." అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను. కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది. తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు. 
 
సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి. ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యనడుగగా ఆమె " వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది. కాని నేనింకా యౌవనంలో ఉన్నాను. ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.
 
ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు. సరికదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు. కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు. ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతను లేస్తూనే.. "మహాత్మా..! నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను. అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే. వాస్తవిక సంబంధం ఆ పరమాత్మతోటిది మాత్రమే అని గ్రహించేను" అంటూ ఇల్లు వదలి ఆ మహాత్మునితో వెళ్లిపోయేడు.
 
|| ఓం నమః శివాయ ||

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వదర్శనం టిక్కెట్ల జారీ... రోజుకు 2 వేల టోకెన్లు.. క్యూ కట్టిన భక్తులు