Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాళహస్తిలో దేవస్థానం సిబ్బంది లాడ్జీలతో లింకు.. భక్తులకు శఠగోపం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు సొంతంగా ప్రైవేట్ లాడ్జీలను లీజుకు తీసు

శ్రీకాళహస్తిలో దేవస్థానం సిబ్బంది లాడ్జీలతో లింకు.. భక్తులకు శఠగోపం
, మంగళవారం, 23 ఆగస్టు 2016 (12:55 IST)
శ్రీకాళహస్తీశ్వరాలయంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు సొంతంగా ప్రైవేట్ లాడ్జీలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు. లాడ్జీలను లీజుకు తీసుకుని నడపడం పెద్ద విషయమేమీ కానప్పటికీ.. ఆ లాడ్జీలలో దిగిన భక్తులకు బంపర్‌ ఆఫర్ల పేరుతో ప్రత్యేక దర్శనం, పూజలు చేయిస్తామని అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. 300 రూపాయల రాహుకేతు, పూజల్లో ఈ తంతు భారీగానే జరుగుతోంది. రోజూ వేల రూపాయలు భక్తుల నుంచి వసూళ్ళు చేస్తున్నారు. ఈ విషయంపై దేవస్థాన అధికారులు దృష్టి సారించడం లేదు.
 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న కొందరు సిబ్బంది లాడ్జీలను లీజుకు తీసుకుని భక్తులను నిలువునా ముంచుతున్నారు. రైలు మార్గం ద్వారా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకుగాను రైల్వేస్టేషన్‌ వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో సమాచార కేంద్రం ఉంది. ఆలయం నుంచి వసతి సౌకర్యాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కేంద్రం పని చేయాలి. అయితే ఇక్కడ పనిచేసే ఉద్యోగులు భక్తులను ఆలయానికి చెందిన అతిథి గృహాలకు కాకుండా ప్రైవేట్ లాడ్జీలకు ఎక్కువగా పంపుతున్నట్లు సమాచారం. ఇలా పంపడం వల్ల సదరు ప్రైవేట్ లాడ్జీల నిర్వాహకులు కమిషన్‌ రూపంలో అధిక మొత్తంలోనే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఆలయ పరిపాలనా భవనంలో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేసే కొంతమంది ఉద్యోగులు మూడు లాడ్జీలను తీసుకుని నడుపుతున్నారట. 
 
భిక్షాల గోపురం నుంచి వచ్చే మార్గంలో ఒకటి, సన్నిధి వీధి మార్గంలో ఒకటి, దక్షిణ గోపుర మార్గంలో ఒకటి చొప్పున లాడ్జీలు నడుపుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉద్యోగులు నిర్వహిస్తున్న లాడ్జీలకే అధికంగా భక్తులను తరలిస్తున్నట్లు సమాచారం. ఆలయం ద్వారా జీతాలు తీసుకుంటూ ప్రైవేటుగా తన లీజుకు తీసుకున్న లాడ్జీలకు భక్తులను తరలిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆ ఉద్యోగులు విధులకు సైతం సక్రమంగా హాజరుకావడం లేదనే విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రాహు, కేతు పూజలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. వేల సంఖ్యలో భక్తులు ఈ పూజలను చేయించుకుంటున్నారు. 300 రూపాయల రాహు, కేతు పూజల్లో ఉచిత సేవకులుగా చెప్పుకుని పనిచేస్తున్న కొందరు వ్యక్తులు ప్రైవేటు లాడ్జీలలోను పనిచేస్తున్నారు. దీనికితోడు ప్రైవేట్ లాడ్జీలను ఆలయానికి చెందిన కొందరు లీజుకు తీసుకుని నడుపుతుండటంతో అక్కడ దిగుతున్న భక్తులు పూజలు చేయించుకోవాలంటే సంబంధిత నిర్వాహకులు ఉచిత సేవకులకు సమాచారం అందిస్తున్నారు. ఇలావచ్చే భక్తులు అధికంగా ఉదయాన్నే మొదటి పూజను చేయించుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి భక్తులను క్యూలో వెళ్ళకుండా 300 రూపాయల టికెట్‌కు 500 రూపాయలు వసూలు చేయడం, ముందుగానే టికెట్లు తీసివ్వడం, ముందువరుసలో పూజలో కూర్చోబెట్టడం రివాజుగా మారిపోయింది.
 
అంటే ఒక్కోపూజకు రెండు వందలు అదనంగా వసూలు చేస్తున్నారు. తదుపరి వీరి నుంచి 200 రూపాయలు వసూళ్ళు చేసి 50 రూపాయలు టికెట్‌ మార్గంద్వారా దర్శనాలకు పంపుతున్నారు. శని, ఆది, సోమ వంటి రద్దీ రోజుల్లో ఉదయం పూజకే 50 రూపాయల టికెట్ల వరకు ఇలా దొడ్డి దారిని తీసుకుని ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు సమాచారం. ఈ తంతు ఎప్పటి నుంచో జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. 
 
శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారంలో కొందరు ఆలయ అధికారులకూ లింకు ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత సేవకులు, కాంట్రాక్టు సిబ్బంది ద్వారా అధిక మొత్తం వసూలు చేస్తుండడంతో కొందరు ఉద్యోగులకు అందులో వాటాలు అందుతున్నట్లు వినికిడి. అందుకే ఈ వ్యవహారంపై పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఈఓ భ్రమరాంబ ఇప్పటికైనా స్పందించి అవుట్‌ సోర్సింగ్, ఉచిత సేవకుల ముసుగులో భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో పెట్టుకుంటే...?