Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాళహస్తి లగేజీ లాకర్లలో భక్తులకు అడ్డనామాలు...!

శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తులను ఎవరిపాటికి వాళ్ళు అందినకాడికి నిలువునా దోచుకుంటున్నారు. రూపాయి వస్తువును రెండు రూపాయలకు కట్టబెట్టడం ఒక ఎత్తయితే రూపాయి వసూలు చేయాల్సిన చోట రెండు రూపాయలు దండుకోవ

Advertiesment
srikalahasti temple
, మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (10:44 IST)
శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే భక్తులను ఎవరిపాటికి వాళ్ళు అందినకాడికి నిలువునా దోచుకుంటున్నారు. రూపాయి వస్తువును రెండు రూపాయలకు కట్టబెట్టడం ఒక ఎత్తయితే రూపాయి వసూలు చేయాల్సిన చోట రెండు రూపాయలు దండుకోవడం మరో పద్ధతి. విషయం తెలిసినా అధికారులు పెద్దగా పట్టించుకోవపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. భక్తులను మోసం చేస్తున్న తీరుకు లగేజీ సెంటర్లే ఉదాహరణ. ఈ సెంటర్లలో నిర్ణీత కంటే రెట్టింపు వసూలు చేస్తూ భక్తులను దగా చేస్తున్నారు.
 
శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులు సెల్‌ఫోన్లు, కెమెరాలు, బ్యాగులను ఆలయంలోనికి తీసుకెళ్ళకూడదు. వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణ కోసం నాలుగు నెలలు క్రితం టెండర్లు నిర్వహించారు. పట్టణానికి చెందిన ఒక నేత ఈ టెండరు దక్కించుకున్నారు. తమ సిబ్బందిని పెట్టి ఆలయంలోని దక్షిణగోపురం, భిక్షాల గోపురం, తిరుమంజన గోపురం, ధ్వజస్థంభం వద్ద లగేజీ లాకర్స్ ఏర్పాటు చేశారు. 
 
చెప్పులు పెట్టినందుకు 2 రూపాయలు, సెల్‌ఫోన్‌కు 5, బ్యాగుకు 5, కెమెరాకు 10 రూపాయల వంతున భక్తుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఇదే రేట్లను కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే బోర్డులో ఉన్న ధరకు భక్తుల నుంచి వసూలు చేస్తున్న ధరకు పొంతన లేకుండా ఉంది. ప్రధానంగా తిరుమంజనం గోపురం వద్ద మెట్లపైకి ఎక్కేదారిలో ఒక లగేజీ లాకర్‌ ఉంది. ఏ వస్తువుకు ఎంత వసూలు చేయాలనే ధరల బోర్డును ఇక్కడ ఏర్పాటు చేసి ఉంది. అయితే భక్తుల నుంచి మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారు.
 
చెప్పులకు 5, సెల్‌ఫోన్‌, బ్యాగులకు 10, కెమెరాకు 15 నుంచి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. లగేజీ సెంటర్లపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఇది ఇప్పటిది కాదు. గతంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక భక్త బృందం ఈఓకు ఫిర్యాదు చేసింది కూడా. రోజూ వేల సంఖ్యలో వస్తువులను భక్తులు లాకర్లలో పెడుతుంటారు. ప్రతి ఒక్కరి నుంచి రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారంటే రోజులో ఎంత అక్రమంగా దండుకుంటున్నారో అంచనా వేసుకోవచ్చు.
 
ఆలయంలోని పలు లగేజీ లాకర్ల వద్ద కనీసం ధరలకు సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయంలోని ప్రసాదాల కౌంటర్ల సమీపంలోని లగేజీ సెంటర్‌ ఉంది. అయితే ఈ ప్రాంతంలో కనీసం బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఏ వస్తువును లాకర్‌లో పెడితే ఎంత చెల్లించాలనేది భక్తులకు తెలియని పరిస్థితి. దీంతో ఇష్టానుసారం భక్తులను దోచుకుంటున్నారు. 
 
నిత్యం ఈ మార్గం గుండా ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఆలయంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విషయమై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయంలో కాంట్రాక్టరు ఏర్పాటు చేసిన లగేజీ లాకర్ల ద్వారా భక్తులను నిలువునా మోసం చేస్తున్నా దేవస్థానం అధికారులుగానీ, పాలకమండలిగానీ పట్టించుకోవడం విమర్సలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పందించి లగేజీ లాకర్లలో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాంసాహారం ముట్టకుండా ఆలయాలకు ఎందుకెళ్లాలి.. సాత్విక ఆహారం అంటే ఏమిటి?