తిరుమల వెంకన్నకు వేలకోట్లు కుమ్మరించింది ఒకే ఒక్కడు... ఎవరతను?
తిరుమల గిరుల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఎంత చెప్పినా తక్కువే. తిరుమలలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాశస్త్యం కలిగింది. అంతేకాదు శ్రీవారి ఆలయం మొదట్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ప్రస్తుతం ఉందనడంలో ఎలాంటి
తిరుమల గిరుల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఎంత చెప్పినా తక్కువే. తిరుమలలోని ప్రతి ప్రాంతం ఎంతో ప్రాశస్త్యం కలిగింది. అంతేకాదు శ్రీవారి ఆలయం మొదట్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ప్రస్తుతం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేక అలంకరణలు, ఫలపుష్పాల ప్రదర్శనలు తప్ప శ్రీవారి ఆలయంలోని ప్రతి వస్తువు ఇప్పటికీ అలాగే ఉంది. పెద్ద పెద్ద రాతి స్తంభాలతో పాటు ప్రముఖుల విగ్రహాలు సైతం అలాగే ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రతిమా మండపం. అతి ముఖ్యమైన విగ్రహం శ్రీకృష్ణదేవరాయలు.
మహద్వారానికి ఆనుకొని లోపల ఉన్న 16 స్తంభాలతో 27 - 25 కొలతల గల ఎతైన మండపం నిర్మింపబడి ఉంది. ఈ మండపాన్ని కృష్ణరాయమండపమని, ప్రతిమా మండపమని అంటారు. ఈ మండపం విజయనగర శిల్ప సాంప్రదాయ రీతిలో నిర్మింపబడింది. దీన్ని ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ మండపం కనీసం చెక్కుచెదరనే లేదు.
ఈ మండపంలో కుడివైపున రాతి విగ్రహాలు ఉన్నాయి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు! విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారి విగ్రహంతో పాటు ఆయన దేవేరులైన తిరుమలదేవి, చిన్నాదేవులు విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు మొత్తం శ్రీ వేంకటేశ్వరునికి ఎదురుగా నిల్చొని ప్రాంజలి ఘటిస్తున్న భక్త వేషంలో ప్రతిష్టితులై ఉంటుంది. క్రీస్తుశకం 1517వ సంవత్సరంలో జనవరి 2వ తేదీన శ్రీ కృష్ణదేవరాయల వారే స్వయంగా తమ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విగ్రహాల భుజసీమల్లో వారి నామధేయాలు లిఖింప బడి ఉన్నాయి. ఆ నాటి నుంచి ఇది కృష్ణరాయమండపమని ప్రాశస్త్యం పొందింది.
శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుంచి 1521 సంవత్సరం వరకు ఏడుసార్లు తిరుమల యాత్ర చేశాడు. 1513 ఫిబ్రవరి 10న తొలిసారిగా రాణులతో పాటు వచ్చిన రాయలు శ్రీ వేంకటేశ్వరునికి ఒక నవరత్న కిరీటం, 25 వెండి పళ్ళాలు ఇవ్వగా ఆయన రాణులు శ్రీ స్వామివారి పాల ఆరగింపునకుగాను రెండు బంగారు గిన్నెలు ఇచ్చారట. ఆ తర్వాత రాయలొక్కరే 1513 సంవత్సరం మే 2వ తేదీన, జూన్ 13తేదీన ఇలా నెల తేడాతో రెండుమార్లు తిరుమలకు వచ్చి శ్రీ స్వామివారి మూలవిరాట్టుకు అమూల్యమైన ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించారట.
నిత్యనైవేధ్యానికి గాను ఐదు గ్రామాలను ఇనాములుగా కూడా సమర్పించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం తమిళ నెల తై మాసంలో తన మాతాపితరుల ఆత్మోద్థారణకై ఉత్సవం ఏర్పాటు చేశాడట. క్రీశ.1514 జూలై 6వ తేదీన నాలుగవసారి దర్శించి శ్రీ స్వామివారికి 30వేల వరహాలతో కనకాభిషేకం చేశారు. నిత్యారాధనకై తాళ్ళపాక గ్రామాన్ని దానమిచ్చారు. ఇక 1515లో విజయనగరంలోనే ఉండి కృష్ణదేవరాయలు శ్రీవారికి రత్నాలు పొదిగిన బంగారు మకరతోరణం సమర్పించుకున్నాడట.
ఆ తర్వాత 1517సంవత్సరం జనవరి 2వ తేదీన ఐదోసారి తిరుమలకు వచ్చి తమ విగ్రహాల్ని స్వయంగా ప్రతిష్టించుకొన్నాడట. 1518 సంవత్సరం 9వ తేదీన ఆనంద నిలయ విమానానికి 30 వేల వరహాలతో బంగారు మలాము చేయించాడు. 1518 సంవత్సరం అక్టోబర్‌లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి శ్రీనివాసునికి అపురూపమైన నవరత్నాల కుళ్ళాయిని, పీతాంబరాన్ని సమర్పించాడట. భక్తితో పాటు త్యాగాన్ని పుణికి పుచ్చుకుని, తిరుమలేశునికి బంగారు మేడ, ముంగిట్లో నిరాడంబరంగా నమస్కార భంగిమలో నిలుచున్న ఈ తెలుగు వల్లభుడు నిత్యమూ సంస్థవనీయుడని పురాణాలు చెబుతున్నాయి.