శ్రీకాళహస్తి ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయం... 'నల్ల' దళారులకు బాగా కలిసొచ్చింది.. ఎలా?
ఏ వస్తువైనా విరివిగా దొరుకుతుంటే ధర తక్కువగా ఉంటుంది. బ్లాక్ మార్కెట్ బెడద ఉండదు. ఏ వస్తువైతే డిమాండ్ మేరకు అందుబాటులో ఉండదో సహజంగానే దాని ధర పెరిగిపోతుంది. బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. అక్రమార్కు
ఏ వస్తువైనా విరివిగా దొరుకుతుంటే ధర తక్కువగా ఉంటుంది. బ్లాక్ మార్కెట్ బెడద ఉండదు. ఏ వస్తువైతే డిమాండ్ మేరకు అందుబాటులో ఉండదో సహజంగానే దాని ధర పెరిగిపోతుంది. బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. అక్రమార్కులు దాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన సాధారణ సూత్రమే. ఎప్పుడూ సరుకులను డిమాండ్ ఉండటమే బ్లాక్ మార్కెట్ దళారులకు కావాల్సిందే. అలావుంటే చేతి నిండా డబ్బులు సంపాదించుకోవచ్చు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ అధికారులు తీసుకున్న ఒక నిర్ణయం దళారులకు అనుకోకుండా అందివచ్చిన అవకాశంలా మారింది.
శ్రీకాళహస్తి ఆలయంలో రోజూ నాలుగు కాలాల్లో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలు, 6.30, 7.30, 9.30, సాయంత్రం 5.30 గంటలకు అభిషేకం జరుగుతాయి. సోమవారం మాత్రం మొదటి అభిషేకం ఉదయం 5.30 గంటలకే జరుగుతుంది. మిగతావి మామూలు సమయాల్లోననే జరుగుతాయి. రుద్రాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం నిర్వహిస్తారు. అన్ని కాలాల్లోను ఈ అభిషేకాలు జరుగుతాయి. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఆలయంలోని కౌంటర్‌లో టికెట్లు తీసుకుని వెళ్ళేవారు. రుద్రాభిషేకం టికెట్టు రూ.600, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం రూ.100, పంచామృతాభిషేకం టికెట్లు 300రూపాయలుగా ఉంది.
మొన్నటి దాకా ఈ అభిషేకాల టికెట్లు అందరికీ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వీటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రమే దొరుకుతున్నాయి. దీనికి కారణం టికెట్ల సంఖ్య భారీగా తగ్గించడమే. గతంలో ఎన్ని టికెట్లయినా ఇచ్చే వాళ్లు. రుద్రాభిషేం టికెట్లు కొన్న భక్తులను అంతరాలయంలో కూర్చోబెట్టి అభిషేకం నిర్వహిస్తారు. లోపల చోటువుంటే పాలాభిషేకం, పంచామృతాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం టికెట్ల భక్తులనూ కూర్చోబెట్టి అభిషేకం చేస్తారు. లేకుంటే క్యూలోనే వచ్చి అభిషేకాన్ని తిలకిస్తూ బయటకు వచ్చేస్తారు. టికెట్లు కొన్న వారందరినీ లోపల కూర్చోబెట్టాలనే పేరుతో టికెట్ల సంఖ్య భారీగా తగ్గించారు. ఒక్కో కాలానికి ఒక రకం అభిషేకానికి 10 టికెట్లు మాత్రమే ఇస్తున్నారు.
అభిషేకం టికెట్లు బాగా కుదించడంతో దళారులు పెరిగిపోతున్నారు. రద్దీ ఎక్కువగానే ఉండే శని, ఆది, సోమవారాల్లో సామాన్య భక్తులకు ఒక్క టికెట్లు కూడా దొరకడం లేదు. అన్నీ ఆలయంలోనే పనిచేసే ఉద్యోగులు, అధికారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకే సరిపోతున్నాయి. ఉదయం నుంచి భక్తులు క్యూలో నిలబడి ఉండగానే అడ్డదారిలో వచ్చి టికెట్లు తీసుకువెళ్ళిపోతున్నారు. దీంతో భక్తులు కౌంటర్‌లోని సిబ్బందితో ఘర్షణకు దిగుతున్నారు. టికెట్లు ఇంతగా కుదించాలనుకున్నప్పుడు వాటి విక్రయానికి పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలి. అవసరమైతే ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకోవడమే లేదా డబ్బులు పంపితే అడ్వాన్సుగా టికెట్లు ఇవ్వడమో వంటి వ్యవస్థ ఉండాలి. అలా లేకపోవడం వల్ల అభిషేకం చేయించాలని దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇది సరైనది కాదని ఆలయ ఉద్యోగులే చెబుతున్నారు. అసలు టికెట్లు కుదించాల్సిన అవసరం లేదన్నది పలువురు అంటున్నారు. గతంలో ఎలా ఉందో అలాగే కొనసాగించాలని సూచిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండే మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో ఆలయంలో కూర్చోబెట్టే అభిషేకాలు చేసే అవకాశాలున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే వారాల్లోనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. టికెట్ల సంఖ్య తగ్గించడం వల్ల దళారులు దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేసమయంలో ఆలయానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. ఈఓ, పాలకమండలి దీనిపై పున పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే భక్తుల నుంచి నిరసన ఎదుర్కోక తప్పదు.