తిరుమల ఆలయంలో వెండివాకిలి, వగపడి అర, విమాన ప్రదక్షిణలు అంటే?
తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక్కో ప్రాంతం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆలయం గురించి ఎంత తెలుసుకోవాలన్నా తక్కువే అవుతుంది. ఇప్పుడు వగపడి అర, వెండి వాకిలి, విమాన ప్రదక్షిణల గురించి తెలుసుకుందాం.. శ్రీవారి ఆలయానికి య
తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక్కో ప్రాంతం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆలయం గురించి ఎంత తెలుసుకోవాలన్నా తక్కువే అవుతుంది. ఇప్పుడు వగపడి అర, వెండి వాకిలి, విమాన ప్రదక్షిణల గురించి తెలుసుకుందాం.. శ్రీవారి ఆలయానికి యమునోత్తర పూల అరకు ఆనుకుని తూర్పు దిక్కున ఉన్న పొడవైన మండపమే వగపడి అర. ఇది మహాప్రాకారానికి ఆనుకుని లోపలివైపున ఈశాన్యమూలన అనుసంధానిస్తూ 1939 సంవత్సరంలో నిర్మింపబడిన తిరుమల శ్రీవారి ప్రసాదాల గిడ్డంగి. ఈ గిడ్డంగి అరలు అరలుగా రెండు అంతస్థులు కలిగి ఉంటుంది.
శ్రీవారి ఆలయంలో మూల విరాణ్మూర్తికి ప్రతిరోజు మూడుపూటలా అంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి నైవేద్యం చెయ్యబడుతుంది. ఇంతేకాకుండా నిత్యకళ్యాణోత్సవం, వసంతోత్సవం, పవిత్రోత్సవం, పుష్పయాగం వంటి ఉత్సవాల సేవల్లో కూడా ప్రత్యేకంగా ఉత్సవమూర్తికి నివేదింపబడతాయి. ఇలా నివేదింపబడిన లడ్డూలు, వడలు, అప్పాలు, జిలేబీలు, మురుకులు, పోళీల, సుఖియలు, దోసెలు, పిండి వంట ప్రసాదాలను నిల్వ వుంచి వాటిని భక్తులకు విక్రయించే స్థలాలకు లెక్కవంతున పంపిణి చేసే స్థలమే ఈ వగపడి అర. కళ్యాణోత్సవం, వసంతోత్సవం వంటి ఆర్జిత సేవలు చేయించే భక్తులకు కూడా ఈ వగపడి అర నుంచే ప్రసాదాలు పంపబడుతూ ఉన్నాయి.
వెండివాకిలి... ధ్వజస్థంభానికి ఎదురుగా ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి. ఇది స్వామివారి సన్నిధికి వెళ్లే రెండవ ప్రవేశద్వారమన్నమాట. ధ్వజస్తంభం దాటిన తరువాత ఉన్న రెండవ ప్రవేశం ద్వారా గోపురం మహాద్వార గోపురం కంటే కొంచెం ఉంది. ఈ గోపురం ధృఢమైన నల్లరాతితో నిర్మితమైన చౌకట్టుపై నెలకొల్పబడింది. ఈ రాతి చట్రం కొలతలు తూర్పు పడమరలుగా 24 అడుగులు, ఉత్తర దక్షిణ దిక్కులుగా 36 అడుగులు కలిగి, వీటి మధ్య 9.5 అడుగులు వెడల్పు గల ప్రవేశమార్గంతో ఒప్పుతూ ఉంది. ఈ ద్వారం అనేక శిల్పశోభితంగా నిర్మింపబడిన మూడు అంతస్థుల గోపురాన్ని ఆ గోపురంపై ప్రతిష్టించబడ్డ ఏడు బంగారు కలశాలు ఉన్నాయి.
ఈ ప్రవేశమార్గంలో తూర్పు పడమరల్లో ఇరువైపులా సమాన దూరంలో రెండు రాతి ద్వార బంధాలు బిగింపబడి ఉన్నాయి. ముందువైపు (తూర్పున) ఉన్న ద్వార బంధానికి ఎత్తైన చెక్కవాకిళ్ళు అమర్పబడి ఉన్నాయి. ఈ వాకిళ్ళకూ గడపలకూ పక్కల ఉన్న గోడలపై ప్రవేశమార్గంలో అంతటా వెండి రేకు తాపడం చేయబడింది. తెల్లగా మిరుమిట్లు గొలుపుతూ ఆనందం కలిగిస్తూ ఉంది. అందువల్లే ఈ నడిమి పడికావలి ద్వారాన్ని వెండి వాకిలి అంటారు.
1929 అక్టోబరు 1వ తేదీన నైజాం ఎస్టేట్‌కు సంబంధించిన శ్రీరాం ద్వారక దాస్ పరభణీ అను వారు ఈ వాకిళ్ళకు వెండి రేకుల తాపడం చేయించినట్లు ఈ వాకిళ్లలో ఒకదానిపై హిందీలోను, మరొక వాకిలిపై ఇంగ్లీషులోను రాయబడి ఉంటుంది. ఈ వాకిళ్ళ మీద ఇంకా ప్రవేశద్వార మార్గంలో పక్కన గోడల మీద శ్రీనివాస కళ్యాణం, మహంతు బావాజీ, శ్రీనివాసుల పాచికలాట, శ్రీరామ పట్టాభిషేకం వంటి మనోజ్ఞమైన శిల్పాలు మలచబడ్డాయి. ఈ వెండివాకిలి గోపురానికి అనుసంధించి ఉత్తర - దక్షిణం 160 అడుగులు, తూర్పు పడమన 235 అడుగుల పొడవుతో మూడు అడుగుల మందంతో 30 అడుగుల ఎత్తు రాతి ప్రాకారం నిర్మింపబడి ఉంది.
ఈ రెండవ ప్రవేశద్వారం, గోపురం, ప్రాకార కుడ్యాలు క్రీ.శ 12వ శతాబ్దంలో ప్రారంభింపబడి క్రమేణ అంచెలంచెలుగా నిర్మింపబడుతూ 13వ శతాబ్దానికి పూర్తయ్యాయని చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ గోపురం క్రీ.శ.1472-82 సంవత్సరాల మధ్య పదేళ్ళలోను మళ్ళీ ఇటీవల 1950-53 సంవత్సరాల మధ్య మూడేళ్ళలోను సడలిన చోట్ల స్వల్పంగా మరమ్మత్తులు చేయబడి పునర్నిర్మింపబడింది.
విమాన ప్రదక్షిణం.... వెండి వాకిలి దాటి లోపల ప్రవేశించగానే కనిపించే మార్గమే విమాన ప్రదక్షిణాపథం. ఇది శ్రీస్వామివారి ప్రధానాలయం చుట్టూ 235 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పు కలిగి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న దక్షిణ మార్గం. ఇది రెండవ గోపుర ప్రాకారానికి శ్రీ స్వామివారి వైకుంఠ ప్రదక్షిణ ప్రాకారానికి నడుమ నెలకొన్న మార్గం. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ఈ ప్రదక్షిణ మార్గం తూర్పున, పశ్చిమాన సుమారు 15 అడుగుల వెడల్పుతోను దక్షిణం వైపున సుమారు 30 అడుగుల వెడల్పుతోను, ఉత్తరం వైపున సుమారు 20 అడుగుల వెడల్పుతోను విస్తరించి ఉంది.
ఇది శ్రీస్వామివారి ప్రధాన గోపురమగు ఆనంద నిలయం విమానమునకు ప్రదక్షిణంగా వెళ్లే మార్గం కాబట్టి ఈ ప్రదక్షిణ మార్గాన్ని విమాన ప్రదక్షిణమని అంటారు. నిత్యం తెల్లవారుజామున శ్రీ స్వామివారికి సుప్రభాతం జరుగుతూ ఉండే వేళల్లో భక్తులు కొందరు పుష్కరిణిలో మునకలిడి తడి వస్త్రాలతో ఆలయం ప్రవేశించి ఈ విమాన ప్రదక్షిణ మార్గంలో ఆలయం చుట్టూ అత్యంత భక్తి ప్రపత్తులతో సాగిలబడి పొర్లుదండాలు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ మార్గాన్ని అంగ ప్రదక్షిణ మార్గం అని కూడా అంటారు.
ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎట్టఎదుటపై భాగంలో శ్రీ రంగనాథుడు వరుసగా దక్షిణం వైపు నుంచి ప్రదక్షిణంగా వెళితే శ్రీ వరదరాజస్వామి ఆలయం, పోటు, బంగారు బావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణాల పరకామణి కావించేమండపం, నోట్ల పరకామణి మండపం, చందనపు అర, విమాన వేంకటేశ్వరస్వామివారి దర్శనం, రికార్డు సెల్, వేదపారాయణం, సభ-అర, తాళ్ళపాకం అర, సన్నిధి భాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామి ఆలయం, పరిమళపు అర, శ్రీవారి హుండీ, శ్రీ విష్వక్సేనుల వారి సన్నిధి ఉన్నాయి. విమాన ప్రదక్షిణ మార్గంలో చుట్టూ ఉన్న ఈ గుళ్ళను చుట్టుగుళ్ళు అంటారు.