Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనుమంతునిచే రాముడు సీత జాడ తెలుసుకొనుట... ''చూసాను సీతను'' అని చెప్పడంలో?!

హనుమంతునిచే రాముడు సీత జాడ తెలుసుకొనుట... ''చూసాను సీతను'' అని చెప్పడంలో?!
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:17 IST)
సీత జాడ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న రాముడి వద్దకు తిరిగొచ్చిన హనుమంతుడు ''చూసాను సీతను'' అని తన సమాచారాన్ని మొదలుపెట్టాడు. అత్యంత కీలకమైన విషయాన్ని ఎలా చెప్పాలనే విషయం హనుమంతుడికి బాగా తెలుసు. మొట్టమొదట ''సీత'' అనే పదాన్ని పలికితే తరువాతి పదం చెప్పేలోగా రాముడి మనస్సులో ''సీతకు ఏమైంది'' అనే ఆలోచన రావచ్చునని, ఆ రెండు క్షణాలు కూడా రాముడు కంగారుపడకూడదనుకున్న హనుమంతుడు ''చూసాను సీతను'' అని చెప్పాడు. హనుమంతుడి ఆ పలుకే రాముడికి మహానందం కలిగించింది. సీత జాడ తెలియకపోవడంతో రామలక్ష్మణులు సుగ్రీవుడి వానరసైన్యంతో లంకకు బయలుదేరారు. 
 
రాముడు హనుమంతుణ్ణి వాత్సల్యంతో కౌగిలించుకొనుట.. 
రాజ్యం పోయింది. తల్లిదండ్రులు దూరమయ్యారు. స్వయంవరంలో రాముణ్ణి వివాహమాడి ఎంతో ప్రేమగా ఉండే సీత, పతియే దైవం అని కష్టాలకు భయపడకుండా రామునితో అరణ్యవాసానికి వచ్చింది అలాంటి సీతను రావణుడు ఎత్తుకుని పోయాడు. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న రాముడికి, సీతావియోగంతో దుఃఖిస్తున్న రాముడికి హనుమంతుడు సీత జాడ తెలిపిన వెంటనే ఆనందపరవశుడై అతనితో ఇలా అంటాడు. 
 
''హనుమా! ఇతరులకు దుర్లభమైన కార్యమును నువ్వు నెరవేర్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నూరు యోజనాల దూరమున్న సముద్రాన్ని వాయుదేవుడు, గరుడుడు, నీవు తప్ప తక్కినవారు దాటలేరు. అంతేకాదు దేవతలకు, దానవులకు, గంధర్వులకు, నాగులకు కూడా ప్రవేశించటానికి వీలులేని లంకానగరంలోకి ప్రవేశించి క్షేమంగా తిరిగి వచ్చావు. అది నీకే సాధ్యమైంది.''
 
దీనిని బట్టి చూస్తే లంకా నగరంలోకి హనుమంతుడు, అతడితో సమానమైన బలపరాక్రమములు కలిగినవారు తప్ప ఇతరులు ప్రవేశించలేరని తెలుస్తోంది. హనుమంతుడే తన బలపరాక్రమాలను ఉపయోగించి సుగ్రీవుని ఆజ్ఞను నెరవేర్చాడు. అది ఎంత కష్టమైన కార్యాన్నయినా, ఆసక్తితో చాకచక్యంతో నెరవేర్చినవాడే భృత్యులలో ఉత్తముడు అని చెప్పబడతాడు. హనుమంతుడు ఉత్తముడైన భృత్యుడు. 
 
''సుగ్రీవుడు చెప్పినదానికంటే ఎక్కువే చేసుకొచ్చాడు హనుమంతుడు. పైగా అత్యంత చాకచక్యంతో సమర్థతతో చేసుకొచ్చాడు. సుగ్రీవునకు, నాకూ సంతోషాన్ని కలిగించాడు. లంకకు పోయి సీతను చూసి వచ్చి నన్ను, లక్ష్మణుని, రఘువంశాన్ని ఈ హనుమంతుడే రక్షించాడు. ఇంతటి ప్రియమును చేకూర్చిన హనుమంతునికి నేను ఏ ప్రత్యుపకారమూ చేయలేని స్థితిలో ఉండటం చాలా బాధగా ఉంది'' అని శ్రీరాముడు మనస్సులో అనుకుంటూ ''హనుమా! ఇటురా. ఈ ఆనంద సమయంలో నేను నీకు నా ఆలింగనము తప్ప వేరే ఏమీ ఇవ్వలేకున్నాను'' అని పలికి రాముడు హనుమంతుని తన రెండు చేతులు చాచి గాఢంగా కౌగిలించుకున్నాడు. - ఇంకా వుంది - దీవి రామాచార్యులు (రాంబాబు) 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"త్రినేత్రునితో పోరాటమా? భస్మమైపోతావు. వెంటనే ఇక్కడ్నుంచి పారిపో"