Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబాకు శాంతమే భూషణం, మౌనమే అలంకారం

బాబాకు శాంతమే భూషణం, మౌనమే అలంకారం
, బుధవారం, 27 మే 2020 (23:41 IST)
బాబాకు శాంతమే భూషణం. మౌనమే అలంకారం. బాబా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు. బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉండేవారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం లేదు. బాబా అంతరంగం అద్దం వలె స్వచ్చమైనది. 
 
బాబా పలుకులు అమృత బిందువులు. బాబాకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. బాబాకు అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. బాబా అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. ఆడేవారు. పాడేవారు. దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని బాబా చెప్పారు.
 
తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం చేశాడు.
 
బాబా పెదవులపై 'అల్లామాలిక్' అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. జగద్రక్షకుడు కదా.... బాబా అంతరంగం సముద్రమంత లోతు, ప్రశాంతం, గంభీరం. బాబా దర్బారు ఘనమైనది. వందలకొద్దీ ఉపదేశాలకు అది వేదిక. బాబా ది సచ్చిదానంద స్వరూపం. సాయినాధుడు నిరుత్సాహం కానీ, ఉల్లాసం కానీ ఎరుగరు. ఎల్లప్పుడు ఆత్మానందంలో తేలియాడుతుండేవారు.
 
మన గురించి మనం ఆలోచించడం  మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి నేను, నాది అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నారు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవరాశుల్లో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పారు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆన్‌లైన్‌లోనూ లడ్డూల విక్రయం!