Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి ఆలయంలో స్వామివారి పరివారదేవతలు ఎవరో తెలుసా...?!

తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ముగ్గురు పరివార దేవతలు ఉన్నారు. అందులో అనంతుడు, విష్వక్సేనులు, గరుడుడు ఉన్నారు. శ్రీ మహావిష్ణువునకు శయ్యగా సేవ చేస్తున్న ఆదిశేషుడే ఈ అనంతుడు. వరదాభయహస్త ముద్రలతో తల

శ్రీవారి ఆలయంలో స్వామివారి పరివారదేవతలు ఎవరో తెలుసా...?!
, శనివారం, 20 ఆగస్టు 2016 (16:03 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి ముగ్గురు పరివార దేవతలు ఉన్నారు. అందులో అనంతుడు, విష్వక్సేనులు, గరుడుడు ఉన్నారు. శ్రీ మహావిష్ణువునకు శయ్యగా సేవ చేస్తున్న ఆదిశేషుడే ఈ అనంతుడు. వరదాభయహస్త ముద్రలతో తలపై నాగపడిగెలతో విరాజిల్లుతున్న పంచలోహమూర్తి అనంతుడు. బ్రహ్మోత్సవంలో మొదటిరోజు ధ్వజారోహణానికి ముందు దిక్పాలురను ఆహ్వానించే గ్రామోత్సవంతో ఈ అనంతుడు పాల్గొంటాడు.
 
ఇక విష్వక్సేనులు ఎవరంటే... సర్వలోక సార్వభౌముడైన శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వసైనాధ్యక్షులే ఈ విష్వక్సేనులవారు. వీరినే సేవ మొదలియార్‌ అని కూడా పిలుస్తారు. శంఖ చక్రధారియై అభయ వరదహస్తాలతో విరాజిల్లుతున్న ఈ పంచలోహ మూర్తి అయిన సేనాపతి, శ్రీ స్వామివారి ఉగాది, దీపావళి ఆస్థానం, ఆణివార ఆస్థానం తదితర ఆస్థాన సేవల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. శ్రీవారి ప్రతి ఉత్సవంలో అంకురార్పణకుగాను మృత్సంగ్రహణ కార్యంలో ఆధ్వర్యం వహిస్తాడు శ్రీవారి సేనాపతి అయిన విష్వక్సేనులు.
 
గరుడుడు. ఈయనకు ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీ స్వామివారి ఆజ్ఞను నెరవేర్చడానికి ఎప్పుడూ రెక్కలు విప్పుకొని సిద్ధమై సర్వసన్నద్ధమై నమస్కరిస్తూ నిలిచి ఉన్న పంచలోహమూర్తి గరుడుడు. బ్రహ్మోత్సవం తొలినాడు దిక్పాలురనాహ్వానించే గ్రామోత్సవంలో ఈ గరుడుడు పాల్గొంటాడు. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు గల ఈ పంచలోహ ఉత్సవమూర్తులన్నీ ఆయా ఉత్సవాలలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. 
 
ప్రస్తుతం శ్రీవారి గర్భాలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ స్వాముల వారి విగ్రహాలు ఒకప్పుడు ఇక్కడి అరుగుల మీద ఉండినందువల్లే ఈ గది రాములవారి మేడ అని పిలువబడిందట. అయితే తరువాత కాలంలో ఆ విగ్రహమూర్తులను సన్నిధి లోపలికి తరలించడం జరిగిందని అంటారు. అయినా ఆ పేరు అలానే నిలిచి ఉంది. ప్రస్తుతం ఈ అరుగుల మీద ఉండిన చిన్న విగ్రహాలన్నీ కూడా బయట బంగారు బావి వద్దగల అంకురార్పణ మండపంలోకి తరలింపబడ్డాయి. అక్కడ ఆ మూర్తులు ఉంటారు. యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో రాముల వారి మేడ గడప వెలుపల నుంచే శ్రీ స్వామివారి దర్శనం ఏర్పాటు చేస్తారు. 
 
రాముల వారి మేడలో రాతి గడపను దాటి లోనికి ప్రవేశిస్తే ఉండే గది శ్రీ స్వామివారి శయన మండపం. రాముల వారి మేడకు శయన మండపానికి మధ్యన ఉండే రాతి గడపకు బయటివైపు చెక్క కటాంజనపు వాకిళ్ళు బిగింపబడి ఉన్నాయి. కానీ ఈ తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. రాత్రి స్వామివారి ఏకాంత సేవ సమయంలో తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు ఈ రాములవారి మేడలోని నడవలో కూర్చొని తంబుర మీటుతూ స్వామివారి లాలిపాటను పాడి వినిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. 
 
అంతేకాదు స్నపన మండపం దాటిన వెంటనే ఒక మేడ కూడా ఉంటుంది. ఈ ఇరుకైన నడవనే రాముల వారి మేడ అంటారు. 12..10 కొలతలు గల ఈ రాముల వారి మేడ క్రీ.శ.1262-65కు ముందు లేనే లేదని, ఇది ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షిణ మార్గంలోని భాగంగా కలిసి ఉండేదని పరిశోధకుల అభిప్రాయం. స్నపన మండపం నుంచి రాముల వారి మేడలో ప్రవేశించడానికి ఆరు అడుగుల వెడల్పు గల రాతి ద్వార బంధం, దానికి బయటి వైపు చెక్క కటాంజనపు తలుపులు, లోపలివైపు మామూలు చెక్క తలుపులు బిగింపబడి ఉన్నాయి. లోపలి తలుపులు మూసి బీగాలు వేయడానికి అనువుగా వాటిని చిలుకులు అమర్పబడినాయి.
 
రాముల వారి మేడలో ఇరువైపులా ఎత్తైన అరుగులున్నాయి. దక్షిణం వైపు అరుగు మీద ఉత్తరాభిముఖంగా రాముల వారి సేవా పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల ఉత్సవ విగగ్రహాలు ఉన్నాయి. అలాగే ఉత్తరం వైపు అరుగు మీద దక్షిణాభిముఖంగా శ్రీ వేంకటేశ్వరుని సేవా పరివారమైన విష్వక్సేన, అనంత, గరుడుల ఉత్సవమూర్తులు కొలువై ఉన్నాయి. వీరినే నిత్యసూరులంటారు. 
 
రాముల వారి సేవా పరివార దేవతలు గురించి తెలుసుకుందాం...
సుగ్రీవుడు... ఈయన వానర రాజైనందువల్ల కిరీటాన్ని ధరించి, సర్వజగన్‌ ప్రభువైన శ్రీరాముల వారికి అంజలి ఘటిస్తూ నిలిచి ఉన్న మూర్తి సుగ్రీవుడు. శ్రీరామనవమి మరుసటి దశమిరోజు శ్రీరామ పట్టాభిషేకంలో ఈ సుగ్రీవుడు పాల్గొంటాడు.
 
అంగదుడు... వేంకటాచలంలోని శ్రీ వేంకటేశ్వరునిలో శ్రీరాముల వారి తేజస్సును దర్శించి ఓహో వారే వీరా అని ఆశ్చర్యపోతూ ఉన్న భంగిమలో ఉన్న యువరాజు అంగదుడు. యువరాజు కనుక ఈ మూర్తికి చిన్నటోపీ లాంటి కీరీటం కూడా ఉంది. శ్రీరామ నవమి మరునాడు పట్టాభిషేకం ఆస్థానంలో పాల్గొంటారు.
 
ఆజ్ఞాపాలక ఆంజనేయుడు... శ్రీరామచంద్రుల వారి ఆజ్ఞను వింటూ చిత్తం, చిత్తం అని అంటూ ఉన్నప్పుడు ఆ రాముల వారి మీద తన నోటి తుంపరులు పడకుండా శ్వాస పారకుండా చేతిని అడ్డం పెట్టుకుని భయభక్తులతో వినయంగా నిలిచి ఉన్న మూర్తి ఈ ఆంజనేయుడు. అందువల్లే ఈయన ఆజ్ఞా పాలక ఆంజనేయస్వామి. శ్రీరామ నవమి ఆస్థానం, పట్టాభిషేకం వంటి సమయాల్లో ప్రధాన పాత్ర వహిస్తున్న మూర్తి ఈయన. ఇలా శ్రీవారికి ముగ్గురు, రాముల వారికి ముగ్గురు సేవా పరివార దేవతలు ఆలయంలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీ సేవ‌లు అమోఘం... ఉప ముఖ్య‌మంత్రి చిన‌రాజ‌ప్ప‌