శ్రీకాళహస్తిలో ఇక ఆన్‌లైన్ దర్శనమే... భక్తులకు తప్పనున్న తిప్పలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్వహణ, దర్శనం, ప్రసాదాల పంపిణీ, టిక్కెట్ల మంజూరు, గదుల కేటాయింపు తదితర వాటిలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇందులోభాగంగా చిత్తూరు జిల్లాలో రెండు ప్రధాన ఆలయాలైన శ్రీకాళ
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్వహణ, దర్శనం, ప్రసాదాల పంపిణీ, టిక్కెట్ల మంజూరు, గదుల కేటాయింపు తదితర వాటిలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇందులోభాగంగా చిత్తూరు జిల్లాలో రెండు ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం దేవస్థానాలల్లోను కీలక మార్పులు జరగబోతున్నాయి. అన్నింటికీ ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకురానున్నారు. దీనికి సంబంధించి దేవదాయ శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం 20 వేల మందికిపైగా దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే అన్నింటికీ తిరుమల తరహాలో ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బయో మెట్రిక్ పద్ధతిలో యాక్సెస్ కార్డులు ఇవ్వడం, దర్సనం టిక్కెట్టుతో పాటు ప్రసాదాల టిక్కెట్లు మంజూరు చేయడం వంటి పద్ధతులను ప్రవేశపెట్టబోతున్నారు. ఒక భక్తబృందం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వస్తుంది. దర్శనానికి 4 - 5 గంటల సమయం పడుతోంది. అలాంటప్పుడు ఆ భక్తులకు బయోమెట్రిక్ పద్ధతిలో యాక్సెస్ కార్డులు ఇస్తారు. ఆ కార్డు తీసుకుని బస చేసిన గదికి వెళ్ళిపోవచ్చు. లేదా దగ్గరి ప్రాంతాలను చూసి రావచ్చ.
తమకు కేటాయించిన సమయానికి క్యూలైన్‌లోకి వస్తే చాలు. గంట, అరగంటలో దర్శనం పూర్తవుతుంది. టిక్కెట్టు కోసం మరోచోట క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. దర్శనం టిక్కెట్టుతో పాటు ప్రసాదాల టిక్కెట్లూ ఇచ్చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి కౌంటర్‌లో ఇచ్చి ప్రసాదాలు తీసుకోవడమే. అదేవిధంగా ఆన్‌లైన్‌లోనే దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే విధానమూ అందుబాటులోకి రానుంది.
ఈ తరహా సేవలో అందించే పలు సంస్థలతో రాష్ట్ర దేవదాయ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. 01.11.2016 తితిదే ధర్మకర్తల మండలి సమావేశం కోసం తిరుమలకు వచ్చిన దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ ఒక బయోమెట్రిక్ సంస్థతో కొండపైనే చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ సంస్థ ఇప్పటికే తిరుమలతో పాటు షిర్డీ, జమ్మూకాశ్మీర్‌లోని వైష్ణవి దేవి ఆలయం, హరిద్వార్, రిషికేష్, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా ఇలాంటి చోట్ల భక్తులకు ఆన్‌లైన్, బయోమెట్రిక్ సేవలు అందిస్తోంది. ఈ సంస్థ రాష్ట్రంలోని శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ఆలయాల్లోనూ తనసేవలు విస్తరించడానికి సిద్ధపడి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోంది. వారం పది రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశముంది.
ఇప్పటికే ఆలయాల వద్ద అద్దె గదుల కేటాయింపు, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల వాటి నిర్వహణ మెరుగుపడుతుందని భక్తులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మిగతా అంశాలపైనా అధికారులు దృష్టి సారించారు. ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి త్వరగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.