శ్రీకాళహస్తి ముక్కంటీశుని హుండీలోనూ పాతనోట్లే
తిరుమల శ్రీవారి హుండీలోనే గాదు శ్రీకాళహస్తి ముక్కంటీశుని హుండీలోనూ రద్దయిన పాతనోట్లే ఎక్కువగా జమ అవుతున్నాయి. కొత్త నోట్లు నామ మాత్రంగా వస్తున్నాయి. తాజాగా నిర్వహించిన శ్రీకాళహస్తి హుండీ లెక్కింపును గ
తిరుమల శ్రీవారి హుండీలోనే గాదు శ్రీకాళహస్తి ముక్కంటీశుని హుండీలోనూ రద్దయిన పాతనోట్లే ఎక్కువగా జమ అవుతున్నాయి. కొత్త నోట్లు నామ మాత్రంగా వస్తున్నాయి. తాజాగా నిర్వహించిన శ్రీకాళహస్తి హుండీ లెక్కింపును గమనిస్తే చాలా విషయాలు అవగతమవుతున్నాయి.
కొత్త నోట్లు పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాకపోవడం, పాత నోట్లు మార్పుకోవాల్సిన అవసరం ఉండటంతో భక్తులు పాత నోట్లనే దేవుడికి కానుకగా వేస్తున్నారు. 28.10.16 నుంచి 15.11.2016 దాకా ముక్కంటికి హుండీ ద్వారా లభించిన కానుకలను లెక్కించారు. కొత్తగా వచ్చిన 2 వేల రూపాయల నోట్లు 14మాత్రమే హుండీలో పడ్డాయి. ఆ నోటు చెలామణిలోకి వచ్చి ఏడు రోజులైనా 14 నోట్లే వచ్చాయంటే రోజుకు రెండు మాత్రమే వచ్చనట్లు లెక్క.
ఇక రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు 700 వచ్చాయి. 500రూపాయల నోట్లు 2,998 నోట్లు వచ్చాయి. మొత్తం నోట్ల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం 87.63 లక్షలు కాగా ఇందులో పాత నోట్ల ద్వారానే 15.69 లక్షలు వచ్చాయి. దేవునికి ధనికులు సమర్పించే డబ్బుల కంటే సాధారణ భక్తులు సమర్పించే కానుకలే ఎక్కువగా ఉంటున్నాయి.
సాధారణ భక్తులు ఎక్కువగా 10 నుంచి 100రూపాయల దాకా హుండీలో సమర్పిస్తుంటారు. వంద రూపాయల నోట్ల రూపంలో స్వామికి 31.18 లక్షలు వచ్చింది. 10 నోట్ల రూపంలో 17,55,020 లక్షలు సమకూరింది. అంటే పెద్ద నోట్ల ద్వారా వచ్చిన ఆదాయం కంటే చిన్న నోట్ల ద్వారా మూడు రెట్ల ఆదాయం వచ్చింది. కాయిన్స్ ద్వారా 3.91 లక్షలు వచ్చింది.
దేవాలయాల్లోని హుండీలకు వచ్చే యేడాది మార్చి దాకా పాతనోట్లే వచ్చే అవకాశముంది. రిజర్వు బ్యాంకు ద్వారా మార్చి 31 దాకా పాతనోట్లను మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. హుండీలో వచ్చిన కానుకలను ఎప్పటికప్పుడు బ్యాంకులకు జమ చేస్తారు. కనుక పాతనోట్లను మార్చుకోవడం ఆలయాలకు పెద్ద సమస్య కాబోదు.
అందుకే జనం మార్చి దాకా పాతనోట్లనే హుండీలో వేసే అవకాశముంది. మార్చిలో ఈ నోట్లు భారీగా వచ్చే అవకాశమూ ఉంది. అప్పటిదాకా మార్చుకోలేని వారు.. హుండీల్లో వేసే అవకాశముందని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో శ్రీకాళహస్తి హుండీ ఆదాయం పెద్దగా పెరిగిన పరిస్థితి కనిపించడం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో అలాంటి మార్పు కనిపించే అవకాశాలున్నాయి.