Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పని నేనే చేసుకుంటే ఇంక అతనేం చేస్తాడు

బలవంతులతో దుర్బలులెప్పుడూ పోటీపడకూడదు. పెద్ద రాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెపుతుంటారు. హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం వుండేది. ఓసారి నారద మహర్షి ఆ దారిన వెడుతూ మధ్యలో బూరుగు వృక్షం కనబడితే అక్కడ ఒక్క క్షణం ఆగి... బూరుగా... ఈ హిమ

Advertiesment
mahabharatham
, మంగళవారం, 16 జనవరి 2018 (17:53 IST)
బలవంతులతో దుర్బలులెప్పుడూ పోటీపడకూడదు. పెద్ద రాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెపుతుంటారు. హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం వుండేది. ఓసారి నారద మహర్షి ఆ దారిన వెడుతూ మధ్యలో బూరుగు వృక్షం కనబడితే అక్కడ ఒక్క క్షణం ఆగి... బూరుగా... ఈ హిమవత్ పర్వతం మీద ఇన్నాళ్లు నుంచి వున్నావు. ముదురు కొమ్మలతో మూలబలంతో ఠీవిగా నిలబడ్డావు. నీ అంత పొడుగూ, వైశాల్యం కలిగిన చెట్టు మరేదీ లేదిక్కడ. ఎన్నో పక్షులు నిన్ను ఆశ్రయించి జీవిస్తున్నాయి. గాలికి అన్ని చెట్లు కూలిపోతాయి కదా, నువ్వు ఇన్నాళ్లు కూలకుండా ఎలా వున్నావు. నీకూ వాయుదేవుడికీ ఏమయినా చుట్టరికం వున్నదా లేకపోతే అతడు దయతలచి పోన్లే పాపం కదా అని నిన్ను రక్షిస్తున్నాడా? ఏమిటి రహస్యం అని అడిగాడు. 
 
బూరుగు వృక్షం ఆ మాటలకు ఉబ్బితబ్బిబ్బయింది. మునీంద్రా, తెలియక మాట్లాడుతున్నావు. నా బలం ముందు వాయుదేవుడెంత, అతగాడి బలం నా బలంలో పదోవంతుకు కూడా రాదు అంది కొమ్మలు విదిలిస్తూ గర్వంగా. నారదుడు చిన్నగా నవ్వి, అమ్మమ్మ అంత మాటనకు. వాయుదేవుడు తలచుకున్నాడంటే కొండలే కూలిపోతాయి. ప్రభంజనుడంటే సర్వాన్నీ చక్కగా విరిచేవాడని అర్థం. తెలిసిందా అని చిన్నగా నవ్వాడు. 
 
అదేమో నాకు మాత్రం తెలీదు. నా మొదలు, కొమ్మలూ చూశావా. ఎంత బలంగా ఉన్నాయో. నన్ను తాకితే అతడికున్న ప్రభంజనుడనే బిరుదు కాస్తా పోతుంది అంది బూరుగు. సరే జాగ్రత్త నీ కొమ్మలూ, రెమ్మలూ వస్తా అంటూ చిరునవ్వు నవ్వి బయల్దేరాడు నారదుడు. సంగతంతా చిటికెలో అందించేశాడు వాయుదేవుడికి. అతడు రానే వచ్చాడు. 
 
ఏం బూరుగా, ఏం వాగావు, మళ్లీ అను నిన్ను తాకలేనా పడగొట్టలేనా... నా ఆటలు నీ దగ్గర సాగవా నీకు చేటుకాలం వచ్చింది. మాటలెందుకు కాచుకో అన్నాడు కోపంగా.  
 
తేలిగ్గా మాట్లాడకు... లోకంలో వున్న వృక్షాల మాదిరిగానే నన్నూ చూస్తున్నట్లున్నావు. అంది బూరుగ. పకపకా నవ్వాడు వాయుదేవుడు. ఓహో ఎంత గర్వం. అన్ని వృక్షాల లాంటిదానవు కాక నీకేం కొమ్ములు మొలిచాయా, బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడన్న గౌరవం కొద్దీ నిన్ను ఏం చేయకుండా ఇన్నాళ్లూ వదిలేశాను. అందుకే ఇప్పుడిలా పొగరెక్కి మాట్లాడుతున్నావు. ఇప్పుడు పనిలో వున్నాను. రేపు తేల్చుకుందా బలాబలాలు అని విసవిస వెళ్లిపోయాడు. 
 
వాయుదేవుడు వెళ్లిపోయాక బూరుగు వృక్షానికి భయం పట్టుకుంది. అయ్యో , మహాబలుడైన వాయుదేవుడితో ఎరగకపోయి విరోధం తెచ్చుకున్నానే రేపు నా గతేమిటి? నారద ముని మాటలు వినకపోయాను కదా అని ఆ బూరుగ విచారించింది. 
 
మరుక్షణం మళ్లీ కొంచెం ధైర్యం తెచ్చుకుని మహా వాయుదేవుడొస్తే ఏం చేస్తాడు. కొమ్మలూ రెమ్మలూ విరిచేస్తాడు. ఆకులు రాల్చేస్తాడు. అంతేగా... ఆ పని నేనే చేసుకుంటే ఇంక అతనేం చేస్తాడు. ఓడిపోయినట్లేగా అనుకుని ఆ రాత్రి తీరికగా కూర్చుని ఆకులు, రెమ్మలూ రాల్చుకుని  మోడై నిలబడింది బూరుగ. తెల్లవారింది.
 
భయంకరంగా ధ్వని చేస్తూ ప్రతిజ్ఞ తీర్చుకోవడానికి వచ్చాడు వాయుదేవుడు. బూరుగను చూసి పెద్దగా నవ్వుతూ.. నా పని నువ్వే చేశాసేవే. మంచిది ఇంక బుద్ధి తెచ్చుకో. ఒళ్లు దగ్గర పెట్టుకుని బ్రతుకు. నువ్వే కాదు నీ బంధువులందరికీ కూడా చెప్పు అని హేళన చేసి వెళ్లిపోయాడు. బూరుగ సిగ్గుతో తలదించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మౌని అమావాస్య నేడే... ఇలా చేయండి