Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వరుడిగా ఎందుకు వెలిశాడు?

Advertiesment
వైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వరుడిగా ఎందుకు వెలిశాడు?
, గురువారం, 14 మార్చి 2019 (22:44 IST)
ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.
 
మహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీసమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు.
 
బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.
 
శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి  ఓ మహర్షీ... మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కాని తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది.
 
శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యి కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలిసి భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం నాడు గుడికి వెళ్తున్నారా..?