లోక కల్యాణార్థం వైశాఖ మాసంలో టిటిడి తలపెట్టిన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం అక్షయతృతీయనాడు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం యాగశాలలో లక్ష్మీనారాయణపూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 11నుండి 12 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా వర్సిటీ ఆచార్యులు మాట్లాడుతూ విశేషమైన అక్షయతృతీయనాడు లక్ష్మీనారాయణ పూజ చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందన్నారు. అక్షయతృతీయను దానతృతీయ అనికూడా అంటారని, ఈరోజు దానం చేయడం వల్ల విష్ణుప్రాప్తి, కైవల్యప్రాప్తి కలుగుతాయని వివరించారు.
ముందుగా సంకల్పంతో ప్రారంభించి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, లక్ష్మీనారాయణ పూజ చేశారు. అనంతరం విష్ణు అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించారు. ఆ తరువాత క్షమాప్రార్థనతో ఈ పూజ ముగిసింది. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ ఇతర ఆచార్యులు పాల్గొన్నారు.