కృష్ణమ్మ పుష్కరాల కోసం శ్రీవారి సైన్యం రెఢీ...!

ఆగష్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న కృష్ణ పుష్కరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యావత్తు కృష్ణమ్మ తీరానికి తరలిపోనుంది.

శనివారం, 23 జులై 2016 (12:10 IST)
ఆగష్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న కృష్ణ పుష్కరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యావత్తు కృష్ణమ్మ తీరానికి తరలిపోనుంది. గోదావరి పుష్కరాల్లో తితిదే పోషించిన పాత్ర సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అదే రీతితో కృష్ణ పుష్కరాల్లోను జనానికి సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికతో ఇక్కడి నుంచి బయలుదేరబోతోంది. విజయవాడలో దాదాపు వారం ముందు నుంచే తితిదే కార్యక్రమాలు మొదలుకాబోతున్నాయి. శ్రీవారి దర్శనం నుంచి వైద్య సదుపాయాల దాకా అనేక అంశాల్లో తితిదే తన వంతు కర్తవ్యం నిర్వర్తించనుంది. అడుగడుగునా తిరుమల తిరుపతి దేవస్థానం తన విశిష్టతను చాటుకోనుంది.
 
తితిదే పుష్కర యాత్ర ఆగస్టు 3వ తేదీన తిరుమల నుంచి మొదలుకానుంది. ఆ రోజు ప్రత్యేక వాహనం తిరుమల నుంచి బయలుదేరి తిరుచానూరు, ఒంటిమిట్ట, అహోబిలం, శ్రీశైలం మీదుగా ఆగష్టు 5న విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయానికి చేరుకుంటుంది. అప్పటి నుంచి కార్యక్రమాలు మొదలువతాయి. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో ఏర్పాటు చేస్తున్న నమూనా ఆలయం వద్ద భక్తులకు సేవలందించేందుకు 800మంది అధికారులు, సిబ్బంది తరలివెళ్ళనున్నారు. భక్తులకు సేవలు అందించడం కోసం వెయ్యి మందితో కూడిన శ్రీవారి సైన్యాన్ని సిద్ధం చేశారు. 
 
తితిదే అధికార యంత్రాంగం యావత్తు కృష్ణ తీరంలోనే తిష్ట వేయనుంది. దాదాపు ఆరు నెలల నుంచి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్న దేవస్థానం పుష్కరాల్లో తన ప్రత్యేకతను, విశిష్టతను చాటుకోనుంది. తిరుమలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో భక్తులకు సేవలు అందించడం కోసం పక్కా ప్రణాళికలు రూపొందించనుంది.
 
విజయవాడలోని పీడబ్ల్యుడీ మైదానంలో ఏర్పాటవుతున్న శ్రీవారి నమూనా ఆలయంలో ఆగష్టు 7వ తేదీ నుంచి భక్తులకు దర్సనానికి అనుమతిస్తారు. ఆగస్టు 7వ తేదీ ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి నమూనా ఆలయాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. అక్కడా తిరుమల ఆలయంలో లాగా స్వామివారికి అన్ని సేవలూ నిర్వహిస్తారు. రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వూంజల్‌ సేవ జరగుతుంది. 
 
రాత్రి 10 గంటలకు ఆలయం మూసివేస్తారు. రోజూ రెండుసార్లు వేదఘోష జరుగనుంది. నమూనా ఆలయ ప్రాంగణంలో తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 24 గంటలూ అఖందనామ సంకీర్తనం చేయనుంది. స్వామివారి దర్శనం తర్వాత భక్తులకు చక్కెర, పొంగళి, పులిహోర, చిన్న లడ్డూలను పంపిణీ చేస్తారు. భక్తులకు స్వామివారి ప్యాకెట్‌ సైట్‌ ఫోటోలు అందజేస్తారు.
 
కృష్ణ పుష్కరాల విశిష్టతపై సప్తగిరి మాసపత్రిక ప్రత్యేక సంచిక ప్రచురించనుంది. పుష్కర కృష్ణ పేరిట ప్రత్యేక సావనీర్‌ ఆవిష్కరించనున్నారు. కృష్ణ హారతి సహా అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎస్‌వీబీసీ సిద్ధంగా ఉంది. కృష్ణా నది విశిష్టతపై ఇప్పటికే పలు డాక్యుమెంట్ల నిర్మించి ప్రసారం చేస్తోంది. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అమరావతిలోని బుద్ధ విహారం వద్ద, శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణు ఆలయం వద్ద, మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ వద్ద ఆధ్మాత్మిక, సంగీత ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
 
హుండీ కానుకలు లెక్కించేందుకు పరకామణి విభాగంతో పాటు ఆయుర్వేద, ఫలపుష్ప, ఫోటో ఎగ్జిభిసన్లు, పుస్తక విక్రయశాలలు ఏర్పాటు చేస్తున్నారు. తితిదే ఆయుర్వేద డిస్పెన్సరీ, కృష్ణ జిల్లా వైద్యశాఖ, తితిదే వైద్య విభాగం ఆధ్వర్యంలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తాత్కాలిక డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తున్నారు.
 
కృష్ణా పుష్కరాల్లో ఈఓ సాంబశివరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు భక్తులతో, ఇటు ప్రభుత్వంతో భేష్‌ అనిపించుకునేలా తితిదే కార్యక్రమాలు ఉండాలన్న తలంపుతో ప్రతి చిన్న విషయంపైనా స్వయంగా సూచనలిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రహ్మోత్సవాలతో సమానంగా పుష్కరాలకు తితిదే సన్నద్ధమవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రీవారి ఆలయం 2.20 ఎకరాలు - మహద్వారం క్రీస్తు శకం 13వ శతాబ్దం...!