కోటి సోమవారం... స్నానం, దానం, ఉపవాసమేదైనా... కోటి రెట్లు పుణ్యఫలం
నేడే చాలా విశేషమైన కోటి సోమవారం. నేడు చేసే స్నాన, దాన, ఉపవాసం ఏదైనా కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. ఉపవాసం అనగా దగ్గరగా నివశించడం. 'ఉప' అంటే 'దగ్గరగా'... 'వాసం' అంటే 'నివశించడం' అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండటమంటే, భగవంతునికి దగ్గరగా నివసించడం అని
నేడే చాలా విశేషమైన కోటి సోమవారం. నేడు చేసే స్నాన, దాన, ఉపవాసం ఏదైనా కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. ఉపవాసం అనగా దగ్గరగా నివశించడం. 'ఉప' అంటే 'దగ్గరగా'... 'వాసం' అంటే 'నివశించడం' అని అర్థం. పర్వదినాలలో ఉపవాసం ఉండటమంటే, భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవునిపై మనస్సు పూర్తిగా లగ్నం చేయాలి, ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని భగవన్నామ స్మరణ చేస్తూ గడపాలి.
నిష్కామంగా ఉపవాస దీక్షను చేయగలిగితే, భగవంతుడు మన కోరికలను అడగకుండానే నేరవేరుస్తాడు. శరీరానికి అలసట కలిగితేనే మనసు స్థిరపడుతుంది. మనస్సు స్థిరపడి నిగ్రహాన్ని పొందితేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొందినప్పుడే ఓ మనిషి తనని తాను తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకోవడమంటేనే దైవం గురించి తెలుసుకోవడమన్నమాట. దైవం గురించి తెలుసుకున్నాడు సాక్షాత్తు దేవుడితో సమానం. ఆవిధంగా దేవునికి సన్నిహితంగా,దగ్గరగా నివసింపచేసేదే "ఉపవాసం" అంటే.
ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం, మితాహారాన్ని భుజించడం - ఈ రెండూ ఉపవాస దీక్షకు చాలా అవసరం. ఇష్టపూర్వకంగా, ఎవరి బలవంతం మీదనో కాక స్వతంత్రంగా ఉపవాసం ఉండడం వల్ల మనకు తెలియకుండానే మన మనస్సు, శరీరం ఓ క్రమశిక్షణకు అలవాటు పడతాయి. ఉపవాస దీక్షను అనుసరించదలచిన వారికి దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఉపవాస దీక్ష చేస్తున్న రోజును ఎంతో పవిత్రమైన దినంగా భావించాలి. సాంసారిక, రాజకీయాది బాహ్య వ్యాపారాలన్నిటినీ వీలైనంత మేరకు మనసా, వాచా, కర్మణా త్యజించాలి. కేవలం ఆధ్యాత్మిక చింతనతో పొద్దుపుచ్చాలి.
ఉపవాస వ్రతాన్ని అనుసరిస్తున్న రోజున వీలైతే మౌనం పాటించడం ఉత్తమం. అది వీలు కుదరకపోతే, కనీసం మితంగా మాట్లాడాలి. ముఖ్యంగా మనోవైకల్యాలు రాకుండా నిగ్రహించుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించడం, జపం చేయడం. మౌనవ్రతం పాటించడం, భజనలు పాడుకుంటూ రాత్రిపూట జాగారం చేయడంలాంటివి అనుసరించాలి. సర్వసాధారణంగా ఉపవాసమంటే, వండిన ఆహార పదార్థాలను తినకూడదు. పాలు, పండ్ల లాంటి వండని ఆహార పదార్థాలు కొద్దిగా తీసుకోవచ్చు. కొంతమంది పచ్చి గంగైనా ముట్టకుండా, ఉపవాసం ఉంటారు. తట్టుకోగల శక్తి ఉంటే అలా ఏమీ తినకుండా, తాగకుండా కూడా ఉపవసించవచ్చు.
ఉపవాస దీక్ష రోజున వయసు,ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకుని పండ్లను పాలను స్వీకరిస్తూ పూర్తిగా దైవ చింతనలోనే దీక్షా సమయాన్ని గడపాలి. అయితే, వృద్ధులు, శారీరకంగా బలహీనులు, రోగులు, చిన్న పిల్లలు ఉపవాసం చేయాల్సిన పని లేదు. ముసలి వారికి, బ్రహ్మచారులకు, చిన్నపిల్లలకు ఉపవాస దోషం లేదు.