Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి వాకిలికి బంగారు పూత వేయిస్తానన్న శేఖర్ రెడ్డి... అందుకే పట్టుబడ్డారా? వజ్రకిరీటం కానుకిచ్చి గాలి జైలుపాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడైన శేఖర్‌ రెడ్డి ఇటీవల జాతీయ స్థాయి వార్తలకు కేంద్రంగా మారారు. ఆయన ఇంట్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.కోట్లకు కోట్ల డబ్బులు, వందల కేజీల బంగారు బయటపడటం అందరినీ విస్మయానికి గురి

శ్రీవారి వాకిలికి బంగారు పూత వేయిస్తానన్న శేఖర్ రెడ్డి... అందుకే పట్టుబడ్డారా? వజ్రకిరీటం కానుకిచ్చి గాలి జైలుపాలు
, శనివారం, 17 డిశెంబరు 2016 (14:40 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడైన శేఖర్‌ రెడ్డి ఇటీవల జాతీయ స్థాయి వార్తలకు కేంద్రంగా మారారు. ఆయన ఇంట్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ.కోట్లకు కోట్ల డబ్బులు, వందల కేజీల బంగారు బయటపడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. కొత్త నోట్లే వంద కోట్ల దాకా ఉండటం, 200 కిలోల బంగారం దొరకడంతో ఔరా అని ముక్కు మీద వేలేసుకున్నారు ఇది చూసినవారు. శేఖర్‌ రెడ్డి వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పట్టుబడిన సమయంలో ఆయన తితిదే పాలకమండలి సభ్యుడు కావడంతో వార్తకు మరింత ప్రాధాన్యత లభించింది. ఆయన ఏ విధంగా కుగ్రామం నుంచి కుబేరుడుగా ఎదిగారో పత్రికలు, టీవీలు హోరెత్తించాయి.
 
శేఖర్ రెడ్డి బంగారం ఎక్కడదాకా వచ్చిందంటే, శ్రీవారి ఆలయం దాకా వచ్చి ఆగింది. శ్రీవారి ఆలయంలో బంగారు తలుపులు (జయవిజయుల వెనుక) అంద విహీనంగా తయారయ్యాయనీ, వాటికి కొత్తగా బంగారుపూత వేయిస్తానని సిద్ధమయ్యారు. దాదాపు 86.70 లక్షలు ఖర్చవుతుందని తితిదే జ్యువలరీ అధికారులు అంచనాలు సిద్ధం చేస్తే ఆ ఖర్చు తాను భరించడానికి శేఖర్ రెడ్డి ముందుకు వచ్చారు. ఆయన బంగారమే ఇచ్చేవారో లేదా డబ్బులు సమకూర్చేవారో తెలియదుగానీ ఆ పని శేఖర్‌ రెడ్డి ఇచ్చే విరాళంతో చేయించాలని ఈ యేడాది మార్చిలో జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు.
 
ఆ పనులు ఇంకా మొదలు కాలేదు. ఇంతలో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు. వేంకటేశ్వరుని ఆగ్రహమేమో తెలియదు కానీ ఆఖరికి బోర్డు సభ్యుడి పదవి కూడా ఊడిపోయింది. ఇక శేఖర్ రెడ్డితో శ్రీవారి ఆలయ తలుపులకు బంగారు తాపడం చేయిస్తారా లేదా అనేది వేరే విషయం గానీ.. ఈ ఉదంతం చూశాక అక్రమంగా సంపాదించిన సొమ్ముతో స్వామికి కానుకలు ఇచ్చినా స్వామి మన్నించడని శ్రీవారి భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
ఆ మాటకొస్తే శేఖర్ రెడ్డి ఒక్కరే కాదు.. గతంలోనూ ఇలాంటి అంశాల చర్చకు వచ్చాయి. గాలి జనార్థన్‌ రెడ్డి కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని స్వామికి సమర్పించారు. ఆ తర్వాత ఆయన జైలుపాలయ్యారు. జనార్థన్‌ రెడ్డి సమర్పించిన కిరీటాన్ని తితిదే స్వీకరించడంపైన కొందరు విమర్శలు చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్వామికి కానుకలు సమర్పిస్తే స్వీకరిస్తారా? అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. తితిదేకి సంబంధించినంత వరకు విరాళాలు ఎవరు ఇచ్చినా స్వీకరిస్తుంది. వాళ్ళు ఎలా సంపాదించారు అనే దానితో దేవస్థానానికి సంబంధం లేదు. అది గోవిందుడు చూసుకుంటాడని అంటారు. చాలామంది హుండీల్లో కానుకలు వేస్తుంటారు. ఒక్కోసారి లక్షల రూపాయలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చి వేసేవారూ ఉంటారు. తితిదే నిర్వహించే అనేక ట్రస్టులకు కోట్లకొద్దీ విరాళాలు వస్తున్నాయి. వీటిని జనం శ్రీవారిపై భక్తితో ఇచ్చేవిగానే పరిగణించాలి.
 
ఇటీవలే సినీనటుడు బాలకృష్ణ సతీమణి రూ.10 లక్షల పాతనోట్లు శ్రీవారికి సమర్పించడానికి తీసుకొస్తుండగా విమానాశ్రయంలో పట్టుబడ్డారు. స్వామివారి హుండీలో వేయడానికి తీసుకెళుతున్నట్లు చెప్పి ఆ డబ్బులకు సంబంధించిన వివరాలు చెప్పడంతో వదిలేశారు. అందుకే శేఖర్ రెడ్డి శ్రీవారి ఆలయ తలుపులకు బంగారు పూత వేయించడాన్ని తప్పుబట్టలేం.
 
అయితే శేఖర్‌ రెడ్డి ఉదంతం నేపధ్యంలో చర్చించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఒక పాలకమండలి సభ్యుడు తెలంగాణాలో నోటుకు ఓటు కేసులో నిందితుడిగా ఉన్నారు. అలాగే మరో సభ్యుడిపై హవాలా డబ్బులు మార్చుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వారు తితిదే పాలకమండలిలో ఎలా సభ్యత్వం సంపాదిస్తున్నారో అందరికీ తెలిసిందే. రాజకీయ అవసరాలు, డబ్బులే పాలకమండలి నియామకంలో కీలకంగా మారుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. శేఖర్ రెడ్డి కూడా అధికార పార్టీలోని పెద్దలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నారన్న విమర్శలూ లేకపోలేదు. 
 
శ్రీవారికి సేవ చేస్తామంటూ పాలక మండలిలోకి వచ్చి ఆ పదవిని తమ పలుకుబడి పెంచుకోవడానికి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. శ్రీవారి దర్శనాలను, ప్రసాదాలను పెట్టుబడిగా పెట్టి సొంత పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు తితిదే అభివృద్థి కోసం ఆలోచించేదాని కంటే సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బోర్డు సమావేశం రోజు తప్ప తితిదే గురించి ఆలోచించే తీరిక వీరికి ఉండదు. ఆ రోజు కూడా 10 మందిని వెంటేసుకుని వచ్చామా వారికి విఐపి దర్శనాలు చేయించామా. వెళ్ళామా అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంటుంది. ఇలాంటి వారి వల్ల తితిదేకి ఏం లాభమో తితిదేలో సభ్యులుగా కూర్చోబెట్టేవారికే తెలియాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యప్పదీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు… దీక్షా నియమాలు ఎందుకంటే....?