Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీనివాసుడికి భక్తులు వేసిన కానుకల్లో ప్రభుత్వానికి వాటా ఇవ్వాలా...?

దేవదాయ చట్టం 1987 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు వెయ్యి కోట్లు రావాలని సౌందరరాజన్‌ అనే అర్చకుడు కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సౌందర రాజన్‌ పిటిషన్‌పై చాలామంది తీవ్రస్థ

webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:01 IST)
దేవదాయ చట్టం 1987 ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు వెయ్యి కోట్లు రావాలని సౌందరరాజన్‌ అనే అర్చకుడు కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సౌందర రాజన్‌ పిటిషన్‌పై చాలామంది తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడిని కూడా విభజన వివాదంలోకి లాగారా లేదా అనేది పక్కనబెడితే నిజంగానే టిటిడి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు బాకీ ఉందా అనేది చర్చించాల్సిన అంశం. కోర్టు నోటీసులు జారీ చేస్తే తితిదే ఎలాంటి వివరణ ఇస్తుందనేది పక్కనబెడితే నిజంగానే ధర్మప్రచారానికి, ఆలయాల పునరుద్ధరుణకు తితిదే ఏమీ చేయడం లేదా అనేది పరిశీలించాల్సిన మరో అంశం.
 
తితిదే లెక్కలను పరిశీలిస్తే వేంకటేశ్వరస్వామి అటు తెలంగాణ ప్రభుత్వానికి గానీ ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి గానీ పైసా కూడా బాకీ లేదని అర్థమవుతోంది. 2004 నుంచి ఇప్పటి 2014-15 దాకా 48 కోట్లకు పైగా కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సిజిఎఫ్‌) కింద తితిదే ప్రభుత్వాలకు చెల్లించింది. అదేవిధంగా ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌ 5.50 కోట్లు చెల్లించింది. చట్ట ప్రకారం సిజిఎఫ్‌ కింద 26.50 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా అంతకుమించి చెల్లించినట్లు తితిదే నివేదికలు చెబుతున్నాయి.
 
ఆలయాల పునరుద్థరణ మరమ్మత్తులకు అవసరమైన నిధులు కేటాయించడం కోసం ఆదాయమున్న దేవాలయాల నుంచి యేటా కొంత మొత్తం వసూలు చేయాలనుకున్నారు. దీన్నే కామన్‌ గుడ్‌ ఫండ్‌ అంటున్నారు. అదేవిధంగా అర్చకులు, ఆలయ ఉద్యోగుల కోసం ఒక నిధి ఏర్పాటు చేయాలని భావించారు. ఇదే ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫండ్‌ 50 వేల వార్షిక ఆదాయమున్న ఆలయాలు 2008 దాకా 3శాతం సిజిఎఫ్‌ చెల్లించేవి. 27.09.2008లో వచ్చిన జిఓ 921మేరకు ఇది 5 శాతానికి పెరిగింది. ఇఏఎఫ్‌ అంతకు మునుపు 15 శాతంగా ఉండగా 13 శాతానికి తగ్గించారు. కామన్‌ గుడ్‌ ఫండ్‌ నుంచే ధూప దీప నైవేద్యం పథకానికి నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగానే తెలంగాణకు వెయ్యి కోట్ల రావాల్సి ఉందని వాదిస్తున్నారు.
 
ఒక ఆలయానికి వచ్చే ఆదాయాన్ని ఎలా లెక్కించాలి అనే దానిపైనే ఓ నియమం ఉంది. ఎండోమెంట్‌ చట్టం 1987లోని 70 సెక్షన్‌ ప్రకారం ఒక ఆలయానికి వచ్చే ఆదాయాన్ని లెక్కించాలి. హుండీ కానుకలు, విరాళాలు వంటివి కాకుండా ప్రసాదాల విక్రయం, టికెట్ల అమ్మకాలు, గదుల కేటాయింపు తదితర వాటి ద్వారా వచ్చే ఆదాయం నుంచి ఐదు శాతం కామన్‌ గుడ్‌ ఫండ్‌‌గా చెల్లించాలి. అదేవిధంగా ఇఏఎఫ్‌ చెల్లించడానికి అదే చట్టంలోని సెక్షన్‌ 65 ప్రకారం ఆదాయాన్ని లెక్కించాలి. ఆ ఆదాయానికే ఇసిఎఫ్‌ చెల్లించాలి. ఈ చట్టం ప్రకారం లెక్కలు వేసిన దేవ్థానం సిజిఎఫ్‌ కింద యేడాదికి కోటి 25 లక్షల రూపాయలు, ఇఎఎఫ్‌ కింద 50 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని చెబుతోంది. అయినా ఒక్కో సంధర్భంలో ప్రభుత్వాల ఒత్తిడి వల్ల అంతకుమించి కూడా చెల్లించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు శ్రీవారి హుండీలో వాటా అడుగుతున్నవారు హుండీ ఆదాయాన్ని కానుకలను అన్నింటికీ అడుగుతున్నారు. ఇది చట్ట విరుద్థమని తితిదే అధికారులు చెబుతున్నారు.
 
ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం సిజిఎఫ్‌, ఇఏఎఫ్‌ ప్రవేశపెట్టిందో అవే లక్ష్యాల కోసం తితిదే భారీగా నిధులు వెచ్చిస్తోంది. అనేక ఆలయాలను తితిదే తన పరిధిలోకి తీసుకుని అభివృద్థి చేస్తోంది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని దళిత, గిరిజన, మత్య్స కారులు నివాసముంటున్న ప్రాంతాల్లో 500 ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం 25కోట్లు ఖర్చు చేయనుంది. 
 
అదేవిధంగా ఇటీవల కాలంలో ఆలయాలు, కోనేర్లు, రథాల మరమ్మత్తులకు విరివిగా నిధులు ఇస్తోంది. తెలంగాణాలోని పలు ఆలయాలకు ఇటీవల నిధులు ఇచ్చింది. ఎవరు అడిగినా కాదనకుండా విరివిగా నిధులు కేటాయిస్తోంది. పలు ఆలయాలను తితిదే ఆధీనంలోకి తీసుకుని నిర్వహిస్తోంది. ఇటీవల కాలంలో ఒంటిమిట్ట రామాలయాన్ని తీసుకుని దాని అభివృద్థికి వందకోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. చంద్రగిరి, ఉపమాక , నాయుడుపేట, తుళ్లూరు ప్రాంతాల్లోని ఆలయాలను తన పరిధిలోకి తీసుకుంది. ప్రతియేటా మన గుడి పేరుతో వేలాది ఆలయాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. ఆలయాలు నిర్మించకుంటే పంచలోహ ప్రతిమలు, గొడుగులు మైక్‌సెట్లు పంపిణీ చేస్తోంది. 
 
తిరుమలతో పాటు భీమవరం, ప్రకాశం జిల్లా కోడెల శివప్రసాద్‌ నియోజకవర్గంలోని ఒక వేద పాఠశాలను తితిదే తన ఆధీనంలోకి తీసుకుని నిర్వహిస్తోంది. ధర్మప్రచార కార్యక్రమాలకు యేటా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఆ మధ్య దేవదాయ శాఖ ఆధ్వర్యంలోని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు మంజూరు చేసింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఆలయానికి అవసరమమైన భూమి కొనుగోలు కోసం 5 కోట్లు కేటాయించింది.  
 
ఐతే అందరి కళ్ళూ శ్రీనివాసునికి వస్తున్న ఆదాయం మీదే ఉంది తప్ప తితిదే చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, చేస్తున్న ఖర్చులు పట్టడం లేదు. తితిదే నిర్వహిస్తున్న బర్డ్, స్విమ్స్, శ్రవణం, సెంట్రల్‌ ఆసుపత్రి వాటికి 165 కోట్లు ఖర్చు చేస్తోంది. తితిదే ఆధ్వర్యంలోని విద్యాసంస్థలకు 87 కోట్లు వ్యయం చేస్తోంది. ఎస్వీ, పద్మావతి యూనివర్సిటీలకు 5.75 కోట్లు గ్రాంటుగా ఇస్తోంది. ఇక రెగ్యులర్‌ ఉద్యోగుల జీత భత్యాలకు 500కోట్లు, పెన్షన్‌కు 120 కోట్లు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలకు 200 కోట్లు, సరుకుల కొనుగోలుకు 290కోట్లు, ఇంజనీరింగ్‌ పనులకు 160 కోట్లు, యాత్రికులు బసచేసే కాటేజీల నిర్వహణకు 108 కోట్లు ఖర్చు చేస్తోంది.
 
తిరుమలలో యేడాది పొడవునా రోజూ సగటున 80వేల మందికి భోజనం పెడుతోంది. తాజాగా చెరువులను అభివృద్థి చేసి భూగర్భ జలాలను పెంచడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవేవీ ధర్మపరిరక్షణ కార్యక్రమాలు కాదన్నట్లు ఉంది కొందరు స్వామీజీలు, అర్చకుల వ్యవహారం. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కలలో కుక్క కరిచినట్లు వస్తే... పక్షి ఎగిరినట్లు కనిపిస్తే... ఇంకా...?