ద్రౌపది క్రితం జన్మలో మేధావి అనే బ్రాహ్మణుడి కుమార్తె. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడం చేత తండ్రి ఆమెను పెంచాడు. కానీ ఆమె తండ్రి యుక్త వయస్కురాలైన ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించేవాడు కాదు. కొద్ది కాలం తరువాత ఆమె తండ్రి కూడా మరణించాడు. తండ్రి మరణం ఆమెకు మరింత దుఃఖం కలిగించింది.
అప్పుడు దుర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆయనకు ప్రణామాలర్పించి, పూజించి, పూలు, పండ్లు సమర్పించింది. మహర్షి ఆమె యొక్క అతిధి మర్యాదలకు సంతోషించాడు. అప్పుడు ఆమె మహర్షి.... మీకు సర్వమూ తెలుసుకదా... నాకు ప్రపంచంలో ఎవరూ లేరు. నేను అవివాహితను కాబట్టి రక్షించడానికి భర్త లేడు.
కాబట్టి నా సమస్యలకు పరిష్కారమేమిటో తెల్పండి అని ప్రార్దించింది. అది విన్న మహర్షి పురుషోత్తమ మాసం శ్రీకృష్ణునికి ప్రీతికరమైనది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేస్తే పాపం పోతుంది. కాబట్టి ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించు అన్నాడు.
అది విని ఆ యువతి ఓ.. మహర్షి మీరు అబద్దమాడుతున్నారు. ఏ విధంగానూ ఈ అధికమాసం పుణ్యకార్యాలకు పనికి రాదు అన్నది. ఆ విధంగా అన్న బ్రాహ్మణ యువతిపై ఆ దుర్వాస మహర్షికి కోపమొచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఎప్పుడైతే ఆ మహర్షి ఆ స్థలాన్ని వదిలి వెళ్లిపోయాడో ఆ బ్రాహ్మణ యువతి వైభవం అంతా ఆ క్షణంలోనే కోల్పోయింది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందు వల్ల ఆమె శరీరం కురూప్గా తయారయ్యింది. అప్పుడు ఆమె భక్తితో పరమశివుణ్ణి ప్రార్దించింది.
అప్పుడు శంకరుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువతి... ఓ పరమేశ్వరా.... నాకు భర్తను ప్రసాదించు అని ఐదు సార్లు అడిగింది. అప్పుడు పరమ శివుడు అలాగే కానీ..... నీవు భర్త కావాలని ఐదు మార్లు అడిగావు. కావున నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు..... అన్నాడు.
ఆ తరువాత కాలంలో ద్రుపదమహారాజు గొప్ప యజ్ఞం చేస్తుండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞ కుండంలో ద్రుపదుడి కుమార్తెగా ఆవిర్బవించి ద్రౌపదిగా ప్రసిద్ది చెంది పంచ పాండవులను వివాహమాడి పాంచాలి అయ్యింది.