Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసలు తిరుమల రంగనాయకమండపం అంటే ఏమిటి...?

తిరుమల. ప్రపంచ నలుమూలల నుంచి సామన్య భక్తులు ఎంతమంది వస్తారో అదే స్థాయిలో ప్రముఖులు కూడా వస్తుంటారు. ప్రతిరోజు వివిఐపిలు, విఐపిలు తిరుమలకు వస్తూ, పోతూ ఉంటారు.

అసలు తిరుమల రంగనాయకమండపం అంటే ఏమిటి...?
, మంగళవారం, 26 జులై 2016 (12:11 IST)
తిరుమల. ప్రపంచ నలుమూలల నుంచి సామన్య భక్తులు ఎంతమంది వస్తారో అదే స్థాయిలో ప్రముఖులు కూడా వస్తుంటారు. ప్రతిరోజు వివిఐపిలు, విఐపిలు తిరుమలకు వస్తూ, పోతూ ఉంటారు. వివిఐపిలలో కొంతమందికి తిరుమల తిరుపతి దేవస్థానం మర్యాదలు చేసి పంపుతోంది. అంటే శ్రీవారి దర్శనాల్లో కాదు.. శ్రీవారి ప్రసాదాలను అందించడంలో..ప్రసాదాలను అందించడమంటే ఎక్కడో ఆలయంలో ఒక మూలన నిలబెట్టి చేతికి అందించడం కాదు. ఆలయంలోని ఒక మండపం కింద కూర్చోబెట్టి మర్యాద పూర్వకంగా ఇవ్వడం. సాదా సీదా మర్యాదు కాదండోయ్‌.. అక్షింతలు చల్లి వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేస్తుంటారు. అదే రంగనాయకమండపం. తిరుమలకు రాష్ట్రపతితో పాటు ప్రధాని, సిఎం, ఇతర రాష్ట్రాల సిఎంలు మిగిలిన ప్రముఖులు ఎవరు వచ్చినా రంగనాయకమండపంలో ఆశీర్వచనాలు, ప్రసాదాలు అని ప్రతి ఒక్కరు చూస్తుంటారు.. చదువుతుంటారు. అయితే రంగనాయక మండపం గురించి మాత్రం తెలియదు. అసలు.. రంగనాయకమండపం అంటే ఏమిటో తెలుసుకుందాం..
 
శ్రీవారి ఆలయంలో అద్దాల మండపానికి ఎదురుగా కృష్ణరాయ మండపానికి దక్షిణపు వరకు ఎతైన శిలావేదికపై నిర్మింపబడిందే రంగనాయకమండపం. దీన్నే రంగమండపం అని కూడా అంటారు. 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్థంభాలతో ఆ చివరకు అంటే దక్షిణం వరకు 12 అడుగుల చతురస్రాకార మందిరం ఉంది. ఈ చిన్న మందిరంలో శ్రీ రంగనాథుడు కొంతకాలం కొలువై ఉండి పూజలు నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1320-1360 సంవత్సరాల మధ్య మహమ్మదీయ దండయాత్ర వల్ల శ్రీ రంగక్షేత్రంలోని శ్రీ రంగనాయకుల ఉత్సవమూర్తులను తిరుమలకు చేర్చి ఈ మండపంలో నెలకొల్పి రక్షిస్తూ నిత్యపూజా నివేదనలు చేశారట. 
 
ఆ తర్వాత తురకల హళాహళి తగ్గిన తర్వాత యథాప్రకారంగా ఆ విగ్రహాలను మరల శ్రీ రంగానికి తీసుకుని వెళ్ళారట. ఈ హేతువు చేతనే ఈ మండపం రంగమండపం అని రంగనాయకుల మండపం అని పిలువబడుతున్నది. మాలికాఫర్‌ దండయాత్రల బారి నుంచి కాపాడుతూ శ్రీ రంగనాథుని ఉత్సవ విగ్రహాలను తిరుమలకు చేర్చి పూజలు చెయ్యటం కోసమే ఈ మండపాన్ని రంగనాథయాదవరాయలు అనే తిరుపతి ప్రాంత పాలకుడు కట్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
శ్రీ రంగనాథుడు తిరుమలలో ఈ మండపంలో వేం చేసి ఉన్న సందర్భంలోనే, శ్రీ రంగనాథుని పూజా విశేషాలు, ధనుర్మాసంలో తిరుప్పావై పఠనం, ఉత్సవాల్లో, సేవల్లో ద్రావిడ దివ్య ప్రబంధ పారాయణం వంటివి తిరుమల స్వామివారి సన్నిధిలో సైతం ప్రవేశపెట్టబడినాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాహనమండపంగా ఉపయోగింపబడుతూ ఉన్న ఈ రంగమండపంలో ఆర్జిత వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వాహనసేవలు నిర్వహింపబడుతూనే ఉన్నాయి. ఈ రంగనాయకుల మండపం నడుమ కొలువై ఉన్న ఏడు తలల బంగారు శేషవాహనం ఉంటుంది. చూపరులకు గగుర్పాటు కలిగించే ఈ వాహనాన్నే పెద్దశేష వాహనం అంటారు.
 
ఈ రంగనాయకమండపానికి మరో ప్రత్యేకత ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తి (మలయప్పస్వామి) ఉభయదేవేరులతో కలిసి ఆనందనిలయం నుంచి ఏ తెంచి సంవత్సరంలో రెండు పర్యాయాలు, అలాగే చాలా కాలంపాటు ఈ మండపంలో కొలువుదీరి పూజా నైవేధ్యాలు స్వీకరిస్తారించారట. వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజులు ముందుగా ఆరంభమై సుమారు 25 రోజుల పాటు సాగే అధ్యయనోత్సవాల్లో కూడా శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉన్న శ్రీ మలయప్పస్వామివారు ఈ రంగమండపంలో వేంచేసి అర్చనలు, నైవేధ్యాలు స్వీకరిస్తారట.
 
ఒకప్పుడు ఈ రంగనాయక మండపంలోనే శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాలు జరిగేవని పురాణాలు చెబుతున్నాయి. రాను రాను భక్త జనుల పెరిగిపోవడం వల్ల కళ్యాణోత్సవాలు, సంపంగి ప్రదక్షిణంలో దక్షిణంవైపున ఏర్పాటు చేసిన మండపంలో జరుగుతున్నాయి. శ్రీ స్వామివారి దర్శనానంతరం, దేశాధిపతులు, రాష్ట్రాధిపతులు మొదలైన వారు ఈ రంగనాయకమండపంలోనే వేదపండితుల వేద ఆశీస్సులతో పాటు దేవాలయ అధికారులు శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేస్తారు. తరతరాలుగా ఎంతో పవిత్రతను వైభవాన్ని సంతరించుకుంది. రంగనాయకమండపం... ఏడుకొండల వాడా.. వెంకరమణా.. గోవిందా.. గోవిందా...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంట ఉంచుకుంటే..? ''శ్రీరామజయం'' 108 సార్లు రాసి?