Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదివారం గురుపూర్ణిమ... శ్రీ గురు స్త్రోత్రం పఠిస్తే...

ఆదివారం గురుపూర్ణిమ... శ్రీ గురు స్త్రోత్రం పఠిస్తే...
, శనివారం, 4 జులై 2020 (20:25 IST)
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం 
తత్పదం దర్శితంయేన తస్మైశ్రీ గురవేనమః - భావం: సమస్త విశ్వమంతటా చర-అచర వస్తువులన్నింటి యందు వ్యాపించిన పరమాత్మ తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురువునకు నమస్కారములు.
 
అఙ్ఞాన తిమిరాంధస్య ఙ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలతం యేన తస్మైశ్రీ గురవేనమః - భావం: అఙ్ఞానాంధకారంతో నిండిన నాకు ఙ్ఞానమనే కాటుక పెట్టి అంతఃనేత్రం తెరిచిన సద్గురువునకు నమస్కారములు.
 
గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 
గురురేవ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః- భావం: పరమాత్మ తత్త్వరూపాన్ని అంతఃదర్శనం చేయించిన సద్గురువే బ్రహ్మ, గురువే విష్ణువు మరియు పరమేశ్వరుడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమయిన సద్గురువునకు నమస్కారములు.
 
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరం
తత్పదం దర్శితంయేన తస్మైశ్రీ గురవేనమః- భావం: స్థిరమైన, అస్థిరమైన అనగా నిరంతరం చలించే జీవులతో సహా చరాచర జగత్తు అంతటా వ్యాపించిన పరమాత్మ తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురుదేవునికి నమస్కరించుతున్నాను.
 
 
చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యంస చరాచరం 
తత్పదం దర్శితంయేన తస్మైశ్రీ గురవేనమః- భావం: పరమానందరూపుడై ముల్లోకాలలోని సకల చరాచర ప్రాణులలో వ్యాపించిన పరమేశ్వరుని తత్త్వరూపాన్ని దర్శింపచేసిన సద్గురువునకు నమస్కారములు.
 
సర్వశృతి శిరోరత్న విరాజిత పదాంబుజ
వేదాంతాంబుజ సూర్యాయ తస్మైశ్రీ గురవేనమః-భావం: సకల వేద విదులు విరాజిల్లే పాదపద్మములు కల వేదాంత కమలంలో(వేదాంత కమలంలో ఆశీనుడవడం అనగా వేదాంతం ప్రతిపాదించిన బ్రహ్మ తత్త్వాన్ని ఔపోసన పట్టిన బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడని అర్ధం) ప్రకాశిస్తున్న సద్గురువునకు నమస్కారములు.
 
చైతన్యం శాశ్వతం శాంతో వ్యోమాతీత నిరంజనః
బిందునాద కలాతీత తస్మైశ్రీ గురవేనమః-భావం: నిరంతర చైతన్యుడు, శాంతస్వరూపుడు, అంతరిక్షం కంటే అతీతుడు(అనగా- హద్దులు లేనివాడు), నిర్మలుడు, సకల నాదాలకు (హత-అనాహతనాదాలకు) అతీతుడయిన సద్గురువునకు నమస్కారములు.
 
ఙ్ఞాన శక్తి సమారూఢా తత్త్వమాలా విభూషిత
భుక్తి ముక్తి ప్రదాతాచా తస్మైశ్రీ గురవేనమః- భావం: పరమాత్మ తత్త్వరూపాన్నే ఆభరణంగా ధరించి, ఙ్ఞానపీఠాన్ని అధిరోహించి జిఙ్ఞాసువుకు భక్తి-ముక్తి ప్రసాదించు సద్గురుదేవునికి వందనాలు.
webdunia
అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే 
ఆత్మఙ్ఞాన ప్రదానేన తస్మైశ్రీ గురవేనమః-భావం: అనేక జన్మల నుండి ప్రోగు చేసుకొనిన కర్మ బంధనాలన్నింటినీ నాశనం చేయు ఆయుధమైన ఆత్మఙ్ఞానం ప్రసాదించిన సద్గురుదేవునికి నమస్కరించుతున్నాను.
 
శోషణం భవసింధోశ్చ ఙ్ఞాపనం సార సంపదః 
గురోః పాదోదకం సమ్యక్ తస్మైశ్రీ గురవేనమః
- భావం: దరిదాపు లేని భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్న నాకు తన చరణామృతాన్ని ప్రసాదించి తత్త్వసారాన్ని తెలియచెప్పి భవసాగరం నుండి రక్షించిన సద్గురుదేవునికి ప్రణామాలు.
 
నగురోరధికం తత్వం నగురోరధికం తపః 
తత్త్వఙ్ఞానాత్ పరం నాస్తి తస్మైశ్రీ గురవేనమః- భావం: తత్త్వఙ్ఞానం లేకుండా పరమాత్మ ప్రాప్తి అసంభవం. ఆ తత్త్వఙ్ఞానం, తద్వారా చేయు తపస్సు కన్నా వాటిని ప్రసాదించు సద్గురువువే అధికమయినవాడు(శ్రేష్ఠుడు). తత్త్వఙ్ఞానం ప్రసాదించిన సద్గురువునకు నమస్కరించుతున్నాను.
 
మన్నాధ శ్రీజగన్నాధ మద్గురు శ్రీ జగద్గురుః
మదాత్మా సర్వ భూతాత్మ తస్మైశ్రీ గురవేనమః- భావం: నాలోని ఆత్మవై, సకల జీవుల ఆత్మయై, నాకు నాధుడవై, సకల జగత్తుకూ నాథుడవై జగద్గురువుగా విలసిల్లుతున్న సద్గురుదేవునికి నమస్కారములు.
 
గురోరాదిరనాదిశ్చ గురుః పరమదైవతం
గురోః పరతరం నాస్తి తస్మైశ్రీ గురవేనమః-భావం: ఆది-అంతమూ గురువే. గురువే పరమ దైవం. సద్గురువు కృపా-కటాక్షమూ లేకుండా పరమపద ప్రాప్తి అసంభవం. మోక్ష మార్గం సులభతరం చేసిన సద్గురువునకు నమస్కారములు.
 
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం ఙ్ఞాన మూర్తిం ద్వందాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామిం
- భావం: నిత్యం శోకరహితుడై  బ్రహ్మానందంలో లీనమై అఙ్ఞాన అంధకారానికి తావులేక ఙ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్న, ఆకాశసమానంగా(ఎల్లలు లేకుండా సకల ప్రదేశాలలో భాసిస్తూ) తత్త్వమసి ఆదిగా గల ఉపనిషద్వాక్యాలు లక్ష్యంగా గల (అనగా- సద్గురువు శిష్యులకి లౌకిక లక్ష్యాలు కాక కేవలం అలౌకిక లక్ష్యాలనే నిర్దేశిస్తారు) ఏకమై, నిత్యమై, విమలరూపుడై, సకల క్రియ, కర్మలకు సాక్షీభూతమైన, భావాలకి అతీతుడయిన, సత్వ, రజో, తమో గుణాలకి అతీతుడయిన సద్గురుదేవునికి వందనాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో కరోనా : 17 మంది తితిదే సిబ్బందికి పాజిటివ్ : వైవీ సుబ్బారెడ్డి