Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి... ఈ శ్లోకం చదవండి...

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాము. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్

జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి... ఈ శ్లోకం చదవండి...
, మంగళవారం, 19 జులై 2016 (15:29 IST)
వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాము. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువు. 'గు' అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, 'రు' అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్థము. 'గు' శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం. గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.
 
వేదవ్యాసుని కథ :
వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ ద్వైపాయనుడే వ్యాసుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్ట్రుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలు పొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే! భాగవాతాన్ని రచించాడు.
 
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి దైలుడనే శిష్యునికి ఋగ్వేదాన్ని, వైశాంపాయనునికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునికి అధర్వణ వేదాన్ని తెలియజేసి వ్యాప్తి చేయించాడు. తాను వ్రాసిన పురాణేతిహాసాలు సుతునికి చెప్పి ప్రచారం చేయించాడు. పరమేశ్వరుని దయతో వ్యాసునికి పుత్రుడు జన్మించాడు. ఒక రోజు వ్యాసుడు తన ఆశ్రమంలో అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనబడింది. ఆమె అందానికి చలించిన వ్యాసుని వీర్యస్కలనం కాగా అందుండే శుకుడు జన్మించాడు.
 
ఆ బాలునికి వ్యాసుడు దివ్యబోధలు చేసాడు. సృష్టి క్రమం, యుగధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేసి జ్ఞానిగా మార్చాడు. ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వవృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమైనాయి. ఎవరు వాటిని అర్థం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్థాలతో బోధించాలన్నా వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.
 
పూజావిధానం (వ్యాస పూజ/గురు పూజా విధానం)
కొత్త అంగవస్త్రం మీద(భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మకాయలు ఉంచుతారు. శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుతారట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభకోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.
 
ఎంతోమంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆదిశంకరుని తమ గురువుగా ఎంచుకుంటారు. ఐతే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట. వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణు లోకం పొందుతారుట. వ్యాసుడు సకలకళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్యవిద్యానిధి. ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.
 
వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి
శ్లో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః
అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!
 
ఆషాఢ పూర్ణిమ ప్రత్యేకతలు...
ఈ రోజు గురు పూర్ణిమతో పాటుగా కోకిలా వ్రతం, మహాషాఢి అని, వ్యాస పూజ, శివశయనోత్సవం, జితేంద్రరాయ జాతర. ఆ, కా, మా, వై పూర్ణిమలో మొదటిదైన ఆషాఢ పూర్ణిమ స్నానం ఎన్నో వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మారదా... వేతనాల పెంపు ఎండమావేనా?