Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాళహస్తిలో విదేశీ కరెన్సీకి కాకి లెక్కలు... స్వాహారాయుళ్లు ఎవరో?

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో పని చేస్తున్న కొందరి అధికారుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఎంతకీ వీడనంటోంది. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన లెక్కలేనితనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

శ్రీకాళహస్తిలో విదేశీ కరెన్సీకి కాకి లెక్కలు... స్వాహారాయుళ్లు ఎవరో?
, బుధవారం, 3 ఆగస్టు 2016 (13:57 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో పని చేస్తున్న కొందరి అధికారుల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఎంతకీ వీడనంటోంది. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన లెక్కలేనితనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక వైపు ఆలయ ఈఓ భ్రమరాంబ దేవస్థాన పరిపాలనా గాడిలో పెట్టేందుకు మహంకాళిగా ప్రయత్నిస్తున్నా, శివయ్య త్రిశూలం తీసుకుని పొడుస్తుననా కొందరు ఉద్యోగులకు చీమకుట్టినట్లయినా లేదని విమర్శలు లేదు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం శ్రీకాళహస్తీశ్వరునికి హుండీ ద్వారా లభిస్తున్న విదేశీ కరెన్సీ నోట్లకు సంబంధించిన లెక్కల వ్యవహారం. విదేశీ కరెన్సీకి సంబంధించి కరెన్సీలు మినహా పక్కాలెక్కలు అకౌంట్స్ విభాగం చేతిలో ఉన్నట్లు కనిపించడం లేదు.
 
శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇలా వచ్చే విదేశీ భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 23.07.2016వ తేదీ జర్మనీ దేశస్థులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా దర్శనార్థం కోసం వచ్చిన భక్తులు హుండీల్లో తమ దేశ కరెన్సీని కానుకలుగా వేస్తున్నారు. రష్యా, అమెరికా, శ్రీలంక, చైనా, నేపాల్‌, మలేషియా ఇలా ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీ నోట్లు శివయ్య హుండీకి చేరుతున్నాయి. 
 
ఆలయంలో 15 రోజులకు ఒకసారి హుండీలను లెక్కించడం ఆనవాయితీగా మారింది. ఇందులో స్వదేశీ కరెన్సీ అధికంగా వస్తున్నప్పటికీ విదేశాలకు చెందిన కరెన్సీ కూడా ఎంతో కొంత వస్తోంది. హుండీ లెక్కించాక ఆ రోజే బ్యాంకులో జమ చేస్తుంటారు. విదేశీ కరెన్సీ కూడా బ్యాంకులకు అప్పగిస్తున్నారు. ఆ నోట్లను మన నగదులోకి మార్పు చేసి శివయ్య ఖాతాలో జమ చేస్తారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఆలయ అధికారుల వద్ద సక్రమంగా లేవు.
 
హుండీల్లో వచ్చే విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేసే ముందు ఏయే దేశాల కరెన్సీ నోట్లు ఎన్ని వచ్చాయి. ఆ రోజుకు వాటి విలువ ఎంత అనే వివరాలను తమ రికార్డులలో నమోదు చేసుకోవాలి. కానీ అలా కాకుండా ఇన్ని విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని మాత్రమే రికార్డుల్లో రాసుకుంటున్నట్లు సమాచారం. దీని వల్ల ఉపయోగమేమిటో అధికారులకే తెలియాలి. ఉదాహరణకు 27.07.16న అమెరికా డాలర్‌ విలువ మన రూపాయాల్లో రూ.67 ఉంటుంది. అదే మలేషియా రింగిట్‌ విలువ రూ.16, సింగపూర్‌ డాలర్‌ విలువ రూ.49, కువైట్‌ దీనార్‌ రూ.222గా ఉంది. నేపాల్‌ రూపాయి విలువ మన రూపాయాల్లో చూస్తే 62 పైసలు మాత్రమే. 
 
బ్యాంకులకు ఇచ్చేటప్పుడు సవివరంగా రాసుకోకుండా విదేశీ నోట్లు ఇన్ని అని సంఖ్య మాత్రమే రాసుకుంటే అక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. ఉదాహరణకు కువైట్‌ దీనార్‌ ఒకటి వచ్చిందనుకుంటే దాని స్థానంలో నేపాల్‌ రూపాయిని చూపించారనుకోండి...రూ.222కు బదులు 62పైసలు మాత్రమే స్వామివారికి జమ అవుతుంది. జరిగే నష్టం ఆ స్థాయిలో ఉంటుందన్న మాట. మీడియాకు పంపే వివరాల్లోనూ ఇలాగే పంపుతున్నారు. ఉదాహరణకు 16.07.16న జరిగిన హూండా లెక్కింపు సందర్భంగా విదేశీ నోట్లు 106 వచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి ముందు 29.06.16న జరిగిన హుండీ లెక్కింపులో 55 విదేశీ నోట్లు వచ్చినట్లు సమాచారం ఇచ్చారు. ఇదేవిధంగా ఆలయ రికార్డుల్లోను నమోదు చేసుకుంటున్నట్లు సమాచారం. 
 
దీని వల్ల ఉపయోగం ఏమిటో అధికారులకే తెలియాలి. ఆ లెక్కలు కూడా కంప్యూటర్‌లో నిక్షిత్తమై లేవు. ఇంకా పాతకాలంలోలాగా పుస్తకాల్లో రాస్తున్నారు. విదేశీ కరెన్సీ వివరాలు కావాలని ఈఓ అడిగినా సంబంధిత అధికారులు ఇచ్చే పరిస్థితులో లేరు. ఆలయ పరిపాలనా భవనంలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఏ చిన్న పనిచేయాలన్నా మామూళ్లు ఇవ్వందే సమాధానం చెప్పరనే విమర్శలు ఉన్నాయి. 
 
సాధారణంగా పత్రికలకు ఆలయం తరపున ప్రకటనలు ఇస్తుంటారు. వీటికి సంబంధించిన బిల్లులు చేయాలన్నా ఒక ఉద్యోగికి మామూళ్లు సమర్పించాల్సి రావడంపై మీడియా వారు గుర్రుమంటున్నారు. దీనికితోడు సదరు ఉద్యోగి వద్ద ఏ సమాచారమూ పూర్తి స్థాయిలో ఉండదు. సమాచారం ఇవ్వమని ఉన్నతాధికారులు ఆదేశించినా పట్టీపట్టనట్లు వ్యవహరించడం విమర్శలు తావిస్తోంది.
 
విదేశీ కరెన్సీ వివరాలు ఇవ్వమని మూడు వారాల క్రితం సంబంధింత ఉద్యోగికి చెప్పినా ఆయన, మిగిలిన అధికారులు ఇప్పటికీ సిద్ధం చేయలేదు. దీనికి కారణం అలాంటి వివరాలను క్రిందిస్థాయి అధికారులు సరైన పద్ధతిలో రికార్డులో నమోదు చేయకపోవడమే అని తర్వాత అవగతమైంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇలావుంటే అది ఒక్కోసారి తీవ్ర నష్టానికి దారితీయవచ్చు. ఆలయాన్ని గాడిలో పెడుతున్న ఈఓ భ్రమరాంబ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే విదేశీ కరెన్సీకి సంబంధించిన లెక్కలు పకడ్బంధీగా నిర్వహించేలా సిబ్బందిని ఆదేశించాల్సిన అవసరం ఎంతో ఉందని భక్తులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారు బ్రహ్మదేవుడు కాదు... శివుడూ కాడు.. కుమారస్వామి అసలే కాదు...!