Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాసమూర్తి... భక్తులకు దర్శనం ఎప్పుడు?

తిరుమల ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య విగ్రహ మూర్తులలో నిలువెత్తు సాలగ్రామమూర్తి అయిన మూలవిరాణ్మూర్తి మొదటిది. రెండవది మనవాళప్పెరుమాళ్‌ అని పిలువబడే భోగ శ్రీనివాసమూర్తి.

Advertiesment
bhoga srinivasa murthy
, సోమవారం, 8 ఆగస్టు 2016 (12:16 IST)
తిరుమల ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య విగ్రహ మూర్తులలో నిలువెత్తు సాలగ్రామమూర్తి అయిన మూలవిరాణ్మూర్తి మొదటివారు. రెండవవారు మనవాళప్పెరుమాళ్‌ అని పిలువబడే భోగ శ్రీనివాసమూర్తి. ఈ మూర్తికే వైఖానస ఆగమం ప్రకారం కౌతుకమూర్తి, పురుషబేరం అని కూడా పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో నిత్యమూ రాత్రి ఏకాంతసేవా భాగ్యాన్ని పొందుతూ వున్న ఈ భోగమూర్తే మనవాళప్పెరుమాళ్‌ అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. 
 
మనవాళన్‌ అంటే పెండ్లికొడుకు. ఎలాంటి పెండ్లి కుమారుడు అంటే నిత్య పెళ్ళికొడుకు. అందుకే ప్రతిరోజు రాత్రి చివరగా ఏకాంత సేవ సమయంలో పట్టుపానుపుపై శయనించే భోగభాగ్యాన్ని పొందుతూ నిత్యశోభమూర్తిగా వెలుగొందుతూ వున్న భవ్యమూర్తి. దివ్యమూర్తి ఈ భోగ శ్రీనివాసుడు. శంఖుచక్రధారియైన ఈ చతుర్భుజమూర్తి అన్ని విధాలా శ్రీవారి మూలవిరాణ్మూర్తి ప్రతిరూపంగా ప్రతిష్టించబడిన చిన్న వెండి ప్రతిమ. ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ భోగ శ్రీనివాసమూర్తిని జీవస్థానం అని పిలువబడే శ్రీ స్వామివారి మూలవిరాట్టు పాదాల చెంత పద్మపీఠానికి ఆనించి ఉంచుతారు.
 
క్రీ.శ.614 సంవత్సరంలో కడవన్‌ పెరుందేవి అనే నామాంతరం ఉన్న పల్లవ మహారాణి సామవై ఈ వెండి భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయానికి బహూరించింది. ఆ సమయంలో ఆనందనిలయం మరమ్మతులు జరుగుతుండగా నేడు స్నపన తిరుమండపం అని పిలువబడే తిరువిలాన్‌ కోయిల్‌ను నిర్మించి అందులో మూలమూర్తికి ప్రతిగా ఈ భోగ శ్రీనివాసుణ్ణి ప్రతిష్టించి స్నపన తిరుమంనాదులు పూజా నివేదనలు ఏర్పాటు చేసిందట. 
 
అలాగే తమిళుల పొరటాసి నెలలో ఈ మూర్తిని ఊరేగించేటట్లుగా కట్టడి చేసిందట ఈ పల్లవరాణి సామవై. అలాగే ఈ మనవాళప్పెరుమాళ్‌ భోగమూర్తికి అనేక ఆభరణాలను నగలను కూడా కానుకలు పెట్టి అలంకరింపజేసి తరించింది పల్లవరాణి పెరిందేవి. ఆనాటి నుంచి నేటి వరకు ఈ భోగ శ్రీనివాసమూర్తి పేరుతో ఈ వెండిమూర్తి శ్రీవారి ఆలయ సేవలో ప్రధానంగా పాలుపంచుకుంటూ ఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాతానంతరం, తోమాలసేవకు ముందుగా ఈ భోగశ్రీనివాసమూర్తికి ఆకాశగంగా తీర్థ జలలతో నిత్యాభిషేకం జరుగుతోంది. శ్రీనివాసుని మూలమూర్తికి బదులుగా నిత్యమూ అభిషేకాన్ని చేయించుకుంటున్న దివ్యమూర్తి ఈ భోగమూర్తి.
 
ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు బంగారు వాకిలికి ముందు ఉన్న మహామణిమండపంలో జరిగే సహస్త్ర కలశాభిషేకంలో ఈ భోగ శ్రీనివాసమూర్తిని స్నానపీఠంపై గరుడాళ్వారుకు ఎదురుగా వేంచేపు చేస్తారు. ఆ సమయంలో ఆనంద నిలయంలో ఉన్న మూలమూర్తితో బయట బంగారు వాకిలి ముందు స్నానపీఠంపై ఉన్న భోగమూర్తిని పట్టుదారంతో కానీ, బంగారు తీగతో కాని కట్టి అనుసంధానం చేస్తారు. ఇలా అనుసంధానించడంతో ఈ భోగమూర్తికి జరిగే సహస్ర కలశాభిషేకం సర్వవిధాలా మూలమూర్తికి జరిగినట్లేనని అంతరార్థం. ఈ సహస్ర కలశాభిషేకం సమయంలో భోగ శ్రీనివాసమూర్తికి కుడివైపున ఉత్తరాభిముఖంగా ఒక స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారినీ, అలాగే ఎడమ పక్కన మరొక స్నానపీఠంపై దక్షిణాభిముఖంగా సేనాధిపతి విష్వక్సేనులవారిని వేంచేపు చేసి భోగమూర్తితో కలిపి, సహస్ర కలశాభిషేకం చేస్తారు. అభిషేకానంతరం రెండవ నైవేధ్యంగా క్షీరాన్నం, అప్పాలు, పొంగళ్లు నివేదింపబడతాయి.
 
ప్రతిరోజు రాత్రి ఏకాంతసేవలో పవ్వళింపు సేవ మనవాళపెరుమాళ్‌‌ని పిలువబడే ఈ భోగ శ్రీనివాసమూర్తికే జరుగుతుంది. కానీ ప్రతి ధనుర్మాసంలో ఒక నెలరోజుల పాటు మాత్రం ఈ శయన సేవాభాగ్యం, ఆనంద నిలయంలోనే కొలువై ఉన్న మరోమూర్తి శ్రీ క్రిష్ణస్వామివారికి జరుగుతుంది. అలాగే ప్రతిరాత్రి ఏకాంతసేవా సమయంలో భోగశ్రీనివాసుడిని గర్భాలయం ముందు ఉన్న శయనమండపంలో వెండి గొలుసులతో వేలాడగట్టబడిన బంగారు నవారు పట్టె మంచం మీద వేసి పట్టుపరుపుపై భక్తులను వీక్షిస్తున్న భంగిమలో దక్షిణం తలాపుగా శయనింపజేస్తారు. మంచం చుట్టూ నేలమీద తరిగొండ వెంగమాంబ పేరు మీద ముగ్గుపిండితో రంగవల్లులు తీర్చిదిద్దబడతాయి. మంచం ముందు రెండడుగుల ఎత్తుగల వెండిదీపం సిమ్మెలను సన్నిధి గొల్ల వెలిగిస్తారు.
 
ప్రతి రాత్రి జరిగే ఈ ఏకాంతసేవా సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి చక్కెర కలిపిన గోరువెచ్చని ఆవుపాలు, పంచకజ్జాయం, చక్కెర, జీడిపప్పు, ఎండుకొబ్బరి ముక్కలు, ఎండుద్రాక్ష, ఏలకుల పొడి కలిపి తయారుచేయబడి పొడిగా ఉన్న ప్రసాదం అనేక రకాల పండ్లను తరిగి, కలిపి తయారుచేసిన మేవా అనబడే పంచామృతంలాంటి ప్రసాదం నివేదిస్తారట. ఈ సమయంలో మెత్తటి శ్రీ చందనం ముద్దలు రెండింటిలో ఒక ముద్ద శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలమూర్తి పాదాలపైన, సగం ముద్ద మంచంపై పవ్వళించి ఉన్న భోగశ్రీనివాసమూర్తి వక్షస్థలంపైన 1/4 వంతు మూలమూర్తి వక్షస్థలంపైన వున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, మిగిలిన 1/4 భాగం ముద్ద రాత్రి బ్రహ్మాది దేవతలు వచ్చి అర్పించుటకుగాను మూలమూర్తి సమక్షంలో పళ్ళెంలో ఉంచబడుతుంది.
 
శ్రీ భోగశ్రీనివాసమూర్తికి శయనమండపంలో పాన్పు సేవ జరుగుతూ ఉండగా రాములవారి మేడ నడవలో తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు స్వామికి ఎదురుగా కూర్చుని లాలిపాటను లేదా జోలపాటను తంబుర మీటుతూ గానం చేస్తారు. అన్నమయ్య లాలిపాట పూర్తి అయిన తర్వాత చివరగా పరమ భక్తురాలు తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అనబడే కర్పూర హారతిని అటు ఆనందనిలయంలోపల శ్రీవారి మూలమూర్తికి, ఆ తర్వాత మంచంపై పవ్వళించి ఉన్న భోగమూర్తికి ఇస్తారు. 
 
ఈ చివరి హారతి వెలుగుల్లో శ్రీనివాసుని దివ్యతేజస్సు మనోహరంగా, నయనానందకరంగా ఉండి మనస్సును ఏదో తెలియని ఆధ్మాత్మిక లోకాల్లో విహరించజేస్తుంది. ఈ ముత్యాల హారతితో ఆనాటి శ్రీస్వామివారి పూజా విధి ఆలయ కార్యక్రమం పూర్తి అవుతుంది. ముత్యాలహారతి అనంతరం స్వామికి నివేదింపబడిన పాలు మేవాప్రసాదం భక్తులకు పంచబడుతుంది. 
 
మళ్ళీ తెల్లవారుజామున సుప్రభాత సేవాసమయంలో బంగారు వాకిలి ముందు సుప్రభాత పఠన జరుగుతుండగా బంగారువాకిలి లోపల అర్చక స్వాములు పట్టుపానుపుపై శయనించి ఉన్న భోగశ్రీనివాసమూర్తికి ఉపచారంలను సమర్పించి శయనమండపం నుంచి యథాప్రకారంగా గర్భాలయంలోనికి తీసుకొని స్వామివారి మూలవరుల పాద పీఠం చెంత వేంచేపు చేస్తారు. ఇలా భోగశ్రీనివాసమూర్తి వైభోగం అంతా ఇంతా కాదు.. గోవిందా.. గోవిందా...! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాయత్రి మంత్రానికి వాల్మీకి రాసిన 24వేల రామాయణ శ్లోకాలకు సంబంధం ఉందా?