Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ ఇంద్రియాలను వాటికోసమే వాడుకోవాలి..

ఈ ఇంద్రియాలను వాటికోసమే వాడుకోవాలి..
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (22:38 IST)
మనిషికి మొత్తం పది ఇంద్రియాలుంటాయి. అందులో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాల ద్వారా మనం కర్మల చేస్తాం. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సంపాదిస్తాం.

ఈ ఇంద్రియాల ద్వారా మనిషి అనేక రకాలైన భోగాలను అనుభవిస్తుంటాడు. కర్మేంద్రియాల ద్వారా మనం శరీరాన్ని పోషించుకుంటాం. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తాం. ఈ ఇంద్రియాలను వాటికోసమే వాడుకోవాలి కానీ భోగానికి కాదు. భోగంలో పడేవాడు రోగాలపాలవుతాడు. అగచాట్ల పాలవుతాడు. లక్ష్యాలను సాధించలేకపోతాడు. లక్ష్యాలను సాధించాలంటే బుద్ధి తేజోవంతంగా వుండాలి. 
 
ప్రమాదం పొంచి వున్నదని అర్థం కాగానే తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుంది. అలాగే ప్రజ్ఞావంతుడు ఉన్నతమైన లక్ష్యాన్ని చూసి, అల్పమైన ఇంద్రియ భోగాలను విడిచిపెడతాడు. అతడి బుద్ధి ఎప్పుడూ స్థిరంగా వుంటుంది.
 
అర్జునుడు తన గురువుకి ఉదయాన్నే కమండలాల్లో నీళ్లు తెచ్చిచ్చి వినమ్రంగా పాఠాలు నేర్చుకునేవాడు. ఒకరోజు రాత్రి భోజనంవేళ గాలికి దీపం ఆరిపోయింది. వెలుగు లేకపోయినా చేతిలోని ఆహారం నోటి దగ్గరకే పోవడం గమనించి చీకటిలో కూడా బాణాలు వేయవచ్చుననే తలంపు అతడికి కలిగింది. ఆ విధంగా అతడు బాల్యోచితమైన ఆటపాటలు మాని రాత్రిళ్లు కూడా అస్త్రవిద్యను అభ్యసించేవాడు. అందుకే అర్జునుడిపేరు శాశ్వతంగా నిలిచిపోయింది. అతడి శ్రద్ధను చూసి ద్రోణుడు మాటిస్తూ... నిన్ను లోకైక ధనుర్థారిగా చేస్తానని ప్రోత్సహించాడు. ఎవరైతే దీక్షతో తపస్సు చేస్తారో వారికి వరాలు నిశ్చయంగా కలుగుతాయి. తపస్సులో ముఖ్యభాగం ఇంద్రియభోగాన్ని విడిచిపెట్టడం.
 
లక్ష్య సాధన తర్వాత కలిగే అద్భుతమైన ఫలితాలను సాధించాలంటే విద్యార్థులు, యువత తాత్కాలికమైన ఇంద్రియ భోగాలను విడిచిపెట్టాలి. బలవంతంగా ఎవరైనా ఇంద్రియ భోగాలను అందించాలని ప్రయత్నిస్తే తాబేలులా ఇంద్రియాలను లోపలికి ముడుచుకోవాలి. ఇంద్రియాలు ఆయా ఇంద్రియార్థాల మీదకు వెళితే బుద్ధి లక్ష్యం మీద నిలువదు. కనుక ఇంద్రియాలను నిగ్రహించి, తగురీతిన వాటిని వాడుకుంటూ లక్ష్యసాధనలో నిలవడమే తక్షణ కర్తవ్యంగా భావించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం