Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో సర్వం దొరుకుతాయ్.. మద్యం నుంచి బార్ గర్ల్స్ వరకు...

తిరుమల.. ఆధ్మాత్మిక క్షేత్రం. ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ ప్రాంతానికి వస్తుంటారు. రోజు 60 నుంచి 70 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు.

తిరుమలలో సర్వం దొరుకుతాయ్.. మద్యం నుంచి బార్ గర్ల్స్ వరకు...
, గురువారం, 2 జూన్ 2016 (16:05 IST)
తిరుమల.. ఆధ్మాత్మిక క్షేత్రం. ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ ప్రాంతానికి వస్తుంటారు. రోజు 60 నుంచి 70 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. సెలవు దినాలైతే చెప్పనవసరం లేదు. ఆ సంఖ్య మరింతగా పెరుగుతుంది. 75 వేల నుంచి 90 వేల మందికిపైగా భక్తులు తిరుమల గిరులకు వస్తుంటారు. అలాంటి క్షేత్రంలో నిషేధిత వస్తువులకు అస్సలు అనుమతిలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు అయినప్పటి నుంచి నిషేధిత వస్తువులను నిలిపివేశారు. 
 
నిషేధిత వస్తువులంటే మద్యం, మాంసం, తుపాకులు ఇలాంటివి తీసుకెళ్ళకూడదు. వ్యభిచారం అనే మాట అసలు ఈ ప్రాంతంలో వినపడకూడదు. ఆధ్మాత్మిక వాతావరణమే ఇక్కడ ఉండాలి. 'గోవిందా.. గోవిందా' అనే నినాదాలు చేయాలి. అంతటి ప్రాశస్త్యం కలిగిన తిరుమలలో ఎ టు జెడ్‌ అన్నీ దొరుకుతాయంటే ఇప్పటికీ చాలా మంది నమ్మరు. కానీ అది నిజం. తిరుమలలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం, మాంసంలను ఇప్పటికీ విక్రయిస్తున్నారు. ఆదివారాలైతే చాలు తిరుమలలో నివాసముంటున్న వారి ఇళ్ళ నుంచి మాంసం వాసన వస్తుంటుంది. కొంతమంది భయపడకుండా మాంసంను వండితే మరికొంతమంది మాత్రం భయపడి తలుపులు వేసుకుని మాంసం కూరను తయారు చేసుకుని ఆరగిస్తుంటారు. 
 
ప్రధానంగా తిరుమలలో బాలాజీనగర్‌ అనే ప్రాంతం ఉంది. ఎన్నో యేళ్ళ నుంచి తిరుమలకు చెందిన స్థానికులు ఈ ప్రాంతంలో నివాసముంటున్నారు. భద్రత దృష్ట్యా కొంతమంది స్థానికులను తితిదే తిరుపతికి తరలించి వారికి షాపులు, ఇళ్లను నిర్మించి ఇచ్చింది. కానీ కొంతమంది తాము తిరుమలను వదిలేది లేదని కోర్టుకు వెళ్ళారు. దీంతో బాలాజీనగర్‌ అనే ప్రాంతంలో స్థానికులు ఇప్పటికీ ఉంటున్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది బయటి వ్యక్తులు ప్రవేశించి నివాసముంటున్నారు. కోయ జాతికి చెందిన కొంతమంది తిరుమలలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. 
 
శంఖుమిట్ట, హెచ్‌డి కాంప్లెక్స్, బస్టాండ్, ఆస్థాన మండపం, తితిదేకి సంబంధించిన కొన్ని వసతి సముదాయాల వద్ద ఈ కోయజాతికి చెందిన వారు పూసలు, పగడాలను భక్తులకు విక్రయిస్తుంటారు. వీరే నిషేధిత వస్తువులను బాలాజీనగర్‌లోని స్థానికులకు తీసుకెళ్ళి విక్రయిస్తున్నారు.
 
తిరుమల నుంచి తిరుమలకు వెళ్ళే మార్గంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తుంటారు. అయితే డ్రైవర్‌, కండెక్టర్‌లను మాత్రం పంపేస్తారు విజిలెన్స్, నిఘా సిబ్బంది. ఇదే అసలు కథకు తెరలేపుతోంది. 
 
డ్రైవర్లే ప్రధానంగా సీట్ల కింద మాంసం, మద్యంను తీసుకెళుతున్నారు. ఇలా తిరుమలకు తీసుకొచ్చి కోయ వాళ్ళకు అందిస్తున్నారు. తిరుపతిలో డ్రైవర్లకు మద్యం, మాంసంను తెచ్చి ఇచ్చేది కోయజాతి ప్రజలే. వాటిని తిరుమలలోను తీసుకుని నాలుగురెట్లు అధికంగా విక్రయిస్తుంటారు. తిరుపతిలో కిలో మాంసం 400 రూపాయలు అమ్మితే తిరుమలలో 2 వేల రూపాయలకుపైగానే అమ్ముతున్నారు. మద్యం పరిస్థితి కూడా అదే. ఎంఆర్‌పి ధర కన్నా నాలుగు రెట్లు అధికం. 
 
తిరుమలలోని బాలాజీనగర్‌ వాసులకు వీటిని విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు కోయజాతికి చెందిన వారు. గతంలో ఎంతోమంది కోయవాళ్ళను తితిదే అదుపులోకి తీసుకుని పోలీసులకు కూడా అప్పగించింది. అయినా సరే వారిలో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. జైలుకు వెళ్ళివచ్చినా సరే కోయ వాళ్ళు మాత్రం అదే పనిని కొనసాగిస్తున్నారు. 
 
ఇక అసలైనది వ్యభిచారం. కోయ వాళ్ళే చాలామంది వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు సమాచారం. తితిదే చెందిన సముదాయాల్లో గదులు అద్దెకు తీసుకుని కోయవాళ్ళు తీసుకు వచ్చిన వారితో ఈ తతంగాన్ని కానిచ్చేస్తున్నారు. తిరుమల వంటి ధార్మిక క్షేత్రంలో వీరు ఇంతగా తెగించారంటే వీరి వెనుక ఎవరో పెద్ద హస్తం ఉన్నట్లు ఆరోపణలు లేకపోలేదు. విజిలెన్స్, నిఘా సిబ్బందికి ఆమ్యామ్యాలు ఇవ్వడంతో వీరి చేస్తున్న పనులకు వారు ఏ మాత్రం అడ్డు రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా తితిదే ఉన్నతాధికారులు దీనిపై స్పందించాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం సాయినాధుని పూజ ఎలా చేయాలంటే....?