Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్ప భయం తొలగిపోవాలంటే "నాగారాధన" చేయండి

Advertiesment
నాగ పంచమి
FILE
"శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః
పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ
విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ"

ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.

చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి.

లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

అందుచేత శ్రావణమాసం శనివారం (ఆగస్టు 14వ తేదీ) వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి.

ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu