ఫాల్గుణ నృసింహ ద్వాదశి నాడు గంగానదిలో స్నానం చేస్తే..!?
ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా వ్రత సమాహారంగా పేర్కొంటారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణ మాసం. శిశిర రుతువుకు ముగింపు పలికే ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం, విదియనాడు మధూకం వంటి వ్రతాలను చేస్తారు. అలాగే ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్నగణపతి వ్రతం చేస్తారు. పంచమి నాడు అనంత పంచమీవ్రతం, సప్తమినాడు ఆర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు, అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమీ వ్రతం, ఏకాదశీ నాడు అమలక (ఉసిరి), ఏకాదశి, ద్వాదశి నాడు గోవింద ద్వాదశి, చతుర్దశి రోజు మహేశ్వర వ్రతం, లలిత కాంతి వ్రతం జరుపుతుంటారు. అందుచేత ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి (మార్చి 17)న వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఫాల్గుణ శుద్ద ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి గంగాస్నానం పాపనాశనమని పురోహితులు చెబుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం, ఆ రోజున మహిళలు సీతామాత పూజ, విష్ణుపూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. ఇంకా ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ, పుత్ర లాభాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.