పండంటి కాపురంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి మాటలు ప్రస్తావనకు రాకూడదు?
వైవాహిక జీవితంలో స్థిరపడిపోయిన భార్యాభర్తల మధ్య కొన్ని మాటలు ప్రస్తావనకు రాకుండా ఉండటమే ఉత్తమం. అలాంటి దంపతులే పది కాలాల పాటు పండంటి కాపురం కొనసాగిస్తారట.
వైవాహిక జీవితంలో స్థిరపడిపోయిన భార్యాభర్తల మధ్య కొన్ని మాటలు ప్రస్తావనకు రాకుండా ఉండటమే ఉత్తమం. అలాంటి దంపతులే పది కాలాల పాటు పండంటి కాపురం కొనసాగిస్తారట. పైగా, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినపుడు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకచోట తగ్గాల్సిందేనని నిపుణులు అభిప్రాయడుతున్నారు. అయితే, దాంపత్యంలో భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్యా ఎంత చనువున్నప్పటికీ.. కొన్ని అనకూడని మాటలు ఓసారి పరిశీలిస్తే...
* జీవిత భాగస్వామితో ఏదైనా చిన్న గొడవ వచ్చిన వేళ సాధారణంగా వినిపించే పదం 'నువ్వెప్పుడూ ఇంతే... ఇట్లాగే చేస్తుంటావు. ఇక మారవా?' అంటుంటారు. ఇటువంటి మాటల వల్ల అవతలి వారు ఆత్మన్యూనతలో పడిపోతారు. ఇటువంటి సూటి పోటి మాటలు అనకూడదు.
* దంపతుల మధ్య దూరాన్ని పెంచే మరో మాట "ఎప్పుడూ ఇలానే చేస్తావ్, ఇలానే అంటావ్... అంతకుమించి ఏముంది?"... ఈ తరహా వ్యాఖ్యల వల్ల దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు.
* అలాగే, "నీలాగే మీ వాళ్లు కూడా... వాళ్లూ ఇంతే...". పురుషుడైనా, స్త్రీ అయినా తన అత్తింటి వారిని దూషించడం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అత్తింటి వారి తప్పు వాస్తవమే అయినా, ఈ తరహా వ్యాఖ్యలు అవతలి వారి మనస్సును బాధిస్తాయన్న విషయం మరువకండి.
* మరో ముఖ్యమైన విషయం, జీవిత భాగస్వామి వ్యక్తిత్వం మారిందని చెబుతూ "ఒకప్పుడు బాగున్నావు. ఇప్పుడు మారిపోయావు. అప్పట్లో నన్నెంతో బాగా చూసుకున్నావు. ఇప్పుడు మాట్లాడేందుకు కూడా ఆలోచిస్తున్నావు"... ఈ మాటలు తరచూ భార్య నుంచి భర్తకు ఎదురవుతుంటాయి. ఈ తరహా మాటల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి.