ఆఫీసు పనుల్ని స్వంత విషయాలుగా భావించడం సరైందే. హార్డ్ వర్క్ చేసేవారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఐతే, అదే లోకంగా ఉంటూ రెండో ఆలోచన లేకుండా వ్యక్తిగతాన్ని దూరం చేసుకోకూడదు. ఆఫీసు పనులతో పాటు ఆలోచనల్ని కూడా ఆఫీసు గేటు వెలుపల వదిలేసి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే ఆలోచనలతో సతమతమయితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందే తప్ప ఆశించిన ఫలితం ఉండదు.
చాలామంది ఎదుటివారిని మెప్పించడం కోసం సాధ్యంకాని పనుల్ని నెత్తిమీద వేసుకుని సకాలంలో పూర్తి చేయలేక ఆందోళన పడుతుంటారు. ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా ముగించాలన్న ఆలోచన అవసరం కాని, ఇతరుల మెప్పుకోసం అనుక్షణం తాపత్రయపడే ధోరణి మాత్రం మంచిది కాదు.
ఉద్యోగాన్ని వ్యక్తిగత భద్రత, సంతృప్తులతో సాగించాలి. ఎవరో ఏదో అనుకుంటారని, ఇంకా ఇంకా చేస్తే వారి మంచిదృష్టిలో పడతామని భావిస్తూపోతే, ఏ పనీ సక్రమంగా ఉండదు. అటు వృత్తిపరంగా ఇటు వ్యక్తిగతంగా రెండు ప్రభావితమవుతుంటాయి.