ఏడాది క్రితం మా ఆఫీసులో ఒకతను చేరాడు. అతడిని చూడగానే ఎందుకో తెలియని ఆకర్షణకు లోనయ్యాను. అతడు కూడా నేనంటే ఎంతగానో ఇష్టాన్ని ప్రదర్శించేవాడు. మొదటిరోజే చాలా దగ్గరగా మాట్లాడుకున్నాము. ఐతే మా ఇద్దరికీ అంతకుముందే పెళ్లిళ్లయ్యాయి. మా ఇద్దరి మధ్య తలెత్తిన ఈ ఆకర్షణ ప్రమాదమని తెలిసినప్పటికీ ఉండలేకపోయాము.
ఓరోజు అతడు నన్ను కౌగలించుకోవాలని ఉందని అడిగాడు. నేను అతడి అభ్యర్థనకు సరేనన్నాను. దాంతో 15 నిమిషాల పాటు గట్టిగా కౌగలించుకున్నాడు. అలా కౌగలించుకున్న దగ్గర్నుంచి అతిడికి ఏమైందో తెలియదు కానీ నన్ను పట్టించుకోవడం మానేశాడు. నాతో మాట్లాడటం లేదు. నాకేమో అతడితో కౌగిలి, అతనే గుర్తుకు వస్తున్నాడు. ఏం చేయాలో తెలియడంలేదు...
అతడు కౌగిలించుకోవడంతో మీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోవడమో, మిమ్మల్ని పట్టించుకోవడమో కాదు... ఇప్పటికే వివాహమైన అతడికి తన వైవాహిక జీవితం, కొత్త కౌగిలితో వచ్చే ఇబ్బందులు కళ్ల ముందు కదలాడి ఉంటాయి. దాంతో అతడు దూరంగా జరుగుతూ తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఇలాంటి సంబంధాలు ప్రమాదకరమన్న సంగతి గ్రహించాలి. ఆయన కూడా ఇదే తెలుసుకుని ఉంటాడు. అందువల్లనే ఆ ఆకర్షణ నుంచి బయటపడి మామూలు లోకంలోకి వచ్చాడు. ఇద్దరూ ఆ ఆకర్షణల నుంచి బయటకు రావడం ఇరు కుటుంబాలకు మంచిదన్నది గ్రహించండి.